ఢిల్లీపై ఘన విజయం

Thu,May 2, 2019 03:24 AM

-ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్
-తాహిర్, జడేజా విజృంభణ
-చెన్నై టాప్ షో

చెన్నై సూపర్‌కింగ్స్..పేరుకు తగ్గట్లే మరోమారు అదరగొట్టింది. చాంపియన్ పేరును సార్థకం చేసుకుంటూ ప్రత్యర్థి ఢిల్లీని దడదడలాడించింది. సొంత ఇలాఖాలో తమను ఎవరూ కొట్టలేరంటూ నిరూపిస్తూ టాప్ షోతో కదంతొక్కింది. అన్నీతానై ధోనీ ముందుండి నడిపించిన వేళ.. ఢిల్లీపై విజయాన్నందుకుని తిరిగి నంబర్‌వన్‌లోకి దూసుకెళ్లింది. నత్తలాగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను తనదైన ధనాధన్ శైలిలో ఆడి పోరాడే స్కోరు కట్టబెట్టడంలో మహీ కీలకమైతే..కెప్టెన్ పోరాట స్ఫూర్తిని పుణికిపుచుకున్న స్పిన్నర్లు తాహిర్, జడేజా..ఢిల్లీని 99 పరుగులకే కుప్పకూల్చారు.

చెన్నై: ఐపీఎల్‌లో రెండు టాప్ జట్ల మధ్య వార్ వన్‌సైడ్‌ను తలపించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 80 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత రైనా(37 బంతుల్లో 59, 8ఫోర్లు, సిక్స్), ధోనీ(22 బంతుల్లో 44 నాటౌట్, 4ఫోర్లు, 3సిక్స్‌లు) రాణింపుతో చెన్నై 20 ఓవర్లలో 179/4 స్కోరు చేసింది. సుచిత్(2/28)కు రెండు వికెట్లు దక్కాయి. తర్వాత ఇమ్రాన్ తాహిర్(4/12), జడేజా(3/9) విజృంభణతో ఢిల్లీ 16.2 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. అయ్యర్(44) టాప్‌స్కోరర్. ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు మెరుపు స్టంపింగ్‌లతో ఆకట్టుకున్న ధోనీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

Iyer

ఢిల్లీ ఢమాల్

లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చాహర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పృథ్వీషా(4)..కవర్‌పాయింట్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..ధవన్ ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడ్డారు. వీరిద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదారు. గాడిలో పడిందనుకున్న తరుణంలో హర్భజన్‌సింగ్..ధవన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నంలో భజ్జీ బంతిని అంచనా వేయకపోయిన ధవన్..మూల్యం చెల్లించుకున్నాడు. ధవన్ నిష్క్రమణతో రెండో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. నాలుగు బంతుల వ్యవధిలో రిషబ్ పంత్(5) ఔటయ్యాడు.

tahir
తాహిర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన పంత్..లాంగాఫ్‌లో బ్రావోకు దొరికిపోయాడు. ఇక్కణ్నుంచి ఢిల్లీ ఏ దశలోనూ కుదురుకోలేకపోయింది. పిచ్‌ను ఆసరా చేసుకుంటూ చెన్నై స్పిన్నర్లు హర్భజన్, జడేజా, తాహిర్ వికెట్లు తీయడంలో పోటపడ్డారు. ఫలితంగా క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. ఓవైపు అయ్యర్ నిలదొక్కుకున్నా..అతనికి అండగా నిలిచే వారు కరువయ్యారు. తాహిర్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అక్షర్‌పటేల్(9), రూథర్‌ఫోర్డ్(2)ను ఔట్ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో తానేం తక్కువ కాదన్నట్లు మోరిస్(0), అయ్యర్‌ను బంతి తేడాతో ఔట్ చేయడంతో ఢిల్లీ కుదేలైంది. లేని పరుగు కోసం ప్రయత్నించిన సుచిత్(6)..వాట్సన్ డైరెక్ట్ త్రోతో ఔటైతే.. అమిత్ మిశ్రా(8) ధోనీ క్యాచ్‌తో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.

రైనా, ధోనీ ధనాధన్

తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపాడు. దీనికి తోడు తుఫాన్ ప్రభావంతో వర్షం పడే అంచనాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ..చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ, పిచ్ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ సుచిత్(2/28)..తనదైన శైలిలో చెన్నై ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్‌కు కళ్లెం వేశాడు. దీంతో మొదటి మూడు ఓవర్లు చెన్నై మూడు పరుగులకే పరిమితమైంది. దీనికి తోడు ఫామ్‌లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాట్సన్ ఎనిమిది బంతులు ఎదుర్కొన్నా పరుగుల ఖాతా తెరువలేకపోయాడు. అప్పటికే ఒత్తిడిలో ఉన్న వాట్సన్..భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డీప్ మిడ్‌వికెట్‌లో అక్షర్‌పటేల్ చేతికి చిక్కాడు.

ఆ తర్వాత క్రీజులోకొచ్చిన రైనా..డుప్లెసిస్(39)కు జతకలిశాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే దూకుడు ప్రదర్శించిన రైనా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఓ జట్టు అత్యల్ప పవర్ ప్లే స్కోరుగా నమోదైంది. ఇదే అదనుగా ఢిల్లీ కెప్టెన్ అయ్యర్..చెన్నైపై ఒత్తిడి పెంచుకుంటూ పోవడం కలిసొచ్చింది. స్పిన్నర్లతో బౌలింగ్ చేస్తూ పరుగుల రాకను పూర్తిగా నియంత్రించాడు. అడపాదడపా బౌండరీలు రావడంతో ఓ దశలో చెన్నై స్కోరుబోర్డు నత్తను తలపించింది. ఆడుతున్నది టీ20 మ్యాచ్ లేక టెస్ట్ అన్న రీతిలో చెన్నై బ్యాట్స్‌మెన్ స్కోరుబోర్డును పరిగెత్తించడంలో విఫలమయ్యారు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో డుప్లెసిస్ తొలి సిక్స్ కొట్టాడంటే ఢిల్లీ..ఎలా బౌలింగ్ చేసిందో ఇట్టే అర్థమవుతుంది. 13 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 81/1 పరిమితమైంది. ఇక్కణ్నుంచి డిఫెండింగ్ చాంపియన్ గేరు మార్చింది.

సిక్స్‌తో ఊపుమీద కనిపించిన డుప్లెసిస్...అక్షర్‌పటేల్(1/31) బౌలింగ్‌లో ధవన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. డుప్లెసిస్ స్థానంలో కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మహీ అండతో రైనా రెచ్చిపోయాడు. సుచిత్‌ను లక్ష్యంగా చేసుకుంటూ వరుసగా రెండు ఫోర్లు, సిక్స్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రైనా(59)..ధవన్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. వచ్చిరావడంతోనే జడేజా తనదైన జోరు కనబరిచాడు. మరోవైపు ధోనీ కూడా బ్యాటు ఝులిపించడంతో చెన్నై స్కోరుబోర్డు పరుగు అందుకుంది. మోరిస్(1/47) మరుసటి ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన జడేజా అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక లాభం లేదనుకున్న ధోనీ(44 నాటౌట్) ఆఖరి ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించాడు. తొలి రెండు బంతులు రెండు పరుగులే చేసినా..ఫోర్, రెండు కండ్లు చెదిరే సిక్స్‌లతో 21 పరుగులు పిండుకున్నాడు. రాయుడు(5) నాటౌట్‌గా నిలిచాడు. 13 ఓవర్ల వరకు నెమ్మదిగా సాగిన చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఏడు ఓవర్లలో రైనా, ధోనీ, జడేజా విజృంభణతో 98 పరుగులు కొల్లగొట్టి మెరుగైన స్కోరు 179/4 అందుకుంది.

-చెన్నై మొదట 81 బంతుల్లో 87 పరుగులకే పరిమితమైతే.. ధోనీ రంగ ప్రవేశం తర్వాత 39 బంతుల్లోనే 92 పరుగులు కొల్లగొట్టింది.

స్కోరు బోర్డు

చెన్నై: డుప్లెసిస్(సి)ధవన్(బి)అక్షర్‌పటేల్ 39, వాట్సన్(సి)పటేల్(బి)సుచిత్ 0, రైనా(సి)ధవన్(బి)సుచిత్ 59, ధోనీ 44 నాటౌట్, జడేజా(సి&బి) మోరిస్ 25, రాయుడు 5 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 179/4; వికెట్ల పతనం: 1-4, 2-87, 3-102, 4-145; బౌలింగ్: బౌల్ట్ 4-0-37-0, సుచిత్ 4-0-28-2, మోరిస్ 4-0-47-1, అక్షర్ పటేల్ 3-0-31-1, మిశ్రా 3-0-16-0, రూథర్‌ఫర్డ్ 2-0-19-0.

ఢిల్లీ: పృథ్వీషా(సి)రైనా(బి) చాహర్ 4, ధవన్(బి) హర్భజన్‌సింగ్ 19, అయ్యర్(స్టంప్/ధోనీ)(బి)జడేజా 44, పంత్(సి)బ్రావో(బి)తాహిర్ 5, ఇంగ్రామ్(ఎల్బీ)జడేజా 1, అక్షర్‌పటేల్(సి)వాట్సన్(బి)తాహిర్ 9, రూథర్‌ఫోర్డ్(సి)చాహర్(బి)తాహిర్ 2, మోరిస్(స్టంప్/ధోనీ)(బి)జడేజా 0, సుచిత్ 4 నాటౌట్, మిశ్రా(సి)ధోనీ(బి) తాహిర్ 8, బౌల్ట్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 16.2 ఓవర్లలో 99 ఆలౌట్; వికెట్ల పతనం: 1-4, 2-52, 3-63, 4-66, 5-81, 6-83, 7-84, 8-85, 9-92, 10-99; బౌలింగ్: చాహర్ 3-0-32-1, హర్భజన్‌సింగ్ 4-0-28-1, తాహిర్ 3.2-0-12-4, జడేజా 3-0-9-3, బ్రావో 3-0-18-0.

ipl-table

ipl-runs-wickets

8240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles