బంగ్లా చితకబాదుడు.. విండీస్ ఘోర పరాజయం..

Mon,June 17, 2019 11:03 PM

bangladesh won by 7 wickets against west indies in world cup 2019 match

లండన్: ప్రపంచ కప్ టోర్నీలో సౌతాఫ్రికా జట్టును ఓడించి ఆశ్చర్యానికి గురి చేసిన బంగ్లాదేశ్.. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో మాత్రం వెస్టిండీస్‌కు ఫ్యూజులు కాలిపోయేంతటి షాక్‌నిచ్చింది. బంగ్లా చేతిలో విండీస్ దారుణమైన.. ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. సాధారణంగా విండీస్ జట్టులో ఉన్న ప్లేయర్లు సిక్సర్లు బాగా బాదుతారు. అయితే ఇవాళ వారు బంగ్లా బ్యాట్స్‌మెన్ బాదే బౌండరీలను చూస్తూ అలా నిశ్చేష్టులుగా ఉండిపోయారు. బంగ్లా పరుగుల ప్రవాహానికి విండీస్ బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. దీంతో బంగ్లాదేశ్ రికార్డు స్థాయి లక్ష్య ఛేదనతో విండీస్‌పై ఘనమైన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఆ జట్టుపై బంగ్లాదేశ్ గెలుపొందింది.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో షై హోప్ (121 బంతుల్లో 96 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), లూయీస్ (67 బంతుల్లో 70 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హిట్‌మైర్ (26 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, రహమాన్‌లు చెరో 3 వికెట్లు తీయగా, షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశాడు.అనంతరం 322 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆది నుంచి విండీస్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో బంగ్లా జట్టులో షకిబ్ అల్ హసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 99 బంతుల్లోనే 16 ఫోర్లతో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మరో బ్యాట్స్‌మెన్ లైటన్ దాస్ కూడా విండీస్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 69 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో దాస్ 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకు ముందు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (53 బంతుల్లో 48 పరుగులు, 6 ఫోర్లు), సౌమ్యా సర్కార్ (23 బంతుల్లో 29 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు బంగ్లాదేశ్‌కు చక్కని ఆరంభాన్ని ఇవ్వగా.. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏ దశలోనూ మ్యాచ్ చేజారిపోకుండా ఆద్యంతం విండీస్ బౌలర్లపై బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం ప్రదర్శించారు. ఎప్పటికప్పుడు బౌండరీలను బాదుతూ.. బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. దీంతో విండీస్ కోలుకోలేకపోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కేవలం 41.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి విండీస్‌పై గెలుపొందింది. కాగా వెస్టిండీస్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్, ఒషానె థామస్‌లకు చెరొక వికెట్ దక్కింది.

సెంచరీ వీరుడు షకిబ్...


బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ కీలకదశలో బ్యాటింగ్‌కు వచ్చి చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 83 బంతుల్లోనే 13 ఫోర్లతో షకిబ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఆ జట్టు విజయానికి ఎంతగానో దోహదపడింది. ఆ త‌రువాత షకిబ్ లైటన్ దాస్‌తో కలిసి రికార్డు స్థాయిలో 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం బంగ్లాదేశ్‌ను విజయానికి చేరువ‌ చేసింది. కాగా షకిబ్‌కు ఈ సెంచరీ వన్డేల్లో 9వది కాగా.. ఈ టోర్నీలో రెండోది. ఈ క్రమంలో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

8213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles