క్వాలిఫయర్‌-2.. ఫైనల్‌ చేరేదెవరో..

Fri,May 10, 2019 04:54 PM

విశాఖపట్నం: తొలి సారి ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉత్సాహంగా ఉన్న జట్టు ఓ వైపు.. రికార్డు స్థాయిలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన‌ టీమ్ మరోవైపు. ఫైన‌ల్ బెర్తు కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. విశాఖ తీరం ర‌స‌వ‌త్త‌ర పోరుకు వేదికైంది.


ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ జోరుమీదుంటే.. సొంతగడ్డపై క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై మరోసారి రోహిత్ సేనను ఢీకొట్టాలనే ఉద్దేశంతో బరిలో దిగనుంది. బలమైన బౌలింగ్‌కు ధోనీ వ్యూహాలు తొడవడంతో చెన్నై సునాయాస విజయాలు సాధిస్తూ వస్తే.. బ్యాటింగ్ బలానికి రబాడ మెరుపు స్పెల్స్ తోడవడంతో ఢిల్లీ సులువుగానే ప్లే ఆఫ్స్ చేరింది. రికీ పాంటింగ్ కోచింగ్, సౌరభ్ గంగూలీ సలహాలతో తొలిసారి ఓ నాకౌట్ మ్యాచ్ నెగ్గిన కుర్రాళ్లు మరో రెండడుగులేస్తే.. కొత్త చరిత్ర లిఖిస్తారు. తమపై పడ్డ ముద్ర చెరిపేసుకునేందుకు వచ్చిన అవకాశాన్ని క్యాపిటల్స్ అందిపుచ్చుకుంటుందో.. లేక మాస్టర్ మైండ్ మహీ ప్లాన్స్‌కు చిత్తవుతుందో నేడు తేలనుంది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై చేతిలో ఓడటం ఢిల్లీని కాస్త ఇబ్బంది పెడుతున్నా.. ప్రత్యర్థి ఎవరైనా రెచ్చిపోవడమే లక్ష్యంగా బరిలో దిగే ఈ కుర్ర జట్టుకు అదేమంత పెద్ద సమస్య కాకపోవచ్చు. ఓవ‌రాల్‌గా.. ఈ మ్యాచ్‌ను యువ రక్తానికి.. అనుభవానికి మధ్య పోరుగా అభివర్ణించవచ్చు.

డాడీస్ ఆర్మీ..

ముదిరిపోయిన వాళ్లనంత ఒక్కచోట చేర్చి వారికి నాయకత్వం వహిస్తున్న మహా ముదురు మహేంద్రసింగ్ ధోనీనే చెన్నైకు కొండంత అండ. అతడు వికెట్ల వెనుక ఉంటే.. అనామక బౌలర్ కూడా స్టార్‌గా మారిపోతాడు. మరో ఎండ్‌లో మహీ అండగా నిలిస్తే.. లోయరార్డర్ బ్యాట్స్‌మెన్ కూడా భారీ సిక్సర్లు బాదగలడు. అదీ అతడి గొప్పతనం. కీలక సమయాల్లో ఫీల్డింగ్ కూర్పులు, బౌలింగ్ మార్పులు, బ్యాటింగ్ మెరుపులతో ఈ సీజన్‌పై తనదైన ముద్రవేసిన ధోనీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే జోరు కొనసాగిస్తే చెన్నైకి తిరుగుండదు. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ వరుసగా విఫలమవుతుండటం సూపర్‌కింగ్స్‌ను కలవరపెడుతున్నది. రైనా, రాయుడు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారనే చెప్పాలి. ఒకప్పుడు ఐపీఎల్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే రైనాలో మునుపటి జోరు కరువైంది.

కలిసికట్టుగా విజృంభిస్తే.

బ్రేవో బౌలింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ముంబై చేతిలో ఓడిన అనంతరం పిచ్‌ను అంచనా వేయలేకపోయాం. బ్యాట్స్‌మెన్ షాట్ సెలెక్షన్ కొంపముంచిందిఅని ధోనీ అన్నాడు. అలాంటి తప్పులు మళ్లీ చేయద్దని ముందే హెచ్చరించిన తరుణంలో బ్యాట్స్‌మెన్ కలిసికట్టుగా విజృంభిస్తే.. ఢిల్లీకి కష్టకాలమే. బౌలింగ్‌లో సూపర్‌కింగ్స్‌కు తిరుగులేదు. తాహిర్, హర్భజన్, జడేజాతో స్పిన్ త్రయం బలంగా కనిపిస్తుంటే.. కుర్ర పేసర్ దీపక్ చహర్ పవర్ ప్లేలోనే వికెట్లు పడగొట్టి జట్టుకు అండగా నిలస్తున్నాడు.


ఒకరు కాకపోతే మరొకరు..

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఒకరు కాకుంటే మరొకరు ఆడుతున్నారు. యువ సంచలనం పృథ్వీ షాతో కలిసి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ జట్టుకు శుభారంభాలు అందిస్తున్నాడు. ఓ సారి నువ్వైతే.. మరోసారి నేను అన్నట్లు వంతులు వేసుకొని మరీ బంతి అంతు చూస్తున్నారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మున్రో రూపంలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ ఉండటం క్యాపిటల్స్‌కు కలిసొచ్చే అంశం. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపెట్టిన పంత్ మరోసారి చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు. విదేశీ కోటాలో తీసుకున్న నలుగురు ప్లేయర్లలో రబాడను మినహాయిస్తే.. మిగిలిన వారు ఆకట్టుకోలేకపోయినా.. స్వదేశీ ఆటగాళ్లు దుమ్మురేపుతుండటంతో ఇప్పటి వరకు ఢిల్లీపై ఆ ప్రభావం పెద్దగా పడలేదనే చెప్పాలి.

కీలక మ్యాచ్‌లో మున్రో, రూథర్‌ఫోర్డ్ కూడా చెరో చేయి వేస్తే.. క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లోనూ పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. బౌల్ట్ రూపంలో ప్రపంచ శ్రేణి ఫాస్ట్ బౌలర్ ఉండటం కలిసొచ్చే అంశం. ఇషాంత్ కూడా మంచి స్వింగ్‌లో ఉన్నాడు. కీమో పాల్ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తనలో ఇంకా చేవ చావలేదని చాటుతుంటే.. అక్షర్ బౌలింగ్, బ్యాటింగ్, పీల్డింగ్‌లో జట్టుకు ఉపయోగపడుతున్నాడు. ఇప్పటికే ఈ పిచ్‌పై ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉండటం అయ్యర్ బృందానికి కలిసొచ్చే అంశం.

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

2242
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles