గో ఫ‌ర్ గోల్డ్‌.. ఆల్ ద బెస్ట్ అమిత్‌

Fri,September 20, 2019 06:20 PM

హైద‌రాబాద్‌: పంగ‌ల్ పంచ్ అదిరింది.. ప్రపంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో ఓ భార‌తీయుడు ఫైన‌ల్‌కు వెళ్ల‌డం చ‌రిత్రాత్మ‌కం. ఇది భార‌త క్రీడాలోకానికి అద్భుత క్ష‌ణం. రష్యా, అమెరికా, క‌జ‌కిస్తాన్, ఉజ్బ‌కిస్తాన్‌ లాంటి దేశాల బాక్స‌ర్ల‌ను మ‌ట్టిక‌రిపిస్తూ మ‌న పంగ‌ల్ వ‌ర‌ల్డ్ ఈవెంట్‌లో దూసుకెళ్లిన తీరు అనిర్వ‌చ‌నీయం. ఫైన‌ల్‌కు ప్ర‌వేశించిన త‌ర్వాత అమిత్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఒక‌వేళ ఫైన‌ల్లో అమిత్ ఓడినా.. మ‌న‌కు సిల్వ‌ర్ మెడ‌ల్ ఖాయం. త‌న‌కు స‌పోర్ట్ ఇచ్చిన వారంద‌రికీ అమిత్ ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఇవాళ జ‌రిగిన సెమీస్‌లో క‌జ‌కిస్తాన్ ప్లేయ‌ర్‌పై అమిత్ గెలుపొందాడు.


నిజానికి అమిత్‌ను చోటా టైస‌న్‌గా పిలుస్తారు. పుట్టిన‌ప్పుడు అత‌ని బ‌రువు కేవ‌లం 1.5 కిలోలే. అత‌ని తండ్రి విజేంద‌ర్ సింగ్ ఓ రైతు. హ‌ర్యానాలోని రోహ‌త్ జిల్లాలో ఉన్న మైనా గ్రామం అత‌నిది. త‌న బ‌రువు క‌న్నా ఎక్కువ బ‌రువున్న కేట‌గిరీలో అమిత్‌ పోటీ చేసి.. ఆసియా క్రీడ‌ల్లో ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. ఆసియా క్రీడ‌ల్లో భారీ భారీ బాక్స‌ర్ల‌ను త‌న టెక్నిక్‌తో ఖంగుతినిపించాడు. ఒలింపిక్‌, ఆసియా చాంపియ‌న్ హ‌స‌న్‌బాయ్ డుమ‌స్తోవ్‌ను మ‌ట్టిక‌రిపించిన తీరు ఓ వండ‌ర్‌. ఇవాళ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ పోటీల్లో అమిత్ 52 కిలోల కేట‌గిరీలో ఫైన‌ల్లోకి ప్ర‌వేశించాడు. గ‌తంలో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో ఇండియా త‌ర‌పున కాంస్య ప‌త‌కం గెలిచిన వారిలో విజేంద‌ర్ సింగ్‌, వికాశ్ కృష్ణ‌, శివ‌థాప్ప‌, గౌర‌వ్ బిదూరీ బాక్స‌ర్లు ఉన్నారు. మొద‌టిసారి అమిత్ వారంద‌ర్నీ వెన‌క్కి నెట్టేస్తూ మ‌రో అడుగు ముందుకు వేశాడు. శ‌నివారం జ‌రిగే ఫైన‌ల్లో అమిత్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెల‌వాల‌ని భార‌త్ ఆశిస్తున్న‌ది. అత‌నికి దేశ‌మంతా అండ‌గా నిలుస్తోంది. గోల్డ్ మెడ‌ల్‌తో భార‌త ఖ్యాతిని ప్ర‌పంచం న‌లుదిశ‌లా చాటాల‌ని కూడా అమిత్‌కు న‌మ‌స్తే తెలంగాణ విషెస్ చెబుతోంది. ఆల్ ద బెస్ట్ అమిత్‌.

1947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles