e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home సిద్దిపేట పరిపూర్ణ ప్రగతి పెద్దలింగారెడ్డిపల్లి

పరిపూర్ణ ప్రగతి పెద్దలింగారెడ్డిపల్లి

పరిపూర్ణ ప్రగతి పెద్దలింగారెడ్డిపల్లి

సిద్దిపేట అర్బన్‌, జూన్‌ 10 : ఏ పని చేసినా ఐకమత్యంతో చేయడం ఆ గ్రామస్తులకు ఇష్టం. కార్యక్రమం ఏదైనా దాన్ని విజయవంతం చేసే వరకు పట్టు వదలరు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కృషి.. ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం.. ‘నా గ్రామ అభివృద్ధి బాధ్యత నాదే’.. అంటూ దాతల సహకారం. కొన్నేండ్ల క్రితం వెనుకబడిన గ్రామం.. నేడు జాతీయ స్థాయిలో అవార్డు పొంది ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, ప్రజలందరీ సమష్టి కృషి, పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో నడుస్తున్నది సిద్దిపేట జిల్లా పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం.

ఐక్యతతోనే ప్రగతి..
పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం సిద్దిపేట జిల్లా కేంద్రానికి 13 కి.మీ దూరంలో ఉంటుంది. గ్రామ జనాభా 1656. పురుషులు 832 మంది, మహిళలు 824మంది. మొత్తం గృహాలు 420 ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని ఈ పల్లె, నేడు జాతీయ స్థాయిలో అవార్డు పొందిందంటే దానికి కారణం గ్రామస్తుల ఐకమత్యమే. కులం, మతం, లింగం అనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి గ్రామంలో అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. దీంతో ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తారు. గ్రామ సర్పంచ్‌ ప్రత్యేక కృషితో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో గ్రామంలో అ న్ని కుల సంఘాలకు భవనాలు, విలేజ్‌ ఫంక్షన్‌ హాల్‌, నేరాల నియంత్రణకు సీసీ కెమెరా లు, గ్రామ శివారులో క మాన్‌, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, మహిళా సంఘాలకు సహకా రం.. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందున్నది. ఇవన్నీ ఒకెత్తయితే, రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని పల్లె కుంట చెరువు నిండడం పెద్దలింగారెడ్డిపల్లె ప్రజలు చేసుకున్న మరో అదృష్టం.

పల్లె ప్రగతి స్ఫూర్తితో..
గ్రామాల రూపురేఖలు మారాలంటే యువతతో పాటు మహిళలు చైతన్యవంతులు కావాలి. అందుకనుగుణంగా ఈ గ్రామంలో ప్రతి పనికి యువత, మహిళలు ముందుకొచ్చి తమ వంతు సహకారాన్ని అందిస్తారు. గ్రామంలో ఏ మూల చూసినా హరితహారంలో నాటిన మొక్కలే దర్శనమిస్తాయి. దీనికి తోడు పల్లె ప్రగతి కార్యక్రమంలో పెద్దలింగారెడ్డిపల్లి ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, మంచి ఫలితాలు సాధించారు. సర్పంచ్‌ ఉదయశ్రీతిరుపతి ప్రత్యేక శ్రద్ధతో పలు విడుతల్లో గ్రామంలో వివిధ రకాల మొక్కలు నాటా రు. నాటిన ప్రతి మొక్కను బతికేలా ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపారు. దీంతో గ్రామంలో ఎటు చూసినా పచ్చని పందిరిలా హరితహారం మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది. పరిశుభ్రతలో గ్రామం విప్లవాత్మకమైన అడుగులు వేసింది. గ్రామ రోడ్లన్నీ అద్దంలా పరిశుభ్రంగా ఉంటాయి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా శ్రమదానం చేస్తున్నారు. గ్రామాన్ని అద్దంలా తయారు చేశారని గ్రామ పర్యటనకు పలుమార్లు వచ్చిన మంత్రి హరీశ్‌రావు గ్రామస్తులను అభినందించారు.

వినూత్న కార్యక్రమాలతో..
గ్రామంలో పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాతల సహకారంతో వీధుల్లో అధునాతన డస్ట్‌బిన్లు ఏర్పాటు చేశారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ‘లవ్‌ పెద్దలింగారెడ్డిపల్లి’ సింబల్‌ ఆకట్టుకుంటున్నది. గ్రామంలో ఏక్కడ చూసినా ఆలోచింపజేసే వాల్‌పోస్టర్లు దర్శనమిస్తాయి. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ప్రోత్సాహంతో గ్రామంలో నిరుపేదలు చనిపోతే ఉచిత దహన సంస్కారాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో బతుకమ్మ విగ్రహం, మోడ్రన్‌ బస్టాప్‌, తెలంగాణ తల్లి విగ్రహం, విలేజ్‌లో పార్క్‌, హరితహారం మొక్కలకు రంగులు.. ఇలా ప్రతిదీ వినూత్నంగా ఉంది.

పలు అవార్డులు
గ్రామస్తుల చైతన్యం కారణంగా పలు అవార్డులు పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి వరించాయి. 2007లో నిర్మల్‌ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. 2019-20 సంవత్సరానికి జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీగా కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్‌ అవార్డుకు ఎంపికైంది. గ్రామంలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త సేకరణ వంటి పలు అంశాలకు వేదికైనందుకు జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కింది.

మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశంతో ముందుకు..
దేశ స్థాయిలో అవార్డు పొందిన పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ రూపురేఖలు మారడానికి మంత్రి హరీశ్‌రావు సహకారం చాలా ఉంది. గ్రామాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పలుమార్లు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే గ్రామాల అభివృద్ధికి ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తుంటారు. ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులను ప్రోత్సహిస్తూ, దిశానిర్దేశం చేయడంతో పాటు దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు గ్రామానికి అందించారు.

ఐకమత్యమే మా బలం..
గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా అందరి మద్దతుతో సమష్టిగా ముందుకెళ్తాం. ముఖ్యంగా యువత, మహిళలు చాలా సహకరిస్తరు. జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో మేము చేసిన కష్టం అంతా మరిచిపోయినం. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేశాం. మంత్రి హరీశ్‌రావు సహకారంతో భవిష్యత్‌లో మరింత ఆదర్శంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పరిపూర్ణ ప్రగతి పెద్దలింగారెడ్డిపల్లి

ట్రెండింగ్‌

Advertisement