షాకింగ్.. ఆ ఇద్దరు టాప్ ప్లేయర్సే మ్యాచ్ ఫిక్సర్లు!

Mon,July 30, 2018 06:11 PM

former Sri Lanka cricket chief reveals countrys first match fixers

కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సంచలన విషయాలను వెల్లడించారు. శ్రీలంక తరఫున మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడింది వీళ్లే అంటూ ఇద్దరు మాజీ క్రికెటర్ల పేర్లను ఆయన బయటపెట్టారు. సుమతిపాల బయటపెట్టిన ఇద్దరూ 1996 వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లో సభ్యులు కావడం విశేషం. అందులో ఒకరు ఆ టీమ్ కెప్టెన్ అర్జున రణతుంగ కాగా.. మరొకరు టీమ్‌లో కీలక ప్లేయర్, వైఎస్ కెప్టెన్ అరవింద డిసిల్వా. శ్రీలంక క్రికెట్‌కు మూలస్తంభాల్లాంటి ఈ ఇద్దరే టీమ్ తరఫున తొలిసారి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని సుమతిపాల చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి వీళ్లు 15 వేల డాలర్లు తీసుకున్నారని కూడా సుమతిపాల వెల్లడించారు. గుప్తా అనే పేరు గల వ్యక్తి నుంచి ఈ ఇద్దరూ 15 వేల డాలర్లు తీసుకున్నారు అని ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సుమతిపాల చెప్పారు.

తాను బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రణతుంగ, డిసిల్వాలపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదని విమర్శలు వచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే గతంలో ఇదే సుమతిపాలపై రణతుంగ తీవ్ర ఆరోపణలు చేశాడు. సుమతిపాలతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కొందరు బుకీలతో సంబంధాలున్నాయని కూడా రణతుంగ ఆరోపించాడు. శ్రీలంక క్రికెట్, బోర్డు ప్రతిష్ట దెబ్బతినడానికి ఆయన అవినీతి పాలనే కారణమని కూడా విమర్శించాడు. నిజానికి రణతుంగ సోదరుడు నిషాంత బోర్డు అధ్యక్ష పదవి కోసం సుమతిపాలతో పోటీ పడ్డాడు. అయితే మే 30న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని నిషాంత కోర్టుకెక్కడంతో ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం అక్కడి క్రీడాశాఖ తాత్కాలిక బోర్డును ఏర్పాటు చేసి క్రికెట్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.

3608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles