బుధవారం 03 మార్చి 2021
Siddipet - Feb 23, 2021 , 03:16:18

సింగారించుకున్న సింగాయిపల్లి

సింగారించుకున్న సింగాయిపల్లి

  • నాడు తాగునీటికి కటకట..
  • నేడు ఇంటింటికీ భగీరథ జలాలు
  • ఆకట్టుకునే పల్లె ప్రకృతి వనం
  • వాడవాడనా సీసీ రోడ్లు, వీధి దీపాలు
  • వైకుంఠధామం ఏర్పాటుతో తీరిన చివరి మజిలీ చింత
  • సీఎం కేసీఆర్‌ కృషితో జీపీగా ఏర్పాటు
  • అతి తక్కువ కాలంలోనే గ్రామంలో అభివృద్ధి

వర్గల్‌, ఫిబ్రవరి 22 : వర్గల్‌ మండలంలోని సింగాయిపల్లి గ్రామం గతంలో గౌరారం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉండేది. సీఎం కేసీఆర్‌ కృషితో 2018లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా సింగాయిపల్లి ఏర్పడింది. తొలి పంచాయతీ ఎన్నికల్లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు గ్రామపంచాయతీని కైవసం చేసుకొని ప్రగతి పథం వైపు గ్రామాన్ని నడిపిస్తున్నారు. రాజీవ్‌ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామంలో 90శాతానికి పైగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. ప్రతి ఇంటిలో 10 తరగతి, ఆపై చదివిన విద్యావంతులు ఉన్నారు. ఈ గ్రామంలో ప్రధానంగా కూరగాయల సాగుచేసి జీవనోపాధి పొందుతున్నారు. ఊరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు.

నాడు తాగునీటికి కుస్తీలు.. నేడు కరువుతీరా నీళ్లు

ఎండాకాలం వచ్చిందంటే సింగాయిపల్లిలో తాగునీటి కోసం మహిళలు కుస్తీలు పట్టేవారు. ఒకానొక సందర్భంలో నీళ్లకొట్లాటలు గ్రామ పంచాయతీ వరకు వెళ్లేవి. 2015లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయిలు ఇచ్చి, శుద్ధమైన తాగునీటిని అందిస్తుండడంతో నీళ్ల కొట్లాటలకు ముగింపు పడింది. గ్రామంలో 187 కుటుంబాలకు పైపులైన్‌ ఏర్పాటు చేసి నిరంతరంగా సురక్షితంగా నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులకు నీటి కష్టాలు తీరాయి.

పల్లెకు పచ్చనిహారం..ప్రకృతివనం

సింగాయిపల్లి గ్రామంలో అటవీశాఖ వారి అనుమతులతో రాజీవ్‌ రహదారికి సమీపంలోనే ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకర్షణీయంగా నిలుస్తున్నది. ఆహ్లాదాన్ని పంచుతున్నది. 

తీరిన చివరి మజిలీ ఇబ్బందులు 

సింగాయిపల్లిలో వైకుంఠధామం లేక అంత్యక్రియలకు గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ప్రత్యేక నిధులతో గ్రామంలో ఉత్తరం దిశగా వైకుంఠధామం నిర్మాణానికి పునాదులు పడడంతో గ్రామంలో ఈ సమస్యకు ముగింపు పడింది. స్థలాభావం ఉండటంతో గ్రామంలో ఎవ్వరు సచ్చినా, వారి సొంత స్థలాల్లోనే అంత్యక్రియలు నిర్వహించేవారు. ప్రతి ఊరికి వైకుంఠధామం ఉండాలనే ప్రభుత్వం ఉద్దేశంతో సింగాయిపల్లికి వైకుంఠధామం ఏర్పాటైంది. 

పాతబావుల పూడ్చివేతతో  ప్రమాదాల నివారణ 

సింగాయిపల్లిలో చెరువు కట్టకు వెళ్లే వైపు, చేన్లకాడికి వెళ్లేమార్గంలో 3 పాతబావులు ప్రమాదకరంగా ఉండేవి. పల్లెప్రగతి కార్యక్రమంలో వీటిని పూడ్చివేశారు. దీంతో ఆ మార్గంగుండా వెళ్లే రైతులు,పిల్లలకు ఇబ్బందులు తీరాయి. 

సమష్టి కృషితోనే సాధ్యమైంది.. 

గ్రామాభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోతున్నాం. పూర్వపు గ్రామపంచాయతీ అయిన గౌరారం నుంచి సింగాయిపల్లి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడినప్పడినుంచి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు అదనంగా రూ.20 లక్షలు గ్రామభివృద్ధికి కేటాయించడంతో ట్రాక్టర్‌ కొనుగోలుతో పాటు ఇతర పనులకు కేటాయించాం. పాడుబడిన బావులను పూడ్చాం. పాతిండ్లను కూల్చాం. ఏండ్లుగా ఉన్న తాగునీటి సమస్యలను పరిష్కరించాం.

-సంగీతావేణుగోపల్‌రావు(గ్రామసర్పంచ్‌ సింగాయిపల్లి) 

ఆకర్షణీయంగా ప్రకృతివనం.. 

ఇతర గ్రామాల్లో కంటే ఆకర్షణీయంగా ప్రకృతివనం ఉండాలనే ఉద్దేశంతో రాజీవ్‌ రహదారికి చెంతన సింగాయిపల్లి అటవీ ప్రాంత పరిధిలో అర ఎకరంలో సర్పంచ్‌, గ్రామస్తుల కృషితో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. ఈ పార్కు ఏర్పాటుతో గ్రామస్తులతో పాటు రాజీవ్‌ రహదారి మార్గంలో ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యంగా మారింది. గ్రామంలో పారిశుధ్యం పక్కాగా చేపడుతున్నాం.-రాజేశ్వరీ, పంచాయతీ కార్యదర్శి, సింగాయిపల్లి  

సీఎం కేసీఆర్‌ కృషితోనే అభివృద్ధి.. 

సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ కార్యక్రమంతోనే సింగాయిపల్లి గ్రామాభివృద్ధికి బాటలు పడ్డాయి. అంతకు ముందు మా గ్రామంలో తాగునీటికి గ్రామస్తులు తంటాలు పడేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్‌, పంచాయతీ భవనం, బస్టాండ్‌ పనులు పూర్తయితే మా గ్రామంలో సమస్యలే ఉండవు.

-వేణుగోపాల్‌రావు, విద్యావేత్త, సింగాయిపల్లి

VIDEOS

logo