e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home సిద్దిపేట మల్బరీ సాగులో అధిక లాభాలు

మల్బరీ సాగులో అధిక లాభాలు

  • రైతులందరూ ముందుకు రావాలి
  • తక్కువ శ్రమ, పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం
  • మల్బరీ, పామాయిల్‌ పంటలకు డిమాండ్‌
  • ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
  • మల్బరీ సాగు విరివిగా చేపట్టాలి
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
మల్బరీ సాగులో అధిక లాభాలు

చిన్నకోడూరు, జూన్‌ 7: ‘వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తే.. తెలంగాణ రాష్ట్రంలో రూ.14,500 కోట్లు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం ప్రభుత్వం పదింతలు ఎక్కువ ఖర్చు పెడుతున్నది. నూతన పద్ధతులు అవలంభించి ఎక్కువ శ్రమ లేకుండా అధిక లాభాలు గడించే మల్బరీ, పామాయిల్‌ సాగుకు రైతులు ముందు కు రావాలి.’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని చంద్లాపూర్‌లో రైతులు బాల్‌లింగు ఉమాపతి, పిల్లి ప్రభాకర్‌ వ్యవసాయ క్షేత్రంలో మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి మల్బరీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మల్బరీ సాగు సులభతరంగా మారిందని, మార్కెట్‌లోనూ మంచి డిమాండ్‌ ఉన్నదని, ఆ దిశగా రైతులు విరివిగా మల్బరీ సాగు చేపట్టాలని సూచించారు. సాగుకు ముందుకు వచ్చే రైతులందరికీ సహకారం అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు మల్బరీ తోటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

తెలంగాణలో అత్యధికంగా వరిధాన్యం దిగుబడి
సీఎం కేసీఆర్‌ కృషితో కాళేశ్వరం నీళ్లు, ఉచిత కరెంట్‌, పెట్టుబడి సాయం అందుతుండడంతో తెలంగాణలో అత్యధికంగా వరిధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3300 కోట్లు ఉచిత విద్యుత్‌, ఉత్త కరెంట్‌కు ఖర్చు చేశారు. కాలిపోయో మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో రైతుల ఇబ్బందులు చూశామని, తెలంగాణ రాష్ట్రంలో రూ.10,500 కోట్లు ఉచిత నాణ్యమైన కరెంట్‌కు ఖర్చు చేస్తుందన్నారు. నిల్వ చేసేందుకు స్థలం లేకుండా ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఈ యేడు 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందన్నారు. కాళేశ్వరం జలాలతో మన రైతులకు చేతినిండా పని ఉందన్నారు. వలసలు వెళ్లే పరిస్థితి పోయి ఇతర రాష్ర్టాల వారు ఇక్కడ పనికి వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి మగవాళ్లు నాటువేసేందుకు వస్తున్నారని, పౌల్ట్రీల్లోనూ ఇతర రాష్ర్టాల వారే పనికి ఉంటున్నారన్నారు. అంటే రైతుల బాగుకు ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి ఫలాలు అందించిందో గమనించాలన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతుకు బీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో దొడ్డు వడ్లు కొనమని ఎఫ్‌సీఐ ద్వారా లేఖలు రాస్తున్నదన్నారు. రైతులు డిమాండ్‌ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలన్నారు.

మల్బరీ సాగు రైతులకు మంత్రి ప్రశంసలు
మల్బరీ సాగులో పట్టు సాధించి అధిక లాభాలు ఆర్జిస్తున్న చంద్లాపూర్‌ రైతులు పెద్దోల్ల నర్సింలు, పెద్దోల్ల ఐలయ్యతో పాటు శ్రీధర్‌రెడ్డి, దేవయ్యను మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. ఈ ఏడాదిలో వారి పంటలకు సంబంధించి బిల్లులను పరిశీలించి బాగా పంటలు తీస్తున్నారని ఈ రైతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇక్కడకు వచ్చిన ప్రజాప్రతినిధులందరూ నర్సింలు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి గ్రామాల్లో రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రైతు ఐలయ్య బాగా మాట్లాడుతారని ప్రొఫెసర్‌ ఐలయ్య అని అన్నారు.

మల్బరీ సాగులో రైతులు ఆదర్శం

  • జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ
    అన్నింటిలో ఆదర్శంగా ఉన్నట్లుగానే మన రైతులు మల్బరీ సాగులో ఆదర్శంగా నిలిచారని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు కృషితో ప్రాజెక్టులను నిర్మించుకున్నామన్నారు. పట్టు సాగులో చంద్లాపూర్‌ రైతులు నర్సింలు, ఐలయ్య ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. సిద్దిపేటకు మంచి పేరుందని జిల్లా వ్యాప్తంగా రైతులు పట్టు సాగుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్‌ మేడికాయల వెంకటేశం, వైస్‌ ఎంపీపీ కీసరి పాపయ్య, సొసైటీ చైర్మన్లు సదానందంగౌడ్‌, కనకరాజు, సర్పంచ్‌ చంద్రకళ రవిగౌడ్‌, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, జిల్లా అధికారులు రామలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి, శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
మల్బరీ సాగు చేస్తున్న రైతుల అనుభవం తీసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తున్నట్లు వెల్లడైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ధర బాగా ఉంటే ఒక్కో రైతు నెలకు లక్షకు పైగా సంపాందించినట్లు బిల్లులను చూస్తే అర్థమవుతుందన్నారు. పామాయిల్‌, మల్బరీ సాగుకు బాగా డిమాండ్‌ ఉన్నదన్నారు. నూనె గింజల ఉత్పత్తితో మన దేశం 90 వేల కోట్ల రూపాయల విదేశీ మాదక ద్రవ్యం కోల్పోతున్నట్లు తెలిపారు. పామాయిల్‌ సాగు లాభసాటిగా ఉందన్నారు. 4 వేల మెట్రిక్‌ టన్నుల పట్టును చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో 2 లక్షల 50 వేల ఎకరాల్లో సెరికల్చర్‌ సాగు చేస్తున్నారన్నారు. తెలంగాణలో 12 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, పామాయిల్‌, సెరికల్చర్‌ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హర్టికల్చర్‌ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ మల్బరీ సాగు తక్కువ కష్టం, పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
సిద్దిపేట, జూన్‌ 7: ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి చెక్కులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని (పట్టణంలో ఇద్దరికి, రూరల్‌ మండలంలో ఇద్దరికి, చిన్నకోడూరు మండలంలో ఇద్దరికి, నంగునూరు మండలం ఇద్దరికి) మొత్తం 8 మంది లబ్ధిదారులకు రూ.5.67 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మల్బరీ సాగులో అధిక లాభాలు

ట్రెండింగ్‌

Advertisement