భారత బౌలర్ల జోరు.. కివీస్ బేజారు

Wed,January 23, 2019 09:19 AM

Chahal Removes Taylor & Latham in Quick Succession

నేపియర్: న్యూజిలాండ్ గడ్డపై భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వైవిధ్యమైన బంతులతో బౌలర్లు రెచ్చిపోతుండగా.. కళ్లుచెదిరే ఫీల్డింగ్‌తో ఫీల్డర్లు ఆకట్టుకుంటున్నారు. ఆరంభంలోనే తాను వేసిన వరుస ఓవర్లలో ఓపెనర్లిద్దరినీ పేసర్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడకుండా, భాగస్వామ్యాలు నెలకొల్పకుండా తెలివిగా బౌలింగ్ చేస్తూ ఆతిథ్య ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నారు.

యువ స్పిన్నర్ అద్భుతంగా బంతులేస్తూ .. రెండు కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో కీలక ఆటగాళ్లు పెవిలియన్ బాటపట్టారు. విలియమ్సన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్న సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను 15వ ఓవర్లో చక్కని రిటర్న్ క్యాచ్‌తో చాహల్ వెనక్కి పంపాడు. మళ్లీ 19వ ఓవర్లో పేలవ షాట్ ఆడిన లాథమ్ కూడా అలాగే చాహల్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి మైదానాన్ని వీడాడు. తొలి వన్డేలో భారత బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. 19 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 4 వికెట్లకు 77 పరుగులు చేసింది. విలియమ్సన్(27), హెన్రీ నికోల్స్(1) క్రీజులో ఉన్నారు.

1471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles