ఆ ఇద్దరు ఇరగదీశారు.. ఇంగ్లాండ్ 86/6

Fri,August 3, 2018 06:00 PM

England 86/6 at lunch in second innings, lead India by 99 runs

బర్మింగ్‌హోమ్: ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో పిచ్ నుంచి సహకారం లభించడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని భారత బౌలర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్లకు తోడుగా స్లిప్‌లో ఉన్న ఫీల్డర్లు చురుగ్గా కదులుతూ బంతులను ఒడిసి పట్టుకుంటున్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌లో తొలి మూడు వికెట్లను స్పిన్నర్ అశ్విన్ తీయగా.. తరువాతి మూడు వికెట్లను స్పీడ్‌స్టర్ ఇషాంత్ శర్మ కుప్పకూల్చి ఆతిథ్య జట్టును భారీ దెబ్బకొట్టారు. దీంతో మూడో రోజు లంచ్ విరామ సమయానికి 30.4 ఓవర్లలో రూట్‌సేన 6 వికెట్లకు 86 పరుగులు చేసింది. మూడో రోజు పూర్తిగా భారత్‌తే ఆధిపత్యం.

లంచ్ బ్రేక్‌కు మందు ఇషాంత్ అనూహ్యంగా రెచ్చిపోయాడు. 26 బంతుల వ్య‌వ‌ధిలో ఇంగ్లాండ్‌ 3 వికెట్లు నష్ట‌పోయింది. తొలి సెషన్‌లో లయ కోల్పోయిన అతడు సెషన్ ఆఖరి ఓవర్లలో కళ్లుచెదిరే బంతులను వేశాడు. ప్రతీ బంతితో బ్యాట్స్‌మెన్‌కు పరీక్షపెట్టాడు. మిడిలార్డర్‌లో క్రీజులో కుదురుకొని పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న డేవిడ్ మాలాన్(20), జానీ బెయిర్‌స్టో(28)లను పెవిలియన్ పంపి ప్రత్యర్థి జట్టును కష్టాల్లో పడేశాడు. ఆ తరువాత వచ్చిన ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఎక్కువసేపు నిలవలేదు. బుల్లెట్‌లా దూసుకొస్తున్న ఇషాంత్ బంతిని ఆడి స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. ఆ మూడు వికెట్లు స్లిప్‌లోనే దొరికిపోవ‌డం విశేషం. ప్రస్తుతం బట్లర్(1) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లీష్ జట్టు 99 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బౌలర్లు గొప్పగా రాణించడంతో కోహ్లీ ఆనందానికి అవదుల్లేకుండా పోయింది.

4160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles