e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home సిద్దిపేట అర్ధాంగికి ఆలయం

అర్ధాంగికి ఆలయం

  • ఆమెపై ఉన్న ప్రేమతో ‘రాజమణి మహల్‌’ నిర్మాణం
  • సతీమణి పేరిట ఆశ్రమం.. నిత్యం విగ్రహ పూజలు
  • ఆమె జయంతి రోజున సేవాకార్యక్రమాలు
అర్ధాంగికి ఆలయం

దుబ్బాక, జూన్‌ 12 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లికి చెందిన కొలుగురు చంద్రాగౌడ్‌ తన మేన మరదలు రాజమణిని వివాహం చేసుకున్నాడు. పెండ్లికి ముందు చంద్రాగౌడ్‌ తన కులవృత్తి గీత కార్మికుడిగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వివాహ అనంతరం భార్య రాజమణితో కలి సి నిజామాబాద్‌కు వలస వెళ్లాడు. 8వ తరగతి చదువుకున్న చంద్రాగౌడ్‌ ట్రాన్స్‌కో(ఎలక్ట్రిసిటీ)లో మొదట దినసరి కూలి గా చేరి, తర్వాత పర్మినెంట్‌ ఉద్యోగిగా (ఎలక్ట్రిసిటీ లైన్‌మెన్‌ గా) విధులు నిర్వర్తించి, 2014 మార్చిలో రిటైర్డ్‌ అయ్యా డు. తన సతీమణి, పిల్లలతో కలిసి విశ్రాంత జీవనాన్ని సంతోషంగా గడుపాలనుకున్నాడు. ఈ క్రమంలో రాజమణి అనారోగ్యంతో 2015 జనవరి 5న మృతి చెందింది. దీంతో చంద్రాగౌడ్‌ మానసికంగా కుంగిపోయాడు. తన సతీమణి భౌతికంగా దూరం కావడంతో వేదన పడ్డాడు. ఆ వేదనలోనే.. వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. తన భార్య ప్రేమను గుండెల్లో పదిలంగా కాపాడుకుంటూనే.. తన ప్రేమను చాటుకునేందుకు సతీమణి (రాజమణి)కి ఆలయాన్ని నిర్మించాలకున్నాడు.

ప్రేమకు నిదర్శనమే..
చంద్రాగౌడ్‌ నిజామాబాద్‌లో స్థిర పడినప్పటికీ 2016లో స్వగ్రామం దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో రెండెకరాల వ్యవసాయ భూమి కొని, ఆరు గుంటల స్థలంలో రాజమణి ఆశ్రమాన్ని(మందిరాన్ని) నిర్మించాడు. తన ఉద్యోగ విరమణ డబ్బులతో పాటు పొదుపు చేసిన సొమ్మునంతా ఆశ్రమం కోసం, సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు. తన భార్య రాజమణి విగ్రహం తయారు చేయించి, ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఓ పండుగ వాతావరణంలో విగ్రహ ప్రతిష్ఠ చేయించాడు. ఆశ్రమంలో రాజమణి జయంతి యేటా ఘనంగా నిర్వహించి, అన్నదానం చేస్తున్నాడు. ఆమె చనిపోయిన రోజున గుర్తు చేసుకునే వర్ధంతిని మాత్రం నిర్వహించడం లేదు. రాజమణి కేవలం భౌతికంగానే దూరమైందని, తన మనసులో బతికే ఉందని చంద్రాగౌడ్‌ వర్ధంతిని జరుపుకోవడం లేదు. ఆలయంలో రాజమణి విగ్రహానికి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. చంద్రాగౌడ్‌ తన పిల్లల వద్దకు వెళితే, ఆ సమయంలో ఆశ్రమ నిర్వాహకులు పూజలు చేస్తారు. ఆలయంలో రాజమణికి సంబంధించిన చీరలు, విగ్రహానికి అలంకిరించే ఇతర వస్తువులు పెట్టెలో భద్రపరిచారు. నిత్యం విగ్రహానికి జలాభిషేకం, వస్ర్తాలంకారణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ ప్రేమాలయం చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావారణం ఏర్పాటు చేశాడు. సుమారు 300 పూల మొక్కలు, వివిధ రకాల పండ్ల చెట్లతో పచ్చలహారంగా మార్చాడు. ఈ దారిగుండా వెళ్లే బాటసారులు, గ్రామానికి కొత్తగా వచ్చేవారికి ఆశ్రయం కల్పించేందుకు ప్రత్యేకంగా వసతిగృహం ఏర్పాటు చేశాడు. పండుగలు, ఇతర సమయంలో గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు పలు వసతులు కల్పించాడు.

- Advertisement -

నా భార్యపై ఉన్న ప్రేమతోనే..
నేను పెండ్లికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డా. నా మేన మరదలు రాజమణిని పెండ్లి చేసుకున్న తర్వాత నుంచి నా జీవితంలో వెలుగులు నిండాయి. మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఇద్దరు కొడుకులు స్థిరపడ్డారు. కూతురు రేణుకను ఎలక్ట్రిసిటీలో ఏఈగా పని చేసే తిరుపతికి ఇచ్చి పెండ్లి చేశా. రాజమణి మృతి చెందిన వార్తను జీర్ణించుకోలేకపోయా. 40ఏండ్ల మా దాంపత్య జీవితంలో ఏనాడు కూడా మాట రాలేదు. ఆమెపై ఉన్న ప్రేమకు గుర్తుగా మా స్వగ్రామంలో ఆలయం(ఆశ్రమం) నిర్మించా. ఆమె జయంతి రోజున సేవ కార్యక్రమాలు చేస్తా. నేను ఏదో పేరు కోసం ఈ ఆలయాన్ని నిర్మించలేదు. ఆమెపై ఉన్న ప్రేమే.. మా ‘ప్రేమాలయం’. త్వరలోనే నా విగ్రహం కూడా తయారు చేయించి పెట్టుకుంటా. నేను మరణించిన తర్వాత రాజమణి విగ్రహం పక్కనే పెట్టాలని మా పిల్లలు, ఆశ్రమ నిర్వాహకులకు సూచించా. చరిత్రలో శాశ్వతంగా ఉండేది.. కేవలం ‘ప్రేమ’ ఒక్కటే. అది ఏ విధమైన ప్రేమైనా కావచ్చు. నాకు నా భార్యపై ఉన్న ప్రేమనే ‘రాజమణి మహల్‌’గా భావిస్తా.

  • చంద్రాగౌడ్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అర్ధాంగికి ఆలయం
అర్ధాంగికి ఆలయం
అర్ధాంగికి ఆలయం

ట్రెండింగ్‌

Advertisement