రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు

Sun,May 5, 2019 03:09 AM

-రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
-పంత్ పరాక్రమం
-పరాగ్ అర్ధసెంచరీ వృథా
న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ.. సొంతగడ్డపై ఐపీఎల్ సీజన్‌ను విజయంతో ముగించింది. ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఇతర మ్యాచ్‌ల సమీకరణాలపై ఆధారపడ్డ రాజస్థాన్ ఆశలకు ఓటమితో గండికొట్టింది. దీంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై గెలిచింది. రాయల్స్ నిర్దేశించిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి ఛేదించింది. రిషబ్ పంత్ (38 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టాడు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు సాధించిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ 11 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఓపెనర్లు ధవన్ (16), పృథ్వీ షా (8) మెరుపు ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. కానీ నాలుగో ఓవర్‌లో ఇష్ సోధీ (3/26) వరుస బంతుల్లో ఈ ఇద్దర్ని ఔట్ చేయడంతో క్యాపిటల్స్ 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (15), రిషబ్ వేగంగా ఆడుతూ మూడో వికెట్‌కు 25 బంతుల్లోనే 33 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. అయితే 8వ ఓవర్‌లో అయ్యర్ వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. వరుస విరామల్లో ఇంగ్రామ్ (12), రూథర్‌ఫోర్డ్ (11)ను కూడా చేజార్చుకుంది. అయినా ఓ ఎండ్‌లో పంత్ స్థిరంగా ఆడుతూ విజయానికి కావాల్సిన రన్‌రేట్‌ను సాధించిపెట్టాడు. చివర్లో సోధీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో అటు ఫీఫ్టీ మార్క్, ఇటు గెలుపు ఫీట్‌ను పూర్తి చేశాడు. మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

పరాగ్ ఒక్కడే..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. లైనప్ మొత్తంలో రియాన్ పరాగ్ (49 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో పేసర్ ఇషాంత్ (3/38) దెబ్బకొడితే తర్వాత లెగ్ స్పిన్నర్ మిశ్రా (3/17) రాజస్థాన్‌ను బెంబేలెత్తించాడు. దీంతో రాయల్స్‌కు సరైన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లే ముగిసేసరికి ఓపెనర్లు రహానే (2), లివింగ్‌స్టోన్ (14)తో పాటు శామ్సన్ (5), లోమ్రోర్ (8) పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్ స్కోరు 30/4గా మారింది.

ఇందులో మూడు వికెట్లు ఇషాంత్ ఖాతాలోకే వెళ్లాయి. ఈ దశలో పరాగ్, శ్రేయాస్ గోపాల్ (12) ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేశారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌తో ముందుకెళ్తూ వికెట్లను కాపాడుకున్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 27 పరుగులు జోడించారు. కానీ 12వ ఓవర్‌లో మిశ్రా వరుస బంతుల్లో గోపాల్, బిన్నీ (0)ని ఔట్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్ కూడా దక్కే అవకాశం ఉన్నా.. గౌతమ్ (6) ఇచ్చిన క్యాచ్‌ను లాంగాఫ్‌లో బౌల్ట్ జారవిడిచాడు. అయినా మిశ్రా ప్రయత్నం వృథా కాలేదు. తన తర్వాతి ఓవర్‌లో గౌతమ్ వికెట్ పడగొట్టి స్కోరు బోర్డుకు పగ్గాలు వేశాడు. 17వ ఓవర్‌లో పరాగ్.. రెండు ఫోర్లతో 18 పరుగులు రాబట్టినా.. రెండోఎండ్‌లో సహకారం లేకపోవడంతో రాజస్థాన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్: రహానే (సి) ధవన్ (బి) శర్మ 2, లివింగ్‌స్టోన్ (బి) శర్మ 14, శామ్సన్ రనౌట్ 5, లోమ్రోర్ (సి) పంత్ (బి) శర్మ 8, గోపాల్ (స్టంప్) పంత్ (బి) మిశ్రా 12, పరాగ్ (సి) రూథర్‌ఫోర్డ్ (బి) బౌల్ట్ 50, బిన్నీ (సి) పంత్ (బి) మిశ్రా 0, గౌతమ్ (సి) శర్మ (బి) మిశ్రా 6, సోధీ (సి) మిశ్రా (బి) బౌల్ట్ 6, ఆరోన్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 115/9. వికెట్లపతనం: 1-11, 2-20, 3-26, 4-30, 5-57, 6-57, 7-65, 8-95, 9-115. బౌలింగ్: బౌల్ట్ 4-0-27-2, ఇషాంత్ 4-0-38-3, అక్షర్ పటేల్ 4-0-16-0, మిశ్రా 4-0-17-3, పాల్ 3.1-0-15-0, రూథర్‌ఫోర్డ్ 0.5-0-2-0.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (బి) సోధీ 8, ధవన్ (సి) పరాగ్ (బి) సోధీ 16, అయ్యర్ (సి) లివింగ్‌స్టోన్ (బి) గోపాల్ 15, పంత్ నాటౌట్ 53, ఇంగ్రామ్ (సి) రహానే (బి) సోధీ 12, రూథర్‌ఫోర్డ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) గోపాల్ 11, అక్షర్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 16.1 ఓవర్లలో 121/5. వికెట్లపతనం: 1-28, 2-28, 3-61, 4-83, 5-106. బౌలింగ్: గౌతమ్ 4-0-16-0, ఆరోన్ 2-0-21-0, థామస్ 1-0-13-0, సోధీ 3.1-1-26-3, గోపాల్ 4-0-21-2, పరాగ్ 1-0-14-0, బిన్నీ 1-0-6-0.

ipl-table

ipl-runs-wickets

1394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles