కెరీర్ స్లామ్ వేటలో జొకోవిచ్..

Sat,May 21, 2016 10:57 AM

Djokovic eyes on French open

పారిస్: ఈ సీజన్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ సంబురానికి వేళైంది. క్లేకోర్టు గ్రాండ్‌స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభమయ్యేది ఆదివారమే. ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల సింగిల్స్ నుంచి టాప్‌సీడ్ జొకోవిచ్ మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటికే మిగతా మూడు గ్రాండ్‌స్లామ్స్ సాధించినా, ఫ్రెంచ్ ఓపెన్ కోసం మాత్రం ఎప్పటినుంచో వేచిచూస్తున్నాడు జొకో. పదకొండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఆడిన జొకోవిచ్ మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు క్లేకోర్టు కింగ్ రఫెల్ నాదల్ చేతిలో ఓడిన జొకో, గతేడాది ఫైనల్లో మాత్రం స్విస్ స్టార్ స్టానిస్లాస్ వారింకాకు టైటిల్ చేజార్చుకున్నాడు. చైనీస్ తైపీకి చెందిన యెన్ సన్ లూతో తొలిరౌండ్ ఆడనున్న జొకోవిచ్‌కు మాజీ ప్రత్యర్థి, క్లేకోర్టు కింగ్ రఫెల్ నాదల్ ఈసారీ తన పార్శంలోనే ఉన్నాడు. వీరిద్దరూ సెమీస్‌లో ఎదురుపడే అవకాశముంది. అయితే, గతేడాది క్వార్టర్స్‌లో నాదల్‌ను చిత్తుచేసిన జొకో ఈసారీ అతనిపై విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

గత కొన్నాళ్లుగా గాయాలబారిన పడుతూ, ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న స్పెయిన్ బుల్‌కు జొకోను ఎదిరించడం కఠిన సవాలే. అందులోనూ వరుసగా గత మూడు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గి జొకో జోరుమీదున్నాడు. చివరిసారిగా రెండేండ్ల క్రితం ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన నాదల్, ఆ తర్వాత ఒక్క మేజర్ టైటిల్ కూడా నెగ్గలేదు. తొలిరౌండ్లో సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా)తో నాదల్ తలపడనున్నాడు. ఇక మరో పార్శం నుంచి డిఫెండింగ్ చాంపియన్, మూడోసీడ్ వారింకాతో బ్రిటన్ కింగ్, రెండోసీడ్ ఆండీ ముర్రే సెమీస్‌లో తలపడే అవకాశాలున్నాయి. క్వాలిఫయర్‌తో ముర్రే తొలిరౌండ్ ఆడనుండగా, చెక్ రిపబ్లిక్ ఆటగాడు లుకాస్ రసోల్‌తో వారింకా ఆరంభరౌండ్లో తలపడనున్నాడు. వీళ్లకు పోటీనిచ్చేందుకు ఆసియా నంబర్‌వన్ నిషికొరి, సోంగా, మారిన్ సిలిచ్‌లాంటి టాప్ ఆటగాళ్లు బరిలో ఉన్నారు. ఇక పదిహేడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడు రోజర్ ఫెదరర్ గాయంతో ఈసారి టోర్నమెంట్‌కు దూరమయ్యాడు.

స్టెఫీ రికార్డు అందుకునేనా?: మహిళల సింగిల్స్‌లో 22వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలోనున్న సెరెనా విలియమ్స్ ఈసారీ ఫేవరెట్‌గా పోటీపడుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ సెరెనా తొలిరౌండ్లో రిబరికోవా (స్లోవేకియా)తో ఆడనుంది. సెరెనా ఈసారి ట్రోఫీ నెగ్గితే, ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (22) నెగ్గిన జర్మనీ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ రికార్డును సమం చేస్తుంది. అయితే, సెరెనాకు ఈసారి టైటిల్ అంత సులువుగా దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే, ఫైనల్ చేరే క్రమంలో సెరెనాకు క్వార్టర్స్‌లో మాజీ నంబర్‌వన్ అజరెంకా, సెమీస్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ కెర్బర్ ఎదురుపడే చాన్స్ ఉంది.

2707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles