పంత్ వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండాల్సిందే.. ఎందుకంటే?

Thu,February 14, 2019 05:12 PM

Ashish Nehra lists 5 reasons for Rishab Pant to be in World Cup Team

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ టీమ్‌లో ఎవరుండాలి? టీమ్ ఎంపికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ చర్చ తీవ్రమవుతున్నది. దాదాపు ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలు భర్తీ అయినట్లే అన్నట్లుగా సెలక్టర్లు హింట్ ఇస్తున్నారు. అయితే రిషబ్ పంత్ టీమ్‌లో ఉంటాడా లేడా అన్నదానిపై స్పష్టత రావడం లేదు. ఇప్పటికే ధోనీ, కార్తీక్ స్థానాలు ఖాయమైన తరుణంలో మూడో వికెట్ కీపర్‌ను తీసుకుంటారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. కానీ పంత్ మాత్రం టీమ్‌లో ఉండాల్సిందే అంటున్నాడు మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా. దీనికి ఒక్కటి కాదు ఐదు కారణాలు అతడు చెబుతున్నాడు. టీమ్ విజయంలో చాలా మంది పాత్ర పోషిస్తుండవచ్చు. కానీ వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీల్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ప్లేయర్స్ కావాలి. పంత్ కచ్చితంగా ఓ మ్యాచ్ విన్నర్. అతన్ని కచ్చితంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని నెహ్రా స్పష్టం చేశాడు. దీనికి అతడు చెప్పిన కారణాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం టీమ్‌లో ధావన్‌ను వదిలేస్తే తొలి ఏడు మంది బ్యాట్స్‌మెన్‌లో మరో లెఫ్ట్ హ్యాండర్ లేడు. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కచ్చితంగా ఉండాలి. అక్కడే పంత్ పనికొస్తాడు. రెండోది పంత్ నంబర్ 1 నుంచి 7 వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు అని నెహ్రా చెప్పాడు.

ఇక ఎంతో సునాయాసంగా పంత్ సిక్స్‌లు కొట్టగలడు. రోహిత్ తర్వాత అతనికే ఆ సత్తా ఉంది. ఒత్తిడి సమయంలో ఏ మాత్రం భయపడకుండా ఆడగలడు. ప్రస్తుతం టీమ్‌కు అదే కావాలి అని నెహ్రా స్పష్టం చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు అని నెహ్రా అన్నాడు. ప్రస్తుతం టీమ్‌లో కోహ్లి, రోహిత్, బుమ్రా రూపంలో ముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. పంత్ నాలుగోవాడు. కార్తీక్, రాయుడు, జాదవ్ కూడా మంచి ప్లేయర్స్ అయినా వాళ్లంతా ఒకేలా ఆడతారు. ఎవరిలో లేని ఎక్స్ ఫ్యాక్టర్ ఈ పంత్‌లో ఉంది అని నెహ్రా తన వాదనను సమర్థించుకున్నాడు. అయితే పంత్ కోసం కార్తీక్‌ను పక్కన పెట్టాలా అని ప్రశ్నిస్తే.. ఇద్దరినీ టీమ్‌లోకి తీసుకోవచ్చని అన్నాడు. పంత్‌ను మూడో ఓపెనర్‌గా తీసుకుంటే.. కార్తీక్ మిడిలార్డర్‌లో ఆడొచ్చు అని నెహ్రా చెప్పాడు. 15 మందిలో ముగ్గురు వికెట్ కీపర్లకు చోటివ్వడం సమంజసమేనా అని ప్రశ్నిస్తే.. కార్తీక్, పంత్‌లను రెండు, మూడో వికెట్ కీపర్లుగా చూడటం తప్పని అతనన్నాడు. వీళ్లిద్దరు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అని చెప్పాడు. ధోనీలాంటి లెజెండ్ వికెట్ల వెనుక ఉన్న తర్వాత ఈ ఇద్దరినీ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గానే చూడాలని నెహ్రా అభిప్రాయపడ్డాడు.

3920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles