ఢిల్లీ దడదడ

Thu,May 3, 2018 02:40 AM

Delhi Daredevils beat Rajasthan Royals by 4 runs

-రాజస్థాన్‌పై 4 పరుగుల తేడాతో గెలుపు
-రిషబ్, శ్రేయాస్, పృథీ సిక్సర్ల జాతర
-బట్లర్ మోత వృథా
ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చెలరేగిపోయింది. వరుస పరాజయాలను మైమరిపిస్తూ.. పృథ్వీ షా, కొత్త కెప్టెన్ శ్రేయాస్, రిషబ్ చూపెట్టిన ఫోర్లు, సిక్సర్ల జాతర ముందు రాజస్థాన్ బౌలర్లు మూగబోయారు. ఫలితంగా గత ఐదు సీజన్లలో తమను ఏడుసార్లు ఓడించిన రాజస్థాన్‌పై కసిదీరా ప్రతీకారం తీర్చుకుంది. మరోవైపు బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. మిగతా బ్యాట్స్‌మన్ వైఫల్యంతో రాజస్థాన్ జట్టు గట్టెక్కించలేకపోయింది.

న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో ఇంటాబయటా విమర్శపాలైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ తొలిసారి తన సత్తా ఏంటో చూపెట్టింది. అనుభవజ్ఞులను కాదని కుర్రాళ్లకు ఎందుకు పెద్ద పీట వేసిందో ఇప్పుడు ఆర్థమైంది. ముగ్గురే ముగ్గురు.. వయసు 23 లోపే.. కానీ వాళ్లు కొట్టిన షాట్లు.. ఆడిన తీరు చూస్తే.. ఐపీఎల్‌కు వాళ్ల అవసరం ఎంతుందో తెలిసొచ్చింది. రిషబ్ పంత్ (29 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), శ్రేయాస్ అయ్యర్ (35 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), పృథ్వీ షా (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది. టాస్ తర్వాత భారీ వర్షం పడటంతో ఈ మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ నాలుగో బంతికే మున్రో (0) ఔటైనా.. కొత్త కెప్టెన్ శ్రేయాస్‌తో కలిసి పృథ్వీ షా దుమ్మురేపాడు. మూడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్, తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ స్కోరు 48/1 స్కోరు చేసింది.

అయితే 8వ ఓవర్‌లో సులభమైన రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇక్కడి నుంచి శ్రేయాస్, రిషబ్.. రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్ తగ్గకుండా చూడటంతో 10 ఓవర్లలోనే స్కోరు 100కు చేరింది. 12వ ఓవర్‌లో శ్రేయాస్ ఓ సిక్స్ బాదితే.. తర్వాత 11 బంతుల్లో రిషబ్ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 పరుగులు పిండుకున్నాడు. ఆ వెంటనే మరో సిక్స్, ఫోర్‌తో కేవలం 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. శ్రేయాస్ కూడా 34 బంతుల్లో ఫీఫ్టీ మార్క్ అందుకున్నాడు. కానీ 15వ ఓవర్‌లో నాలుగు బంతుల తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. వీరి మధ్య మూడో వికెట్‌కు 43 బంతుల్లో 92 పరుగులు సమకూరాయి. విజయ్ శంకర్ (6 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడి ఔట్‌కాగా, మ్యాక్స్‌వెల్ (5) మరోసారి నిరాశపర్చాడు.

butler

బట్లర్ మోత..

వర్షం ముప్పు పొంచి ఉండటంతో రాజస్థాన్ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151 పరుగులుగా సవరించారు. దీనిని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 12 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులే చేసింది. బట్లర్ (26 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మోత మోగించాడు. షార్ట్ (11 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన బట్లర్ తొలి ఓవర్‌లోనే ఫోర్, సిక్స్‌తో14 పరుగులు సాధించాడు. రెండో ఓవర్‌లో షార్ట్ ఫోర్ కొట్టినా.. రివ్యూలో బతికిబయటపడ్డాడు. ఆవేశ్ ఖాన్ వేసిన మూడోఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఫోర్‌తో 23 పరుగులు పిండుకున్నాడు. ఇదే జోరుతో సిక్స్, ఫోర్ బాదడంతో నాలుగు ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 58 పరుగులు చేసింది. మిశ్రా వేసిన ఐదోఓవర్ తొలి బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా రివర్స్ స్వీప్ చేసిన బట్లర్ 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రాజస్థాన్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫీఫ్టీ. తర్వాతి ఓవర్‌లోనూ ఇదే జోరు చూపినా.. ఏడో ఓవర్‌లో అనూహ్యంగా స్టంపౌటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. క్రీజులోకి వచ్చిన శామ్సన్ (3) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా 9వ ఓవర్‌లో బౌల్ట్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. తొలి బంతికి శామ్సన్‌ను ఆఖరి బంతికి స్టోక్స్ (1)ను ఔట్ చేసి షాకిచ్చాడు. రాజస్థాన్ స్కోరు 100 పరుగులకు చేరడంతో విజయసమీకరణం 18 బంతుల్లో 51 పరుగులుగా మారింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో షార్ట్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి తర్వాతి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. 12 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో త్రిపాఠి (9), గౌతమ్ (18 నాటౌట్) పోరాడినా స్వల్ప తేడాతో ఓటమి తప్పలేదు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 23 పరుగులు జోడించినా ప్రయోజనం లేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు:

ఢిల్లీ డేర్‌డెవిల్స్: 196/6 (రిషబ్ 69, శ్రేయాస్ 50, పృథ్వీ షా 47, ఉనాద్కట్ 3/46),
రాజస్థాన్ రాయల్స్: 146/5 (బట్లర్ 67, షార్ట్ 44, గౌతమ్ 18, బౌల్ట్ 2/26).
ipl-table

4298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles