ఫించ్‌ను ఔట్ చేయడానికి భువీ వేసిన ఎత్తుగడ చూశారా.. వీడియో

Fri,January 18, 2019 01:22 PM

Bhuvaneshwar Kumar bowled a dead ball to trap Aaron Finch

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడుసార్లూ టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఫించ్.. మూడు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అయితే మూడో వన్డేలోనూ భువీకే వికెట్ సమర్పించుకున్నా.. అతన్ని ఔట్ చేయడానికి భువనేశ్వర్ వేసిన ఎత్తుగడ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎలాగైనా ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్న ఫించ్.. మూడో వన్డేలో క్రీజు నుంచి ఎంతో ముందుకు వచ్చి నిల్చున్నాడు. దీంతో భువీ అతనికి కౌంటర్ ఇచ్చాడు. 9వ ఓవర్ చివరి బంతిని పూర్తిగా క్రీజు బయటి నుంచి విసిరాడు. అది చూసి కంగుతిన్న ఫించ్.. ఆడకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో అంపైర్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. ఇది భువీని కాస్త అసంతృప్తికి గురి చేసినా.. ఆ తర్వాతి బంతికే ఫించ్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. నిజానికి ఈ ఎత్తుగ‌డ మాజీ కెప్టెన్ ధోనీది కావ‌డం విశేషం.
భువీ వేసిన ఈ ఎత్తుగడను చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. మరికొంత మంది అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అసలు డెడ్‌బాల్‌గా ప్రకటించాల్సిన అవసరం ఏంటని వాళ్లు ప్రశ్నించారు.
నిజానికి ఇది డెడ్‌బాల్ కాదు. బ్యాట్స్‌మన్ క్రీజు వదిలి బయట ఎలా నిల్చుంటాడో.. బౌలర్ కూడా క్రీజు బయటి నుంచి బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్, వెస్టిండీస్ బౌలర్ కీరన్ పొలార్డ్ ఇలా బౌలింగ్ చేశారు. ఇలా బౌలింగ్ చేయకూడదని క్రికెట్ బుక్‌లో నిబంధనలు కూడా ఏమీ లేవు. అయితే ఒకవేళ బ్యాట్స్‌మన్ ఇలాంటి బంతులను ఆడకుండా తప్పుకుంటే.. దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించే హక్కు ఫీల్డ్ అంపైర్‌కు ఉంటుంది. ఐసీసీ చట్టంలోని 2.6 నిబంధన ప్రకారం.. ఏ బాల్‌నైనా డెడ్ లేదా లీగల్ డెలివరీగా ప్రకటించే పూర్తి స్వేచ్ఛ ఫీల్డ్ అంపైర్‌కే ఉంటుంది.

7639
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles