ఇదేం టీమ్ సెలక్షన్!

Mon,October 2, 2017 12:40 PM

Fans question Ashish Nehras inclusion in T20 Series Against Australia

ముంబై: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను 4-1తో గెలిచిన టీమిండియా ఓవైపు సంబురాలు చేసుకుంటుండగానే మరోవైపు మూడు టీ20ల సిరీస్ కోసం టీమ్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఈ టీమ్‌ను చూడగానే సగటు టీమిండియా అభిమాని కూడా ముక్కున వేలేసుకున్నాడు. ఇదెక్కడి టీమ్ సెలక్షన్ అంటూ సెలక్టర్లపై మండిపడుతున్నారు. ఈ టీమ్‌ను చూడగానే ఓ పేరు ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. ఆ పేరు మరేదో కాదు.. ఆశిష్ నెహ్రాది. 38 ఏళ్ల నెహ్రాను ఓ టీ20 టీమ్‌కు ఎంపిక చేయడం ఏంటి అన్న అనుమానం కలగక మానదు. ఓవైపు ఆట కన్నా ఫిట్‌నెస్ ముఖ్యమంటూ యొ యొ టెస్టులు పెట్టి మరీ టీమ్‌లోకి తీసుకుంటున్నామని కోహ్లి చెబుతున్నాడు. వన్డే సిరీస్‌కు యువరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి చెప్పిన కారణం కూడా ఇదే. అలాంటిది ఏ లెక్కన నెహ్రాను టీమ్‌లోకి తీసుకున్నారన్నది ఎవరి అంచనాలకూ అందని విషయం. 20 ఏళ్ల కుర్రాళ్లకే సవాలుగా ఉండే ఇన్‌స్టాంట్ క్రికెట్ టీ20ల్లో అంతకు రెట్టింపు వయసున్న నెహ్రా ఎలా ఆడతాడనుకున్నాడో సెలక్టర్లకే తెలియాలి. ఈ మధ్య కాలంలో అతను క్రికెట్ ఆడిందీ లేదు. ఫ్యాన్స్ అతని పేరును కూడా దాదాపు మరచిపోయారు.


ఇక ఆశ్చర్యకరంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు మరోసారి హ్యాండిచ్చారు. మంచి హిట్టర్‌గా, టీ20లకు సరిగ్గా పనికొస్తాడని, ధోనీకి వారసుడని భావిస్తున్న పంత్‌ను కాదని.. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న దినేష్ కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. పంత్‌కు చాన్సివ్వకపోవడాన్ని సెలక్టర్లు ఎలా సమర్థించుకుంటారో వాళ్లకే తెలియాలి. అటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అజింక్య రహానేను పక్కన పెట్టారు. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు కూడా టీమ్‌లోకి రావడానికి చాలలేదేమో. వ్యక్తిగత కారణాలు చూపుతూ వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న ధావన్‌ను అతని స్థానంలో తీసుకున్నారు. టెస్టుల్లో హిట్ పెయిర్ అయిన అశ్విన్, జడేజాలను పక్కనపెట్టడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోవచ్చు. కానీ నెహ్రా, కార్తీక్‌ల ఎంపిక.. రహానేను పక్కన పెట్టడం మాత్రం ఎవరికీ అంతుబట్టనిదే.
2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles