పాక్ ఢమాల్.. ఆస్ట్రేలియాదే విజయం

Wed,June 12, 2019 10:45 PM

Aussies win by 41 runs

టాంట‌న్‌: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. బ్యాట్, బంతి, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్న ఆసీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 308 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన పాక్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ 45.4ఓవర్లలో 266 పరుగులకే ఆలౌటైంది. ఆఖర్లో వాహబ్ రియాజ్(45: 39 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) అనూహ్యంగా మెరుపులు మెరిపించడంతో పాక్ గెలిచే అవకాశం ఉందని అనుకున్నారు. ఐతే లక్ష్యం వైపు దూసుకొస్తున్న పాక్‌ను స్టార్క్ అడ్డుకున్నాడు. 45వ ఓవర్లో రెచ్చిపోయి ఆడుతున్న రియాజ్, ఆమీర్‌ను స్టార్క్ పెవిలియన్ పంపడంతో ఆసీస్ విజయం ఖరారైంది. మరో ఎండ్‌లో పాక్ సారథి సర్ఫరాజ్ సహకారం అందిస్తూ పోరాడినప్పటికీ పాక్ ఓటమిని ఎదుర్కొంది. పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్(53), బాబర్ అజామ్(30), మహ్మద్ హఫీజ్(46), సర్ఫరాజ్ అహ్మద్(40), హసన్ అలీ(32) అంతంతమాత్రంగానే చెలరేగారు. కీలక సమయంలో హఫీజ్, షోయబ్ మాలిక్(0) వెనుదిరగడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగి ఏ దశలోనూ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్(107: 111 బంతుల్లో 11ఫోర్లు, సిక్స్) సెంచరీతో విజృంభించడంతో 49 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. గ్లెన్ మాక్స్‌వెల్(20), షాన్ మార్ష్(23), అలెక్స్ కేరీ(20) చెప్పుకోదగ్గస్థాయిలో ప్రదర్శన చేయలేదు. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్(5/30) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షహీన్ అఫ్రీదీ(2/70) రెండు వికెట్లు తీయగా హసన్ అలీ, వాహబ్ రియాజ్, హఫీజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

3357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles