హార్దిక్ పాండ్యా ఒంటరి పోరాటం

Sun,January 7, 2018 06:35 AM

All rounder Hardik Pandya scores high in first test first innings against south africa

ఓవైపు నిప్పులు కురిపించిన సఫారీ పేస్ బలం.. మరోవైపు తోక ముడిచిన టీమ్‌ఇండియా బ్యాటింగ్ బలగం.. ఈ రెండింటి మధ్య నేనున్నాంటూ.. ఒంటరిగా పోరాటం చేశాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. భవిష్యత్ భారత్‌కు తాను ఎంత అవసరమో నిక్కచ్చిగా చూపెడుతూ.. దక్షిణాఫ్రికా గడ్డపై అసలు సిసలు యోధుడిలా చెలరేగిపోయాడు. 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన ఈ యువ కెరటం.. బ్యాటింగ్ సత్తా ఏంటో చూపెడుతూ.. ప్రొటీస్ పేస్‌కు అడ్డుగా నిలుస్తూ భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

కేప్‌టౌన్: ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా గడ్డపై భారత దిగ్గజాలు బొక్క బోర్లాపడ్డారు. బౌన్సీ పిచ్‌లపై దూసుకొచ్చే బంతులను ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. కానీ ఆల్‌రౌండర్ పాత్రకు అతికినట్లుగా ఆడుతున్న హార్దిక్ పాండ్యా (95 బంతుల్లో 93; 14 ఫోర్లు, 1 సిక్స్) నిలకడైన బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా ఒడ్డున పడేశాడు. భువనేశ్వర్ (25) తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 73.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. దీంతో సఫారీ జట్టుకు 77 పరుగుల ఆధిక్యం దక్కింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. రబడ (2 బ్యాటింగ్), ఆమ్లా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా ఆతిథ్య జట్టు 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.


పేస్‌కు వణికారు..
అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 28/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ను దక్షిణాఫ్రికా పేసర్లు ఆదిలోనే దెబ్బతీశారు. క్రీజులో అసహనంగా కదిలిన రోహిత్ (11) ఆట మొదలైన కొద్దిసేపటికే తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఫిలాండర్ వేసిన ఆఫ్‌సైడ్ బంతులను ఆడటంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. రెండో ఎండ్‌లో స్టెయిన్ కూడా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు రాబట్టడంతో రోహిత్ విఫలమ్యడు. ఈ దశలో వచ్చిన అశ్విన్ (12)తో కలిసి పుజార (26) ఇన్నింగ్స్‌ను సుస్థిరం చేసే ప్రయత్నం చేశాడు. కానీ వరుస ఓవర్లలో ఈ ఇద్దరూ ఔట్‌కావడంతో భారత్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సహచరులందరూ ఒక్కొక్కరుగా వెనుదిరిగినా.. పాండ్యా మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ప్రొటీస్ బౌలర్లను ఆడుకున్నాడు. బలమైన డిఫెన్స్‌కు తోడు సూపర్ షాట్లతో అలరిస్తూ మెల్లమెల్లగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మరో ఎండ్‌లో సాహా డకౌట్ అయినప్పటికీ, భువనేశ్వర్ (25) అండతో చెలరేగి ఆడాడు.


వందలోపే కుప్పకూలుతుందనుకున్న టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. ఈ క్రమంలో 46 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన పాండ్య... ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. మోర్కెల్ వేసిన బౌన్సర్లకు అప్పర్ కట్స్‌తో సమాధానమిస్తూ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. అయితే అప్పటి వరకు అండగా నిలిచిన భువీ ఔట్‌కావడంతో ఎనిమిదో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పాండ్య 90ల్లోకి చేరడంతో సఫారీ బౌలర్లు లెగ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లతో విసుగెత్తించారు. 93 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడ ఆఫ్ స్టంప్ అవతలికి విసిరిన షార్ట్ పిచ్ బంతిని గల్లీ దిశగా ఆడే క్రమంలో పాండ్య వికెట్ కీపర్‌కు చిక్కాడు. దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆ తర్వాత బుమ్రా (4) వెనుదిరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పడింది. ఫిలాండర్ (3/33), రబడ (3/34) రాణించగా... మోర్కెల్, స్టెయిన్‌కు చెరో 2 వికెట్లు దక్కాయి.


స్టెయిన్ ఔట్
రెండో రోజు ఆటలో గాయపడ్డ పేసర్ డెల్ స్టెయిన్.. భారత్‌తో సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. తన 18వ ఓవర్‌లో మూడు బంతులు వేశాక స్టెయిన్ ఎడమ మడమలోని కణజాలం చిరిగిపోవడంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. చికిత్స కోసం బయటకు వెళ్లిన అతను మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు. నాలుగు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చడంతో సిరీస్ మొత్తానికే దూరం కానున్నాడు. భుజం గాయంతో దాదాపు ఏడాది ఆటకు దూరంగా ఉన్న స్టెయిన్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేశాడు.


స్కోరు బోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 286 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) ఎల్గర్ (బి) ఫిలాండర్ 1, ధవన్ (సి అండ్ బి) స్టెయిన్ 16, పుజార (సి) డుప్లెసిస్ (బి) ఫిలాండర్ 26, కోహ్లీ (సి) డికాక్ (బి) మోర్కెల్ 5, రోహిత్ ఎల్బీ (బి) రబడ 11, అశ్విన్ (సి) డికాక్ (బి) ఫిలాండర్ 12, పాండ్యా (సి) డికాక్ (బి) రబడ 93, సాహా ఎల్బీ (బి) స్టెయిన్ 0, భువనేశ్వర్ (సి) డికాక్ (బి) మోర్కెల్ 25, షమీ నాటౌట్ 4, బుమ్రా (సి) ఎల్గర్ (బి) రబడ 2, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 73.4 ఓవర్లలో 209 ఆలౌట్.
వికెట్లపతనం: 1-16, 2-18, 3-27, 4-57, 5-76, 6-81, 7-92, 8-191, 9-199, 10-209.
బౌలింగ్: ఫిలాండర్ 14.3-8-33-3, స్టెయిన్ 17.3-6-51-2, మోర్కెల్ 19-6-57-2, రబడ 16.4-4-34-3, మహారాజ 6-0-20-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్‌రామ్ (సి) భువనేశ్వర్ (బి) పాండ్యా 34, ఎల్గర్ (సి) సాహా (బి) పాండ్యా 25, రబడ బ్యాటింగ్ 2, ఆమ్లా బ్యాటింగ్ 4, మొత్తం: 20 ఓవర్లలో 65/2.
వికెట్లపతనం: 1-52, 2-59.
బౌలింగ్: భువనేశ్వర్ 6-3-16-0, బుమ్రా 4-0-14-0, షమీ 5-1-15-0, పాండ్యా 4-0-17-2, అశ్విన్ 1-0-3-0.

3572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS