శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Feb 24, 2021 , 00:02:05

చమక్కుమంటున్న చంద్లాపూర్‌

చమక్కుమంటున్న  చంద్లాపూర్‌

ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లెటూరు 

అభివృద్ధిలో జిల్లాకే గ్రామం ఆదర్శం 

జిగేల్‌మంటున్న ఎల్‌ఈడీ లైట్లు 

సీసీ నిఘా నీడలో గ్రామం ప్రశాంతం 

పల్లె ప్రగతిలో అభివృద్ధికి బాటలు 

పక్కనే రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ 

పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న పల్లె 

చూడచక్కగా చంద్లాపూర్‌..ఎటుచూసినా చక్కని సీసీ రోడ్లు.. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా సీసీ కెమెరాలు.. రైతు సమస్యలు పరిష్కరించుకునేలా అన్ని హంగులతో రైతు వేదిక.. గ్రామంలో రోడ్డుకిరువైపులా మొక్కలతో పచ్చదనం.. వైకుంఠధామాలు చివరి మజిలీకి తీరిన చింత. ఇలా గ్రామంలో ఎక్కడా చూసిన అభివృద్ధి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ పక్కనే నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఒకప్పటికీ.. ఇప్పటికీ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. అన్నింటిలో ఆదర్శంగా మారి చక్కదనాల చంద్లాపూర్‌గా జిల్లాలోనే ఈ గ్రామం అభివృద్ధిలో ముందుంది.

 చిన్నకోడూరు (ఫిబ్రవరి 23): సిద్దిపేట జిల్లాకేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ అభివృద్ధిలో దూసుకపోతున్నది. గ్రామంలో 1,000 కుటుంబాలు ఉండగా.. 5,000 వేల జనాభా ఉంది. 2,700 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 2600,మహిళలు 2400 మంది ఉన్నారు. గ్రామంలో 3 అంగన్‌వాడీ సెంటర్లు, జడ్పీ హైస్కూల్‌ -1, ప్రైమరీ స్కూల్‌ -1, హెల్త్‌ సెంటర్‌ -1 ఉన్నాయి. 2 వేల పింఛన్‌ పొందే వారు 700 మంది, 3 వేల పింఛన్‌ పొందే వారు 15 మంది ఉన్నారు. 

పర్యాటకంగా చంద్లాపూర్‌ అభివృద్ధి 

చంద్లాపూర్‌ గ్రామాన్ని ఆనుకొనే రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మించారు. దీంతో పర్యాటకంగానూ చంద్లాపూర్‌ ఎంతో అభివృద్ధి చెందింది. రంగనాయకసాగర్‌కు పర్యాటకుల రాక రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతున్నది. సందర్శ 

రైతుల సమస్యల పరిష్కారానికి రైతువేదిక 

గ్రామంలో రైతులందరూ ఒక చోట చేరి వారి సమస్యలు చర్చించుకునేందుకు అన్ని హంగులతో చంద్లాపూర్‌ విశాలంగా రూ.22 లక్షలతో రైతు వేదికను నిర్మించారు. ఇప్పటికే ఇందులో పలు సమావేశాలు నిర్వహించి శాస్త్రవేత్తలతో రైతులకు పలు రకాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. 

డంపింగ్‌ షెడ్‌తో పరిశుభ్ర వాతావరణం 

గ్రామ శివారులో రూ.7.50 లక్షలతో డంపింగ్‌ షెడ్‌ను నిర్మించారు. చెత్త సేకరణకు గాను ఇంటింటికీ చెత్త బుట్టలు అందజేశారు.నిత్యం పారిశుధ్య కార్మికులు ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తున్నారు. వీధుల్లో ఎక్కడా చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తుండడంతో గ్రామంలో ఏవీధి చూసిన పరిశుభ్రంగా ఉంది. 

వైకుంఠ ధామంతో తీరిన సమస్య 

గ్రామంలో ఇంతకు ముందు ఎవరైనా చనిపోతే ఇబ్బందులు పడేవారు. వైకుంఠధామం లేకపోవడంతో భూమిలేని వారు అంత్యక్రియలు జరపడానికి నానా ఇబ్బందులు ఎదుర్కున్నారు. అన్నివర్గాల వారికి ఇబ్బందులు లేకుండా రూ.22 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. అంత్యక్రియల అనంతరం స్నానాలు చేసేందుకు గదులు, నీటి సౌకర్యం కల్పించారు. భూమిలేని వారు సైతం ఇబ్బందులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించేలా వైకుంఠధామం నిర్మించారు. 

చెంతనే గ్రామ మార్కెట్‌ యార్డు 

గ్రామంలో రూ.7.50 లక్షలతో గ్రామ మార్కెట్‌ యార్డు నిర్మించారు. రైతులకు సొంత ఊరిలోనే తాము పండించిన కూరగాయలు అమ్ముకునేలా ఏర్పాటు చేశారు. అన్ని వసతులతో నిర్మించిన రైతుబజారు అందుబాటులోకి వచ్చింది.  

ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం 

గ్రామ శివారులో రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ పక్కన రూ. 4 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం అటు పర్యాటకులకు, ఇటు గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వాకింగ్‌ చేసే వారికి, పర్యాటకుల మనసుకు హాయినిచ్చేలా పల్లెప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. 

రెండంతుస్తుల్లో గ్రామ పంచాయతీ భవనం 

గ్రామం నడిబొడ్డున రెండంతస్తుల్లో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. ఇంతకు ముందు ఇరుకుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు కొనసాగేవి. అదే స్థలంలో పాత భవనం కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించారు. అధునాతన వసతులతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించడంతో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతో అనువుగా ఉంది. 

51 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు 

గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం 51 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అన్ని హంగులతో నిర్మించారు. రూ.2.60 కోట్లతో 36 ఇండ్లను జీప్లస్‌-2 పద్ధతిలో 3 బ్లాక్‌లుగా నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 12 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించారు. ఎస్సీ కాలనీలో 15 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అందజేశారు. 

అభివృద్ధి పనులు 

రామంచ ఆర్‌అండ్‌బీ రోడ్‌ నుంచి చంద్లాపూర్‌ మీదుగా చిన్నకోడూరు నుంచి మందపల్లి రాజీవ్‌ రహదారి వరకు రూ.9.25 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, గొర్రెల షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.10 లక్షలతో రజక సంఘ భవనంతో పాటు ఆయా కులాల వారికి సంఘాలను నిర్మించారు. శుభాకార్యాలు నిర్వహించుకోవడానికి గుట్టపై పంక్షన్‌ హాల్‌ నిర్మించారు. గుట్టపైకి వెళ్లేందుకు కోటి రూపాయలతో సీసీ రోడ్డుతో పాటు మెట్లు నిర్మించారు. 

నేడు నెలనెలా జీతాలు చెల్లింపు 

ఒకప్పుడు గ్రామంలో పనిచేసే జీపీ సిబ్బందికి సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు నెలనెలా ఠంఛన్‌గా జీతాలు చెల్లిస్తున్నారు. గ్రామానికి ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులతో పాటు గ్రామంలో సమకూరుతున్న ఆదాయ వనరులు సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నది. వీటితో పారిశుధ్య కార్మికులతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లిస్తున్నారు. నెలనెలా ఈ కింది విధంగా చెల్లింపులు జరుగుతున్నాయి. 

గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ.7 వేలు, 

విద్యుత్‌ సామగ్రికి 5 వేలు 

పారిశుధ్య కార్మికులు 7 మందికి రూ.8500 చొప్పున

6 మందికి రూ.5 వేల చొప్పున వాటర్‌మెన్‌కు రూ.8500

కారోబార్‌ రూ.8500 

మంత్రి సహకారంతో అభివృద్ధి...

మంత్రి హరీశ్‌రావు కృషితో పల్లె ప్రగతిలో గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందింది. మేము గ్రామం అభివృద్ధికి అడిగినదాని కన్నా ఎక్కువ చేశారు. గ్రామంలో ఏం అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంత్రికే ఎక్కువ తపన ఉంటుంది. చంద్లాపూర్‌పై మమకారం ఎక్కువ. గ్రామస్తులపై అభిమానంతో అడగకుండానే అన్నీ చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా గ్రామం అభివృద్ధి కావాలని మంత్రి ఆలోచన ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చెందితే గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. గ్రామం పక్కనే రంగనాయకసాగర్‌  నిర్మించడంతో గ్రామం పేరు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నది. గ్రామస్తులందరం రుణపడి ఉంటాం.  

- వేలేటి రోజాశర్మ జడ్పీ చైర్‌పర్సన్‌,

రాధాకృష్ణశర్మ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి  

ఆదర్శవంతంగా  మార్చాం..

గ్రామస్తులందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాం. గ్రామాన్ని  ఆదర్శంగా మార్చాం. గ్రామంలో అన్ని గల్లీల్లో సీసీ రోడ్లు నిర్మించాం. మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ప్రభుత్వం కృషితో గ్రామంలో ఇన్ని అభివృద్ధి పనులు పూర్తిచేశాం. 

- సూరగోని చంద్రకళ రవిగౌడ్‌, 

సర్పంచ్‌, చంద్లాపూర్‌  

ప్రభుత్వ కృషితోనే అభివృద్ధి 

గతంతో పోల్చితే నెలనెలా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నది. సుమారు లక్ష రూపాయల వరకు గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇచ్చే స్థాయికి చేరింది. గతంలో పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతినెలా 13 మందికి వేతనాలు ఇస్తుండడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. ప్రభుత్వ కృషితో గ్రామం ఆదర్శంగా మారింది.

- కాసర్ల దుర్గారెడ్డి, ఎంపీటీసీ, చంద్లాపూర్‌

VIDEOS

logo