e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home సిద్దిపేట సాగు జోష్‌

సాగు జోష్‌

సాగు జోష్‌
  • కురుస్తున్న వర్షాలు
  • మొదలైన వానకాలం సాగు పనులు
  • దుక్కులు సిద్ధం చేసే పనుల్లో రైతులు బిజీ
  • అందుబాటులో ఎరువులు, విత్తనాలు
  • ఎరువుల దుకాణాల్లో ముమ్మరంగా అధికారుల తనిఖీలు
  • వరిలో వెదజల్లే విధానానికి ప్రభుత్వ ప్రోత్సాహం
  • నేడు నంగునూరులో ఆయిల్‌పామ్‌ సాగుకు శ్రీకారం
  • హాజరు కానున్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట, జూన్‌ 4( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. అదును దాటితే అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాదని రోహిణి కార్తెలోనే వరినార్లు పోసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఈసారి వరి నారు పోసే బదులుగా వెదజల్లే సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వెదజల్లే సాగుతో పెట్టుబడులు తగ్గి మంచి దిగుబడులు సాధించవచ్చని ప్రభుత్వం చెబుతున్నది. వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం చల్లబడింది. రైతులు ట్రాక్టర్లు, ఎద్దుల నాగళ్లతో దుక్కులు సిద్ధ్దం చేస్తున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నల్లరేగడి భూముల్లో దుక్కులను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోహిణి చివరి పాదంలో నల్లరేగడి భూముల్లో పత్తి విత్తనాలకు గుంటుకతో లైన్లు వేసి సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. మరో రెండు మూడు వర్షాలు పడి భూమిలో తేమ వచ్చే వరకు విత్తనాలు వేయవద్దంటూ రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
వరి : జిల్లాలో వానకాలం పంటగా వరిని సాగుచేస్తుంటారు. ఈ ఏడాది వెదజల్లే పద్ధ్దతిని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్‌ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.

పలు గ్రామాల్లో రైతులు వరి సాగుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో రోహిణిలోనే వరినార్లు పోస్తున్నారు. ఈ నారు విషయంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వరి నారుమడిలో విత్తనాలు చల్లిన పది రోజులకు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున కార్బోప్యూరాన్‌ గుళికలు వేసుకోవాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు మరోసారి అవే గుళికలను విత్తుకోవాలి. నారు పోసిన 14 రోజులకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల సైహాలోపాప్‌, బ్యూటైల్‌ లేదా 0.5 మిల్లీ లీటర్ల బీస్‌ఫైరిబాక్‌ సోడియం చొప్పున కలిపి పిచికారీ చేస్తే అన్ని రకాల కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. 30 రోజుల వయస్సు ఉన్న నారును ఎక్కువ శాతం రైతులు నాటుతుంటారు. 15 రోజుల నారును నాటితే పిలకలు ఎక్కువ వచ్చి అధిక దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది.

పత్తి : జిల్లాలో గతేడాది నుంచి ఎక్కువగా పత్తిని సాగుచేస్తున్నారు. నల్లరేగడి భూముల్లో పత్తి పంట ఎక్కువగా దిగుబడి వస్తున్నది. పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు. కాబట్టి అధికంగా నీరు పెట్టరాదు. భూమిలో తేమను బట్టి నీటిని వదలాలి. వివిధ క్రిమికీటకాలను తట్టుకోవడానికి బీటీ పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పత్తిని ఆశించే కాయతొలుచు పురుగుల్లో అత్యంత ప్రమాదకరమైన శనగపచ్చ పురుగులను తట్టుకునే వంగడాలు తదితర వాటిని నిరోధించడంలో బీటీ విత్తనాలు ఉపయోగపడతాయి. ఈ పంటను రైతు రెండు రకాలుగా వేస్తుంటారు. చతురస్రాకారం, డబ్బా, సాలు పద్ధతిలో వేస్తుంటారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీలు మోన్‌షాన్‌టో, మైకో, రోహిణి, బన్నీ, రాశి, సుమ, బోల్‌గార్డ్‌, తులసి తదితర వాటిని వేస్తుంటారు. అన్ని ప్రాంతాల్లో భాస్వరం ఎరువులు ఒకేసారి ఆకరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నత్రజని, పొటాష్‌ను మూడు సమభాగాలుగా చేసి విత్తనం విత్తిన 30-60-90 రోజులకు మొక్క మొదళ్లకు 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేయాలి.

నువ్వులు : నువ్వుల సాగును రైతులు ఎక్కువగానే చేస్తుంటారు. జూన్‌ మొదటి వారం నుంచి సాగు చేస్తుంటారు. ఈ పంట 3 నెలల్లో కోతకు వస్తున్నది. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు ఈ పంటకు పనికి రావు. విత్తనం విత్తేముందు నేలను 2-4 సార్లు మెత్తగా దున్నాలి. అనంతరం విత్తనాన్ని విత్తాలి. ఎకరకు రెండున్నర కిలోల నువ్వులు, మూడింతల ఇసుకను కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.

కంది : కంది పంట వానకాలం, యాసంగి సమయాల్లో వేస్తుంటారు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటల్లో అంతర పంటగా కందిని సాగుచేస్తారు. వివిధ కారణాలతో తొలకరిలో ఏ పంట వేసుకునేందుకు అవకాశం లేని సమయంలో రెండో పంటగా కందిని సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వేస్తుంటారు.

పెసర : పెసరపంటను తొలకరి వర్షాల్లో సాగుచేస్తుంటారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఈ పంటను సాగుచేస్తుంటారు. ము ఖ్యంగా జూన్‌ చివరి వరకు మాత్రమే సాగుచేస్తుంటారు. అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సాగుకు ముందు నాగలితోనూ ఒకసారి దున్ని విత్తనాన్ని విత్తాలి. ఈ పంట కాల వ్యవధి 70 రోజులు.

తొలిసారి ఆయిల్‌పామ్‌ సాగు…
సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఉత్సాహవంతులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం నంగునూరు మండలం రామచంద్రాపురంలో ఆయిల్‌పామ్‌ సాగుకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు శ్రీకారం చుడతారు. పరిసర గ్రామాల రైతులకు ఈ పంట సాగుపై అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.

ఆయిల్‌ పామ్‌ సాగుతో లాభాలు…
ఎకరానికి 15-20 టన్నుల నూనె దిగుబడి వస్తున్నది. నూనె గింజల పంటల కన్నా 8 నుంచి 10 రెట్లు ఎక్కువ దిగుబడినిస్తున్నది.
పామాయిల్‌ను దేశంలో అధికంగా బేకరీ ఉత్పత్తుల తయారీకి (35.36శాతం), గృహావసరాలకు (17.78 శాతం) వినియో గిస్తున్నారు. దీనిద్వారా వచ్చే ఉప ఉత్పత్తులతో ఉపయోగాలున్నాయి. ఇవి బయోడీజిల్‌, మల్చింగ్‌కు ఉపయోగ పడతాయి.
పర్యావరణానికి మేలు కలిగించేలా, వరికి ప్రత్యామ్నాయ పంటగా రైతులు సాగు చేసుకోవచ్చు.
ఎకర వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటను సాగు చేయవచ్చు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కంపెనీలు గెలలు కొంటాయి. రైతుల ఖాతాలో పక్షం రోజులకు ఒక్కసారి డబ్బులు జమచేస్తాయి.
పామాయిల్‌ తోటల్లో అంతర పంటల సాగుతో ఎకరానికి రూ. 30 నుంచి రూ.40 వేల వరకు రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
ఈ పంటకు చీడపీడలు, కోతులు, రాళ్లవాన, దొంగల బెడద ఉండదు.
రైతులు పండించిన పంటను పామాయిల్‌ కంపెనీల ద్వారా కొనుగోలు చేస్తారు. ప్రతినెలా లాభదాయకమైన ఆదాయాన్ని రైతులు పొందవచ్చు.
నూనె గింజల పంటల్లో కెల్ల పామాయిల్‌ ఎక్కువ దిగుబడి నిస్తూ (ఎకరానికి 12 టన్నుల గెలలు) 25-30 ఏండ్ల వరకు సంవత్సరానికి సుమారుగా రూ.1,20,000 నుంచి రూ.1,50,000 వరకు ఆదాయం పొందవచ్చు. పర్యావరణానికి మేలు కలిగించేదిలా పేరుగాంచింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాగు జోష్‌

ట్రెండింగ్‌

Advertisement