రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలినా.. గెలుపు దిశగానే..

Fri,December 28, 2018 12:35 PM

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై మరో చారిత్రక విజయానికి టీమిండియా చేరువవుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ నిరాశపరిచినా.. మొత్తానికి మూడో రోజు ముగిసే సమయానికి టీమిండియా పటిష్ఠ స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను కేవలం 151 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. 292 పరుగుల ఆధిక్యం సంపాదించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ ఘోరంగా విఫలమవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 54 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓవరాల్‌గా 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. మూడో రోజు చివరి సెషన్‌లోనే ఎనిమిది వికెట్లు కుప్పకూలాయంటే పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమ్‌కు ఓపెనర్లు మయాంక్, విహారి మంచి ఆరంభాన్నే ఇచ్చినా.. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. 28 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. అదే స్కోరు దగ్గర మరో రెండు వికెట్లు నష్టపోయింది. విహారి 13 పరుగులు చేయగా.. పుజారా, కోహ్లి డకౌట్ కావడం విశేషం. తర్వాత కాసేపటికే రహానే (1), రోహిత్ (5) కూడా వెనుదిరగడంతో టీమిండియా 44 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మయాంక్ అగర్వాల్ (28), రిషబ్ పంత్ (6) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 151 పరగులకే కుప్పకూలింది. వికెట్ నష్టపోకుండా 8 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌ను బుమ్రా దెబ్బ తీశాడు. ఆరు వికెట్లు తీసి ఆసీస్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. జడేజా 2, షమి, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు. లంచ్‌లోపే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. తర్వాతి సెషన్‌లో 3 వికెట్లు కోల్పోయింది. చివరి సెషన్ ప్రారంభమవగానే ఆరు పరుగుల తేడాలో చివరి మూడు వికెట్లను కూడా సమర్పించుకుంది. తొలి రెండు టెస్టుల్లో పోరాడిన ఆసీస్ టెయిలెండర్లు.. ఈసారి చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ హారిస్, కెప్టెన్ టిమ్ పేన్ సాధించిన 22 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. టీమిండియా 292 పరుగుల ఆధిక్యం లభించినా.. ఫాలో ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాలన్న కోహ్లి నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.

4144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles