విరాట్ 123 ఔట్.. వెనకబడ్డ టీమిండియా

Sun,December 16, 2018 10:17 AM

Australia take two quick wickets before the break

పెర్త్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(123: 257 బంతుల్లో 13ఫోర్లు, సిక్స్) మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శనివారం నుంచి క్రీజులో ఉన్న విరాట్ మూడో రోజు, ఆదివారం ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు పాట్ కమిన్స్ వేసిన 93వ ఓవర్లో వెనుదిరిగాడు. కమిన్స్ వేసిన బంతి బ్యాట్‌కు అంచుకు తాకి సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హాండ్స్‌కాంబ్ చేతిలో పడింది. దీంతో భారత సారథి నిరాశగా పెవిలియన్ చేరాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో ఎంతో సహనంతో బ్యాటింగ్ చేసి అలరించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో పట్టుదలగా పోరాడుతూ జట్టును గట్టెక్కించాడు. ఓవర్‌నైట్ స్కోరు 82తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలని భావించిన విరాట్ ఆశలు నెరవేరలేదు. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ బౌలర్లు బుల్లెట్ బంతులతో ఎదురుదాడి చేస్తున్నారు.

ఓవర్‌నైట్ స్కోరు 51తో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన రహానె మరో రెండు బంతులు మాత్రమే ఆడి అదే స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హనుమ విహారి(20) కొద్దిసేపు కోహ్లీకి సహకారం అందించాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో విహారి కూడా పైన్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విరాట్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ లైయన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. లంచ్ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 74 పరుగులు వెనకబడే ఉంది. రిషబ్ పంత్(14) క్రీజులో ఉన్నాడు.

2821
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles