సోమవారం 01 మార్చి 2021
Siddipet - Feb 23, 2021 , 03:17:19

చరమాంకంలో.. చేదోడుగా..

చరమాంకంలో.. చేదోడుగా..

  • వృద్ధులకు అండగా సీఆర్పీసీ సెక్షన్‌ 125 
  • తల్లిదండ్రుల బాధ్యత వారి సంతానానిదే...

ఆధునికత ముసుగులో సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు తిండిలేక, నిలువ నీడలేక మలి సంధ్య వేళ తీవ్ర మానసిక క్షోభతో తల్లడిల్లుతుల్లున్నారు. నవమాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన కన్న పిల్లలే తమని గాలికి వదిలేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లుతున్న చట్టాలపై అవగాహనలేమితో కుమిలిపోతున్నారు. రోజురోజుకు దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది. మున్ముందు అనేక వృద్ధాశ్రమాలు అవసరమని సామాజిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వారికి అనేక చట్టపరమైన రక్షణలున్నా వాటిపై సరైన పరిజ్ఞానం, అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. కన్నబిడ్డలే చీత్కరించుకున్నా, అయినవారు కాదన్నా చేసేదేమీలేక చేష్టలుడిగి చూస్తున్నారు. ఇలాంటి సామాజిక రుగ్మతలను అరికట్టేందుకు పాలకులు అనేక చట్టాలు తీసుకువచ్చారు. రాజ్యంగంలో వారి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ పలు ఆర్టికల్స్‌ను పొందుపరిచారు. హిందూ అడాప్షన్‌, మెయింటెనెన్స్‌ యాక్ట్‌ 1956 సెక్షన్‌ 20, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1973లోని సెక్షన్‌ 125 కింద చట్టాలను చేశారు. 

మెయింటెనెన్స్‌ బాధ్యత ఎవరిది...

వృద్ధుల పోషణ కోసం వారి వారసులపై పిటిషన్‌ వేయవచ్చు. వారు లేకుంటే మనవళ్లు, మనవరాళ్లపై కూడా పిల్‌ దాఖలు చేయవచ్చు. అలాగే, పిల్లలు లేని వారు వారి బంధువులపైనా మెయింటెనెన్స్‌ కోరవచ్చు. ఆ బంధువు సంక్షేమం కోరుతున్న వ్యక్తి ఆస్తులను కలిగి ఉండాలి. మరణానంతరం వారి ఆస్తులను వారసత్వంగా పొందే హక్కు కలిగి ఉండాలి. ఒకరి కంటే ఎక్కువ మంది బంధువులు ఇందుకు అర్హులైతే వారందరూ సమాన వాటాగా పోషణ భారం భరించాల్సి ఉంటుంది. అలాగే, మెయింటనెన్స్‌ అంటే నిత్య జీవితంలో జీవించడానికి అయ్యే మౌలిక వసతుల కల్పనకు మాత్రమే వేసుకోవాలి. 

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1973 

వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన అవశ్యకత సంతానంపై ఉన్నదని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1973లో సెక్షన్‌ 125 చెబుతున్నది. ఈ సెక్షన్‌ అన్ని మతాలకు వర్తిస్తుంది. ఈ చట్టం కింద కుమారులు, కుమార్తెలు (పైండ్టెనా కూడా కోర్టుల్లో కేసులు దాఖలు చేయవచ్చు. తల్లిదండ్రులు అంటే సొంత వారు, దత్తత తీసుకున్నవారు, సవతి తల్లి దండ్రులు). అలాగే సీనియర్‌ సిటిజన్లు అంటే 60 సంవత్సరాలు ఉండాలి కానీ, తల్లిదండ్రులకు ఎలాంటి వయోపరిమితి లేదు. తాము సొంతంగా పోషణ అవసరాలను తీర్చుకోలేని వారే ఈ చట్టం కింద మెయింటనెన్స్‌ వేసుకోవచ్చు. 

చట్టాలు, రక్షణలు..

  • ఒక వ్యక్తి తన జీవితకాలం ఉద్యోగిగా పనిచేస్తే వృద్ధ్దాప్యంలో పింఛన్‌, ఆరోగ్య బీమా, తదితర వసతులుంటాయి. 
  • వృద్ధులకు ఎలాంటి ఉపాధి లేకపోతే వయోభారం, అనారోగ్యం వంటిసమస్యలు ఎదురైనప్పుడు ప్రజాసాయం కోరే హక్కులు రాజ్యాంగంప్రకారం వృద్ధులకు ఉన్నాయి. వయోభారం మీదపడిన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత కన్నవారిపై ఉంటుంది. 
  • హిందూ ప్రయోజిత చట్టాల్లో తల్లిదండ్రుల పోషణ బాధ్యత సాధారణంగా కొడుకులపై ఉంటుంది. తల్లిదండ్రులు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి సంతానం హిందూ అడాప్షన్‌,మెయింటనెన్స్‌ యాక్టు 1956 కింద తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుంది. ఈ సెక్షన్‌ కింద కుమారులకే కాదు, కుమార్తెలకు కూడా సమాన బాధ్యత ఉంటుంది.సంతానం పట్టించుకోకుంటే వారు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.  

VIDEOS

logo