కోల్‌కతాకు షాక్..మ‌రో ప్లేయ‌ర్ లీగ్‌కు దూరం

Sat,April 14, 2018 05:45 PM

Foot injury rules KKR's Nagarkoti out of IPL 2018


కోల్‌కతా: ఐపీఎల్-11లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా అండర్-19 సంచలనం, ఆ జట్టు యువపేసర్ కమ్లేష్ నాగర్‌కోటీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 18ఏళ్ల కమ్లేష్ స్థానంలో కర్ణాటక స్పీడ్‌స్టర్ ప్రసిద్ కృష్ణను ఫ్రాంఛైజీ ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రసిద్ కర్ణాటక తరఫున 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 19లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్ ఆరంభానికి ముందే అతడు పాదం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. సీజన్ ఆరంభంలోగా అతడు కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తాడని కేకేఆర్ యాజమాన్యం భావించింది.

అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కమ్లేష్ తమ జట్టు తరఫున ఆడి రాణిస్తాడని ఆశించిన కోల్‌కతాకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కమ్లేష్‌కు అనూహ్యంగా రూ.3.2కోట్లకు కోల్‌కతా దక్కించుకుంది. గాయం కారణంతో కోల్‌కతా ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను దూరం చేసుకుంది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించిన కోల్‌కతా.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడి ఓడింది. శనివారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వరుస విజయాలతో ఊపుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడనుంది.

3895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles