e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home సిద్దిపేట బిందువు రైతు బంధువు

బిందువు రైతు బంధువు

బిందువు రైతు బంధువు

ఎర్రవల్లి, నర్సన్నపేటలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విజయవంతం
సామాజిక వ్యవసాయం చేస్తున్న రైతులు
మండుటెండల్లో అద్భుత దిగుబడులు
సిరులు కురిపిస్తున్న పంటలు
సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాల్లో సాగు విప్లవం
ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న రైతులు
ఇదంతా సీఎం కేసీఆర్‌ చలవే అంటున్న అన్నదాతలు

ఏడాదంతా ఒక్క పంటతోనే ఆ పల్లెల్లో రైతుల నాగళ్లు ఆగిపోయేవి. మరో పంటకాలం భూములు వృథాగా ఉండేవి. శరీరంలో పంట పండించే సత్తువ, భూమిలో సారం ఉన్నా.. పంట చేతికొచ్చే వరకు సరిపడా నీరు లేకపోవడంతో భూములను ఒక పంటకాలం మొత్తం బీడుగానే వదిలేసేవారు. ఇది సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు ఆ రెండు గ్రామాల్లో రైతుల దశ మారింది. మండుటెండల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. సమీకృత బిందుసేద్యం విధానం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నది.

గజ్వేల్‌ అర్బన్‌, మే 24 : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు సమీకృత వ్యవసాయం, సౌకర్యవంతమైన నీటిపారుదల, ఎరువుల నిర్వహణ, పంటకోత అనంతరం మార్కెట్‌తో అనుసంధానం ఈ ప్రక్రియలన్నీ కలగలిపితే సమీకృత వ్యవసాయం. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా సామాజిక వ్యవసాయం చేస్తూ సక్సెజ్‌ అవుతున్నారు. వ్యవసాయంలో స్థిరత్వం తీసుకురావడం, మార్కెట్‌కు అనుసంధానించడం, ఫలితంగా భూమి కలిగిన ప్రతి రైతుకు ఆదాయం పెరిగింది. తద్వారా రైతులంతా ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. సామాజిక వ్యవసాయంతో వాతావరణంపై ఆధారపడడం తగ్గింది. అధిక దిగుబడి సాధ్యమైంది. వనరులను తక్కువగా వినియోగించడంతో పాటు కూలీల అవసరం తగ్గి రైతులకు పెట్టుబడులు తగ్గాయి.


సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలంలోని తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట రైతుల సమస్యలను తెలుసుకున్న సీఎం కేసీఆర్‌, వారి సమస్యల పరిష్కారానికి గతేడాది సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రైతులు ఒక్కపంట సాగుచేసి ఏడాదంతా భూములను బీడుగా వదిలేయడం, మరి కొంతమంది రైతులు సాగుచేసినా నీరు సరిపోక పంటలు ఎండిపోయి నష్టపోతుండడం గుర్తించారు. ఈ రెండు గ్రామాల్లో కలిసికట్టుగా సమీకృత వ్యవసాయాన్ని డ్రిప్‌ సౌకర్యంతో సాగుచేస్తే రైతులకు మేలు జరుగుతుందని నిర్ణయించారు. సమీకృత వ్యవసాయం చేయడానికి ఈ రెండు గ్రామాలకు చెందిన రైతులతో పలుసార్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వారందరికీ సమీకృత వ్యవసాయంతో పాటు ప్రతిఒక్కరూ డ్రిప్‌ ఇరిగేషన్‌ను వినియోగించి ఏడాదంతా పంటలు పండించుకోవచ్చని అవగాహన కల్పించారు. దీంతో రైతుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. సామాజిక వ్యవసాయానికి అందరూ సిద్ధమయ్యారు. అందుకు అవసరమైన డ్రిప్‌ ఇరిగేషన్‌ను నెటాఫిమ్‌ కంపెనీ ప్రతినిధులు రెండు గ్రామాల్లో ఏర్పాటు చేశారు.

2212 ఎకరాలు.. 14జోన్లు, 1204మంది రైతులు..
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో మొత్తం 2212 ఎకరాల వ్యవసాయ భూమిలో 1204 మంది రైతులు డ్రిప్‌ ద్వారా సాగు చేయడానికి 14 జోన్లుగా విభజించి పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. ఎర్రవల్లి గ్రామంలో 696 మంది రైతులకు చెందిన 1296,25 ఎకరాల భూమిని 9జోన్లుగా విభజించారు. నర్సన్నపేటలో 508 రైతులకు చెందిన 916,2 ఎకరాల భూమిని 5 జోన్లుగా విభజించారు. ప్రతి జోన్‌లో 200 ఎకరాలకు పైగానే భూములు ఉంటాయి.

జోన్ల వారీగా ప్రత్యేకంగా పంప్‌హౌస్‌లు..
మొక్కమొక్కకూ నీరందించేందుకు ఉద్యానవన శాఖ తయారు చేసిన పటిష్టమైన ప్రణాళిక ప్రకారం ‘నెటాఫిమ్‌’ కంపెనీ డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులైన్‌ను తీర్చిదిద్దింది. రెండు గ్రామాల్లో భూమిని మొత్తం 14జోన్లుగా విభజించి, నీటిని సమానంగా అందించేందుకు ఒక్కో జోన్‌కు ప్రత్యేకంగా పంప్‌హౌస్‌ను, 10లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగల 7సంప్‌హౌస్‌లను ఏర్పాటు చేసింది. కూడవెళ్లి వాగు ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ పంప్‌హౌస్‌లకు నీటిని తరలించి, వాటిని పంట పొలాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.

లాభాలు ఆర్జిస్తున్నారు..
గతంలో ఈ గ్రామాల్లో పత్తి, కంది, వరి, మొక్కజొన్న వంటి పంటలు అధిక విస్తీర్ణంలో సాగుచేసేవారు. సరిపడా నీరు లేక పంటలు దెబ్బతినేవి. సీఎం కేసీఆర్‌ సూచించిన సమీకృత బిందుసేద్య పద్ధతిలో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల రైతులు వ్యవసాయాన్ని బాగా చేస్తున్నారు. ఎండకాలంలో టమాట, మిరప, బెండ, బఠాణి, గోరుచిక్కుడు, కాకర, కొత్తిమీర, కీరదోస, వంకాయ, బొడిమ, బీర, చిక్కుడు వంటి పంటలు పండించి లాభాలు గడించారు. వాళ్లకు నీటి విలువ తెలిసింది.

  • రామలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, సిద్దిపేట

తక్కువ ఖర్చుతో పంటల సాగు..
బిందుసేద్యంలో భాగంగా డ్రిప్‌ పైపులు మాకు ఏర్పాటు చేశారు. ఎకరంన్నర ఉలవలు, ఎకరంన్నర మక్క పెట్టినం. నెలమీద 15రోజుల్లో పంట వచ్చింది. ఇప్పటికి రెండోసారి కంకులు తెంపుతున్నా. డ్రిప్‌ పైపుల ద్వారా నీళ్లిచ్చుడు చాలా మంచిగుంది. సీఎం కేసీఆర్‌కు, మా కోసం కష్టపడ్డ ఉద్యానవన శాఖ వాళ్లకు, నెటాఫిమ్‌ కంపెనీ వాళ్లకు ధన్యవాదాలు.

  • నర్సింలు, రైతు, నర్సన్నపేట
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిందువు రైతు బంధువు

ట్రెండింగ్‌

Advertisement