e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home సిద్దిపేట రోడ్డెక్కని జనం

రోడ్డెక్కని జనం

రోడ్డెక్కని జనం
  • తొలిరోజు లాక్‌డౌన్‌ విజయవంతం
  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇండ్లకే జనం పరిమితం
  • ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకున్న ప్రజానీకం
  • ఉమ్మడి జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యం
  • యథావిధిగా అత్యవసర సేవలు
  • కొనసాగిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు
  • డిపోలకే పరిమితమైన బస్సులు
  • గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
  • విస్తృతంగా పోలీసుల తనిఖీలు

సిద్దిపేట, మే12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సంగారెడ్డి ఏప్రిల్‌ 12, నమస్తే తెలంగాణ : తొలి రోజు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ సంపూర్ణమైంది. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌తో అన్ని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జిల్లా కేంద్రాలైన సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌తోపాటు ప్రధాన పట్టణాలైన పటాన్‌చెరు, రామచంద్రాపురం, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌, జోగిపేట, మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల తదితర పట్టణాలతో పాటు మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు గ్రామాల్లో లాక్‌డౌన్‌ను ఉదయం 10 గం టల నుంచి అమలు చేశారు. దీంతో వ్యాపార వాణిజ్య సంస్థలు ఎక్కడికక్కడ మూసి వేశారు. ఉదయం 6 గంటల నుంచి ఆయా జిల్లాలో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. 10 గంటల తర్వాత ఏ ఒక్కరూ కూడా రోడ్లపైకి రాలేదు. అత్యవసర సేవలు యథావిధిగా నడిచాయి.

గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఉపాధిహామీ పనులు కొనసాగాయి. ప్రభుత్వ ఉద్యోగులు 33 శాతం చొప్పున తమ తమ కార్యాలయాలకు హాజరయ్యారు. తొలిరోజు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా పోలీసులు అమలు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లాలో సీపీ జోయల్‌ డెవిస్‌, మెదక్‌ జిల్లాలో ఎస్పీ చందనదీప్తి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లాక్‌డౌన్‌ పక్కాగా అమలు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో దర్శనాలను నిలిపివేశారు. ఉదయం పూట జిల్లాలో ఆర్టీసీ బస్సులు కొన్ని ప్రాంతాల్లో నడిచాయి. లాక్‌డౌన్‌ అమలు కాగానే ఎక్కడి డిపో బస్సులు అక్కడి డిపోలకే పరిమితమయ్యాయి.

కరోనా కట్టిడికి ప్రత్యేక చర్యలు
ప్రభుత్వం కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాలో అవసరమైన ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఆయా జిల్లా కేంద్రంలో కొవిడ్‌ హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను ఇస్తున్నారు.

గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. చెత్తను డం పింగ్‌యార్డులకు తరలించడం, సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్ల డం తదితర పనులు చేపట్టనున్నారు. కొవిడ్‌ ఐసొలేషన్‌ కేంద్రాలు, వాటి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. గ్రామాల ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది చురుగ్గా పాల్గొనున్నారు.

తొలిరోజు లాక్‌డౌన్‌ సంపూర్ణం..
సంగారెడ్డి జిల్లాలో లాక్‌డౌన్‌ తొలిరోజు సంపూర్ణమైంది. జిల్లా కేంద్రం సంగారెడ్డితోపాటు రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, జోగిపేట, సదాశివపేట, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ తదితర పట్టణ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. సంగారెడ్డిలో లాక్‌డౌన్‌ను ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ బాలాజీ పర్యవేక్షించారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, గుమ్మడిదల, జిన్నారం తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేశారు. పరిశ్రమలు యథావిధిగా నడిచాయి. పటాన్‌చెరు, పాశమైలారం, బొల్లారం, గడ్డపోతారం, ఖాజిపల్లిలోని పరిశ్రమలు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ ఉత్పత్తిని కొనసాగించాయి. ఆర్టీసీ లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో ప్రయాణికుల కోసం బస్సులను నడిపింది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌ డిపో పరిధిలోని 20రూట్లలో ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు 30 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.

యథావిధిగా టీకా పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు..
సంగారెడ్డి జిల్లాలో కరోనా టీకా పంపిణీ యథావిధిగా కొనసాగింది. జిల్లాలోని 39 కేంద్రాల ద్వారా వైద్య ఆరోగ్య సిబ్బంది కరోనా టీకాలు పంపిణీ చేశారు. 150 మందికిపైగా వైద్య సిబ్బంది టీకా పం పిణీలో పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ 1500 మంది వరకు కరోనా టీకా వేసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. టీకాతోపాటు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర వైద్యసేవలు యథావిధిగా కొనసాగాయి. ఇదిలాఉండగా, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సైతం యథావిధిగా నడిచాయి. రైతుల నుంచి ధాన్యాన్ని సిబ్బంది కొనుగోలు చేశారు. గురు, శుక్రవారాల్లో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు అనుమతులు ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు పోలీసులు అనుమతించారు. కర్ణాటక సరిహద్దుల్లో జాతీయ 65వ నెంబరు జాతీయ రహదారిపై చరక్‌పల్లి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. న్యాల్‌కల్‌ మండలం బీదర్‌రోడ్డులో మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కంగ్టి మండలం దేగుల్‌వాడి, నాగూర్‌(కె), నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి, మోర్గిల వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి:చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు సీఎం కేసీఆర్‌ పది రోజు ల లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలు, వ్యాపార, వాణిజ్యవర్గాల వారు సంపూర్ణంగా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలన్నారు. ప్రజలంతా ఇండ్ల నుంచి బయటకు రాకుండా స్వీయనియంత్రణ పాటించాలన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ టీకా పంపిణీ యథావిధిగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌లో సైతం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రోడ్డెక్కని జనం

ట్రెండింగ్‌

Advertisement