సూపర్ ఓవర్ కూడా 'టై'గానే .. విశ్వవిజేత ఇంగ్లండ్..!

Mon,July 15, 2019 12:08 AM

england won the icc world cup 2019 final lifts cup

లండన్: లార్డ్స్ మైదానంలో ఇవాళ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఆశ్చర్యంగా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్‌లో ఇంగ్లండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు. ఇంతకు ముందు వరకు 3 వరల్డ్ కప్‌లలో ఇంగ్లండ్ ఫైనల్స్‌కు చేరుకున్నా కనీసం ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అయితే ఇవాళ్టి విజయంతో ఇంగ్లండ్‌కు ఆ ఒక్క లోటు తీరిపోయింది. మొద‌టిసారిగా ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ గెలిచి ఊపిరి పీల్చుకుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), టామ్ లాథమ్ (56 బంతుల్లో 47 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్‌లు చెరో 3 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లు చెరొక వికెట్ తీశారు.

అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతూ వచ్చింది. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌట్ అయి న్యూజిలాండ్ స్కోరును సమం చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్ (60 బంతుల్లో 59 పరుగులు, 6 ఫోర్లు)లు రాణించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్‌లకు చెరో 3 వికెట్లు దక్కగా, మ్యాట్ హెన్రీ, కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌లకు చెరొక వికెట్ దక్కింది.కొంప ముంచిన ఓవర్ త్రో...


ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన 4వ బంతిని స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా తరలించాడు. ఈ క్రమంలో స్టోక్స్ 2 పరుగులు తీశాడు. అయితే రెండో పరుగును తీసే క్రమంలో స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళ్తూ రనౌట్ నుంచి తప్పించుకోవడం కోసం క్రీజులోకి బ్యాట్‌తో డైవ్ చేశాడు. ఆ సమయంలో న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి తరలింది. దీంతో ఆ బంతికి మొత్తం 2 + 4 = 6 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఆ ఒక్క ఓవర్ త్రో న్యూజిలాండ్‌ను సూపర్ ఓవర్ ఆడేలా చేసింది. చివరి బంతికి ఇంగ్లండ్ 2 పరుగులు చేయాల్సి ఉండగా స్టోక్స్ 2 పరుగులు తీసేందుకు యత్నించాడు. అయితే అవతలి ఎండ్‌లో ఉన్న మరో ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ మార్క్ వుడ్ రనౌట్ అయ్యాడు. దీంతో 1 పరుగు మాత్రమే లభించింది. ఈ క్రమంలో ఇరు జట్ల స్కోర్లు లెవల్ అయి మ్యాచ్ టైగా ముగిసింది.


సూపర్ ఓవర్ కూడా టైగానే..!


న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ టైగా ముగియడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో రూల్స్ ప్రకారం ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌లో 6 బంతులకు 15 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్, బట్లర్‌లు బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ వేశాడు. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో సూపర్ ఓవర్ ఆడిన న్యూజిలాండ్ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్ నీషమ్, గప్తిల్‌లు సూపర్ ఓవర్ ఆడగా, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వేశాడు. అయితే సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. దీంతో మ్యాచ్‌లో బౌండరీలు ఎక్కువగా సాధించిన జట్టు ఇంగ్లండ్ గెలుపొందినట్లు ప్రకటించారు.

3189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles