హైదరాబాద్‌పై 6 వికెట్లతో చెన్నై గెలుపు

Wed,April 24, 2019 02:42 AM

Chennai Super Kings Win Against SRH

-ప్లేఆఫ్స్ చేరిన సూపర్‌కింగ్స్
-విజృంభించిన వాట్సన్
-హైదరాబాద్‌పై 6 వికెట్లతో గెలుపు
-పాండే, వార్నర్ మెరుపులు వృథా

సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై చెన్నైకి షాకిస్తే.. సూపర్ కింగ్స్ వాళ్లగడ్డపై దానికి ప్రతీకారం తీర్చుకుంది. వారం వ్యవధిలో రెండోసారి తలపడ్డ ఇరు జట్లలో ఈసారి విజయం చెన్నైని వరించింది. ఉప్పల్‌లో రాజు లేని రాజ్యంపై దండెత్తినట్లు రైజర్స్ చెలరేగితే.. ఈ సారి ఆ పని చెన్నై చేసి చూపించింది. వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరబాదుడుకు రైజర్స్ బౌలర్ల సమీకరణాలు మారిపోయాయి. చాలారోజుల తర్వాత మనీశ్ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడినా.. వాట్సన్ విధ్వంసానికి అది తుడిచిపెట్టుకుపోయింది. బెంగళూరుతో మ్యాచ్‌లో ఆశలే లేని స్థితి నుంచి విజయం అంచులదాక చేర్చిన ధోనీ.. ఈ మ్యాచ్‌లో బ్యాట్ పట్టకుండా వికెట్ల వెనక నుంచే కథ నడిపించాడు. మూడు మ్యాచ్‌లకు ముందే ప్లే ఆఫ్స్‌కు ఒక్క విజయం దూరంలో నిలిచిన ధోనీ సేన.. ఈ గెలుపుతో 12వ సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.

చెన్నై: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్ జూలు విదిల్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలిజట్టుగా నిలిచింది. గత మ్యాచ్ ఓటమి అనంతరం మహేంద్రసింగ్ ధోనీ మాట్లాడుతూ.. టాపార్డర్ మరింత బాధ్యతగా ఆడాలి అని అలా అన్నాడో లేదో.. తర్వాతి మ్యాచ్‌లోనే వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆచరించి చూపాడు. 2018 ఐపీఎల్ ఫైనల్‌ను తలపిస్తూ.. సన్‌రైజర్స్ బౌలర్లను ఆడుకున్నాడు. ఫలితంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మనీశ్ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీకి డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడ తోడవడంతో రైజర్స్ మంచి స్కోరు చేయగలిగింది. చెన్నై బౌలర్లలో హర్భజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం షేన్ వాట్సన్ విజృంభించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 176 పరుగులు చేసి గెలిచింది. సురేశ్ రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వాట్సన్ వీరబాదుడు

లక్ష్య ఛేదనలో చెన్నై తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించింది. స్టాండిన్ కెప్టెన్ భువనేశ్వర్ బంతులను ఎదుర్కొనేందుకు వాట్సన్ ఇబ్బందిపడ్డాడు. మూడో ఓవర్ మూడో బంతికి లేని పరుగుకు యత్నించిన డప్లెసిస్ (1).. హుడా వేసిన డైరెక్ట్ త్రోకు పెవిలియన్ బాటపట్టాడు. ఆరంభంలో తడబడ్డ వాట్సన్ ఆ తర్వాత విశ్వరూపం కనబర్చాడు. ఐదో ఓవర్‌లో వాట్సన్ సిక్స్, ఫోర్‌తో జోరు పెంచితే.. మరుసటి ఓవరల్‌లో 4,4,4,4,6 కొట్టిన రైనా 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై 49/1తో నిలిచింది. ఆ తర్వాత వాట్సన్ మరో సిక్స్, ఫోర్‌తో జోరు కొనసాగించాడు. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో పదో ఓవర్ చివరి బంతికి రషీద్‌ఖాన్.. రైనాను ఔట్ చేశాడు. ఈ దశలో మూడు ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో 11 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 85/2తో నిలిచింది. మరుసటి ఓవర్లో జూలు విదిల్చిన వాట్సన్ రెండు ఫోర్లు, సిక్సర్‌తో 19 పరుగులు రాబట్టడంతో పాటు 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రాయుడు (21) నుంచి చక్కటి సహకారం అందడంతో వాట్సన్ పరుగుల వరద పారించాడు. విజయానికి 42 బంతుల్లో 67 పరుగులు సాధించాల్సిన దశలో రషీద్ బౌలింగ్‌ను వీరిద్దరూ ఆడుకున్నారు. రాయుడు ఫోర్, వాట్సన్ 4,6 కొట్టడంతో సమీకరణం 6 ఓవర్లలో 51కి చేరింది. తర్వాత కూడా ఎక్కడా తగ్గని వాట్సన్ రషీద్ ఓవర్‌లో 6,4 ఖలీల్ ఓవర్‌లో సిక్సర్‌తో తొంభైల్లోకి వచ్చేశాడు. విజయానికి 18 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. సెంచరీకి నాలుగు రన్స్ దూరంలో వాట్సన్ ఔటయ్యాడు. చివరి ఓవర్‌లో జాదవ్ (11 నాటౌట్) సిక్సర్‌తో పని సులువు చేశాడు. మూడు బంతుల్లో ఒక్క పరుగు అవసరమైన దశలో రాయుడు ఔటైనా.. మరుసటి బంతికి జాదవ్ సింగిల్ తీసి జట్టుకు విజయాన్నందించాడు. రైజర్స్ బౌలర్లలో సందీప్ (1/54), రషీద్ (1/44) భారీగా పరుగులు ఇచ్చుకున్నారు.

పాండే.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ బయల్దేరే ముందు భారీ స్కోర్లు చేయడంతో పాటు జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు అందించి స్వదేశానికి వెళ్తానాన్న బెయిర్‌స్టో (0) విఫలమయ్యాడు. హర్భజన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఎదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్ చేరాడు. ఆరంభంలో కాస్త తడబడ్డ వార్నర్.. చహర్ బౌలింగ్‌లో ఫోర్, హర్భజన్ ఓవర్‌లో సిక్సర్‌తో టచ్‌లోకి వస్తే.. మనీశ్ పాండే చాలా రోజుల తర్వాత సాధికారికంగా ఆడాడు. సీజన్ ఆరంభం నుంచి మిడిలార్డర్ నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న రైజర్స్‌కు ఈ మ్యాచ్‌లో కాస్త ఉపశమనం లభించింది. హర్భజన్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్సర్‌తో దూకుడు కనబర్చిన పాండే.. వార్నర్‌తో పోటీపడతూ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పాండే 25 బంతుల్లోనే సీజన్‌లో తొలి హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు వార్నర్ కూడా అడపాదడపా బౌండ్రీలు బాదుతూ ముందుకెళ్లాడు. పిచ్ బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించకపోయినా చక్కటి సమన్వయంతో ఆడిన ఈ జోడీ 11 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటించింది. 39 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న వార్నర్.. ధోనీ చురుకైన స్టంపింగ్‌కు డగౌట్ చేరాడంతో రెండో వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత విజయ్ శంకర్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకారంతో పాండే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో భారీ షాట్లు గగనమయ్యాయి. తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసిన రైజర్స్ మలి సగంలో 84 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్‌లో స్ట్రయికింగ్‌లో ఉన్న యూసుఫ్ పఠాన్ (5 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోవడంతో రైజర్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
manish

కొసమెరుపు

33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను కీపర్ బెయిర్‌స్టో ఫుల్ లెంగ్త్ డైవ్ చేసినా అందుకోలేకపోయాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న వాట్సన్ జట్టును విజయపు అంచులకు చేర్చి వెనుదిరిగాడు. లైఫ్ దక్కిన అనంతరం అతడు 63 పరుగులు జోడించడం విశేషం.

కెప్టెన్‌గా భువనేశ్వర్

పేసర్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు చేపట్టాడు. వ్యక్తిగత కారణాలతో కేన్ విలియమ్సన్ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో అతడి స్థానంలో భువనేశ్వర్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. లీగ్ ఆరంభంలో గాయం కారణంగా విలియమ్సన్ దూరమవడంతో కోన్ని మ్యాచ్‌లకు భువీ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు విలియమ్సన్ అందుబాటులో ఉంటాడని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది.

స్కోరుబోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (స్టంప్డ్) ధోనీ (బి) హర్భజన్ 57, బెయిర్‌స్టో (సి) ధోనీ (బి) హర్భజన్ 0, పాండే (నాటౌట్) 83, శంకర్ (సి) జడేజా (బి) చహర్ 26, పఠాన్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 175/3. వికెట్ల పతనం: 1-5, 2-120, 3-167, బౌలింగ్: చహర్ 4-0-30-1, హర్భజన్ 4-0-39-2, జడేజా 4-0-33-0, బ్రేవో 4-0-34-0, తాహిర్ 4-0-38-0.

చెన్నై సూపర్ కింగ్స్: వాట్సన్ (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్ 96, డుప్లెసిస్ (రనౌట్/హుడా) 1, రైనా (స్టంప్డ్) బెయిర్‌స్టో (బి) రషీద్ 38, రాయుడు (సి) శంకర్ (బి) సందీప్ 21, జాదవ్ (నాటౌట్) 11, బ్రేవో (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19.5 ఓవర్లలో 176/4. వికెట్ల పతనం: 1-3, 2-80, 3-160, 4-175, బౌలింగ్: భువనేశ్వర్ 4-1-18-1, ఖలీల్ 4-0-26-0, షకీబ్ 4-0-27-0, సందీప్ 3.5-0-54-1, రషీద్4-0-44-1.

6412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles