ఆసీస్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన బంగ్లాదేశ్..!

Thu,June 20, 2019 11:32 PM

australia won by 48 runs against bangladesh in world cup 2019 match

లండన్: అద్భుతం.. అమోఘం.. ఓడిపోతామని తెలిసినా బంగ్లాదేశ్ ఆడిన తీరు హర్షణీయం.. లక్ష్యం ఎంతైనా సరే.. పోరాటం కొనసాగించాలని, చేయాల్సిన పరుగులు భారీగా ఉన్నా సరే.. మన శక్తి మేర ఆడాల్సిందేనని.. ఆ టీం ఇవాళ చాటి చెప్పింది. ఆస్ట్రేలియాతో ఇవాళ జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో బంగ్లా టీం ఓడిపోయినప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ చూపింది. ఒక బలమైన జట్టును ఢీకొన్నామనే భావన ఏ మాత్రం మనస్సులోకి రానీయకుండా బంగ్లాదేశ్ ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నాటింగామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (147 బంతుల్లో 166 పరుగులు, 14 ఫోర్లు, 5 సిక్సర్లు), ఉస్మాన్ ఖవాజా (72 బంతుల్లో 89 పరుగులు, 10 ఫోర్లు)లు రాణించారు. అలాగే కెప్టెన్ ఆరోన్ ఫించ్ (51 బంతుల్లో 53 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా అర్ధ సెంచరీ చేశాడు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక బంగ్లా బౌలర్లలో సౌమ్యా సర్కార్ 3 వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రహమాన్ 1 వికెట్ తీశాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మొదటి నుంచీ దూకుడుగానే ఆడింది. అయితే వికెట్లను కూడా కోల్పోతూ వచ్చింది. దీంతో ఆ జట్టు చేయాల్సిన పరుగులు ఎక్కువైపోయి చివరకు ఆ టీం ఓటమి పాలైంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం (97 బంతుల్లో 102 పరుగులు, 9 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో రాణించాడు. అలాగే తమీమ్ ఇక్బాల్ (74 బంతుల్లో 62 పరుగులు, 6 ఫోర్లు), మహ్మదుల్లా (50 బంతుల్లో 69 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలు సాధించారు. కాగా ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టాయినిస్‌లకు తలా 2 వికెట్లు దక్కాయి. ఆడం జంపా 1 వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ జట్టు బంగ్లాదేశ్‌పై 48 పరుగుల తేడాతో గెలుపొందింది.

3664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles