అజ‌ర్ వ‌చ్చేశాడు.. మ‌రి హెచ్‌సీఏ ప్ర‌క్షాళ‌న జ‌రిగేనా ?

Fri,September 27, 2019 07:19 PM

హైద‌రాబాద్: హైద‌రాబాద్ క్రికెట్ సంఘానికి ఇవాళ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌.. హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. అయితే ఇప్పుడు హెచ్‌సీఏ ప్ర‌క్షాళ‌నే.. అజ‌ర్ ముందున్న ల‌క్ష్యం. హెచ్‌సీఏలో మొత్తం 155 క్ల‌బ్‌లు ఉన్నాయి. మ‌రో 51 ఇన్స్‌టిట్యూష‌న్స్ ఉన్నాయి. గ‌తంలో హెచ్‌సీఏలో తీవ్ర స్థాయిలో అవినీతి జ‌రిగింది. నిధుల‌ను దుర్వినియోగం చేశారు. కొంద‌రు సెక్ర‌ట‌రీలు.. ఏసీబీ రిపోర్ట్‌లోకి ఎక్కారు కూడా. ఇప్పుడు ఆ కేసు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ది. త్వ‌ర‌లోనే అవినీతి తిమింగ‌ళాలు చిక్కే అవ‌కాశాలూ ఉన్నాయి. గ‌తంలో హెచ్‌సీఏ ప‌రిపాల‌న అధ్వాన్నంగా సాగింది. ఇక ఇప్పుడు అజ‌ర్ దాన్ని చ‌క్క‌దిద్ద‌డ‌మే ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌గా కీర్తిగాంచిన అజ‌ర్‌కు హెచ్‌సీఏను మ‌ళ్లీ గాడిలో పెట్ట‌డం పెద్ద విష‌యం కాదు.


కానీ ప్ర‌స్తుతం హెచ్‌సీఏలో జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. కొంత మంది సిబ్బందికి క్రికెట్ సంఘం స‌రైన రీతిలో జీతాలు చెల్లించ‌డంలేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దేశంలోని కొన్ని క్రికెగ్ సంఘాల వ‌ద్ద వంద‌ల కోట్ల మిగులు నిధులు ఉండ‌గా.. హెచ్‌సీఏ మాత్రం దివాలా ద‌శ‌లో ఉన్న‌ది. గ‌త ద‌శాబ్ధ కాలంలో బీసీసీఐ నుంచి సుమారు 600 కోట్ల వ‌ర‌కు హెచ్‌సీఏకు అందాయి. అయితే ఆ డ‌బ్బు ఏమైంద‌న్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌లెత్తుతున్నాయి. అంత భారీ మొత్తాన్ని ఎవ‌రూ ఎలా స్వాహా చేశారో తేలాల్సి ఉన్న‌ది. ఆంధ్ర‌, క‌ర్నాట‌క క్రికెట్ సంఘాలకు వివిధ జిల్లాల్లో మైదానాలు ఉన్నా.. హెచ్‌సీఏ మాత్రం సిటీలో ఇన్నాళ్లూ అద‌నంగా ఒక్క మైదానాన్ని కూడా సొంతం చేసుకోలేక‌పోయింది. ఇప్ప‌టికే ఉప్ప‌ల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ స్టేడియం కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ కాలేదు.

2017లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో అజ‌ర్ పోటీకి నిలిచినా అన‌ర్హుడిగా ప్ర‌క‌టించారు. అప్ప‌ట్లో స్థానిక లీగ‌ల్ అడ్వైజ‌ర్‌ను రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌గా ఎంపిక చేయ‌డంతో కొంత వివాదం ఏర్ప‌డింది. అయితే ఈసారి మాత్రం మాజీ ముఖ్య ఎన్నిక‌ల అధికారి వీఎస్ సంపత్ ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించారు. రెండు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంత‌ప్, మ‌రో 30 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంత‌ప్‌.. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా చేశారు. లోథా క‌మిటీ ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు క్రికెట్ సంఘం అనుభ‌వం ఉన్న సంప‌త్ ఆధ్వ‌ర్యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు పూనుకున్న‌ది. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో క్రికెట్‌ను అభివృద్ధి చేయ‌డ‌మే అజ‌ర్ ముందున్న ల‌క్ష్యం. క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని అజ‌ర్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌నూ త్వ‌ర‌లోనే క‌ల‌వ‌నున్న‌ట్లు హెచ్‌సీఏ ఎన్నిక‌ల్లో గెలిచిన అనంత‌రం అజ‌ర్ మీడియాతో తెలిపారు.

1451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles