e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home సిద్దిపేట పుట్లకు పుట్లు

పుట్లకు పుట్లు

పుట్లకు పుట్లు
  • యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి
  • 90 శాతం కొనుగోళ్లు పూర్తి
  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10,17,739 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

సిద్దిపేట, జూన్‌ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విస్తారంగా కురిసిన వర్షాలకు తోడు గోదావరి జలాల రాకతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో యాసంగిలో రికార్డుస్థాయిలో ధాన్యం పండింది. ధాన్యపు రాశులు పోటెత్తడంతో గోదాములు సరిపోవడం లేదు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడే ధాన్యం బస్తాలు నిల్వ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 90శాతం పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో కరోనా-లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం సేకరించింది. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు 2,03,107 మంది రైతుల నుంచి 10,17,739 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీనివిలువ రూ.1921.50 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు 1,67,801 మంది రైతులకు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాల్లో రూ.1577.26 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 886 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి వరకు విజయవంతంగా ధాన్యం సేకరించింది. రాబోయే వారం రోజుల్లో చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తామని అధికారులు తెలిపారు. కాగా, మృగశిర కార్తె రావడంతో రైతులు వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. జిల్లాల్లో టాస్క్‌ఫోర్సు బృందాలు ఫర్టిలైజర్‌, విత్తనాల దుకాణాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈనెల 15 నుంచి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమకానుండడంతో రైతులకు పంట పెట్టుబడులకు రంది ఉండదు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో ఈ యాసంగిలో పుట్ల కొద్ది ధాన్యం పండింది. ప్రభుత్వం రైతు ముంగిట్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తుండడంతో రైతులకు మద్దతు ధర లభిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన144 కేంద్రాలను మూసి వేశారు. జిల్లాలో 1,00,488 మంది రైతుల నుంచి 4,82,059 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. దీని విలువ రూ. 910.13 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు 83,401 మంది రైతులకు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలో రూ. 761.40 కోట్లను ప్రభుత్వం జమచేసింది. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 54,257 మంది రైతుల నుంచి 2,57,038 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, సొసైటీల ద్వారా 41,438 మంది రైతుల నుంచి 1,99,361మెట్రిక్‌ టన్నుల ధాన్యం, ఏఎంసీ ద్వారా 3,442 మంది రైతుల నుంచి 18,128 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, మెప్మా ద్వారా 1351 మంది రైతుల నుంచి 7,532 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 92,999 మంది రైతులకు సంబంధించి 4,47,770 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలు ట్యాబ్‌లో ఎంటర్‌ చేశారు. ట్యాబ్‌ ఎంట్రీలో జిల్లాలో 93 శాతం పూర్తి చేశారు. దీని విలువ రూ. 845.39 కోట్లు ఉంటుంది.
మెదక్‌ జిల్లాలో ..
మెదక్‌ జిల్లాలో గణనీయంగా వరి సాగైంది. 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం సేకరిస్తున్నది. కొనుగోలు పూర్తి చేసిన 200 కేంద్రాలను మూసి వేశారు. జిల్లాలో మొత్తంగా 69,722 మంది రైతుల నుంచి 3,68,853 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. దీని విలువ రూ.696.40 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు 55,964 మంది రైతులకు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలో రూ. 542.92 కోట్లు అధికారులు జమ చేశారు. జిల్లాలో మహిళా సంఘాలు, సొసైటీలు, మార్కెటింగ్‌ శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు. సొసైటీల ద్వారా 49,001 మంది రైతుల నుంచి 2,73,896 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, మహిళా సంఘాలు 19,883 మంది రైతుల నుంచి 91,637 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, మార్కెటింగ్‌ శాఖ ద్వారా 838 మంది రైతుల నుంచి 3,320 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు.
సంగారెడ్డి జిల్లాలో …
సంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు, సొసైటీలు, డీసీఎంఎస్‌, ఏఎంసీల ద్వారా 143 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించారు. 32,897 మంది రైతుల నుంచి 1,66,827 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ రూ. 314.97 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు 28,436 మంది రైతులకు రూ.272.94 కోట్లు నేరుగా రైతుల వ్యక్తిగత ఖాతాలో జమ చేశారు. మరో 4,461 మంది రైతులకు సంబంధించి రూ. 42.03 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పుట్లకు పుట్లు

ట్రెండింగ్‌

Advertisement