పంజాబ్ ఔట్

Mon,May 21, 2018 12:52 AM

Chennai Super Kings beat Kings XI Punjab by 5 wickets

-5 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు
-రెండో స్థానంలోనే ధోనీ సేన
-రాజస్థాన్‌కు నాలుగో బెర్త్ ఖరారు

పుణె: స్లో వికెట్‌పై ఇరుజట్ల బౌలర్లు ఆధిపత్యం చూపించిన వేళ, చెన్నై సూపర్ కింగ్స్‌నే విజయం వరించింది. చివరిదాకా పోరాడి గెలువడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంతోనే సరిపె ట్టుకుంది. చెన్నై బౌలర్లు లుంగీ (4/10), ఠాకూర్ (2/33), బ్రావో (2/39) సత్తా చాటడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (26 బంతుల్లో 54; 3ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే ఆకట్టుకున్నాడు. 154 పరుగుల టార్గెట్‌ను చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. రైనా (48 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చాహర్ (20 బంతుల్లో 39; ఒక ఫోర్, 3 సిక్స్‌లు) విజయంలో కీలకపాత్ర పోషించారు. చెన్నై బౌలర్ ఎంగ్డీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Lungi-Ngidi

స్లో అండ్ స్టడీ..

చెన్నై ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వాట్సన్ స్థానంలో డుప్లెసిస్‌కు అవకాశం ఇచ్చింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో పంజాబ్ బౌలర్లు సైతం ఆదిలో చెన్నై బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. ఫాంలోఉన్న రాయుడు (1)ను మోహిత్ తన రెండో బంతికే ఔట్ చేశాడు. ఆ తర్వాత డుప్లెసిస్ (14), రైనా వరుస ఫోర్లతో ఆకట్టుకున్నారు. ఈ దశలో రాజ్‌పుత్ అద్భుతంగా బౌలింగ్ వేసి వరుస బంతుల్లో డుప్లెసిస్, బిల్లింగ్స్(0) వికెట్లు పడగొట్టాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్భజన్ హ్యాట్రిక్ బంతిని ఎదుర్కొని, తృటిలో బతికిపోయాడు. భజ్జీ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న ఫించ్ నేలపాలు చేశాడు. భజ్జీ కాసేపు బౌండరీలు బాదినా,అశ్విన్ రంగంలోకి దిగి ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన చాహర్ అశ్విన్ వేసిన 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాది మొత్తంగా 21 పరుగుల పిండుకుని జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. ఈ దశలో పంజాబ్‌కు 54 పరుగుల తేడాతో విజయం దక్కే అవకాశం లేదు గనుక రాజస్థాన్ రాయల్స్‌కు ప్లే ఆఫ్ బెర్త్ ఖరారైంది. ఆ తర్వాత చాహర్ ఔటైనా, రైనా, ధోనీ (16 నాటౌట్) గెలుపు లాంఛనం పూర్తి చేశారు. పంజాబ్ బౌలర్లలో రాజ్‌పుత్, అశ్విన్‌కు తలా రెండు వికెట్లు దక్కాయి.

నాయర్ ఒక్కడే..

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ను చెన్నై పేసర్లు దడదడలాడించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (7), క్రిస్ గేల్(0)ను ఎంగ్డీ అద్భుతమైన బంతులతో ఔట్ చేయగా, ఫించ్(4)ను చాహర్ పెవిలియన్‌కు పంపాడు. 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను తివారీ(35), మిల్లర్(24)ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడి కుదురుకుంటున్న సమయంలో జడేజా, తివారీని..బ్రావో, మిల్లర్‌ను ఔట్ చేసి పంజాబ్‌ను మళ్లీ దెబ్బకొట్టారు. కరుణ్ నాయర్ మాత్రం అక్షర్ పటేల్ సహకారంతో చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగి సిక్సర్లతో ధనాధన్ అనిపించాడు. ఈ దశలో పటేల్ (14) వెనుదిరుగగా, మళ్లీ స్పెల్ వేసిన ఎంగ్డీ ఒకే ఓవర్‌లో అశ్విన్ (0), ఆండ్రూ టై (0)ని వెనక్కి పంపాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కరుణ్ దాడి కొనసాగించి 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జోరు పెంచే క్రమంలో నాయర్‌ను బ్రావో బోల్తాకొట్టించాడు. నాయర్ చలువతోనే పంజాబ్ నూటా యాభై పరుగుల మార్క్ దాటింది.

సంక్షిప్త స్కోర్లు:

పంజాబ్: 19.4 ఓవర్లలో 153 ఆలౌట్ (నాయర్ 54, లుంగీ 4/10)
చెన్నై: 19.1 ఓవర్‌లో 159/5 ( రైనా 61 నాటౌట్, రాజ్‌పుత్ 2/19)
ipl-table

3267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles