బుధవారం 03 మార్చి 2021
Siddipet - Feb 21, 2021 , 00:17:47

అగ్గువలో వ్యాధి నిర్ధారణ

అగ్గువలో వ్యాధి నిర్ధారణ

  • బ్లడ్‌బ్యాంక్‌, యాంటీ రేబిస్‌ క్లినిక్‌ సైతం అందుబాటులో.. 
  • ఆహార పదార్థాల నాణ్యతపై ఫలితాలు 
  • డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ
  • పేదలకు వరప్రదాయినీ ఐపీఎం 
  • ప్రాణాంతక వ్యాధులు అరికట్టడంలో కీలక భూమిక 

ఐపీఎంలో వైద్య పరీక్షలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. .10, 30, 50 నుంచి టెస్టులు ప్రారంభమవుతాయి. ఒక్క స్వైన్‌ఫ్లూ మాత్రం .3500లు ఉంది. మిగతా ఏ వైద్య పరీక్షలైనా వంద రూపాయల్లోపు మాత్రమే. చాలా మందికి ఈ విషయం తెలియక బయట ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పరీక్షలు చేయించుకుంటూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అంబర్‌పేట, ఫిబ్రవరి 20 : ఏ అనారోగ్య సమస్య వచ్చినా.. చిన్న రోగ నిర్ధారణ టెస్టులకే తడిసిమోపడవుతున్నది. వ్యాధి నిర్ధారణ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇది పేదలకు తలకు మించిన భారమే. హైదరాబాద్‌ నారాయణగూడలోని ‘డైరెక్టర్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)’లో మాత్రం అతి తక్కువ ధరకే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. దశాబ్దాలుగా వైద్యసేవలందిస్తున్న ఐపీఎం, ప్రాణాంతక వ్యాధులను అరికట్టడంలో కీలక భూమిక పోషిస్తున్నది. ఇక్కడ అత్యాధునిక ల్యాబ్‌ అందుబాటులో ఉన్నది. ఫుడ్‌, డ్రగ్‌, వాటర్‌ నమూనాలను పరీక్షించేందుకు ప్రయోగశాలలు ఉన్నాయి. స్వైన్‌ఫ్లూ, హెచ్‌ఐవీ తదితర పరీక్షలూ నిర్వహిస్తారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లకు సైతం శిక్షణ ఇస్తారు. 

బ్లడ్‌బ్యాంక్‌ సేవలు..

రక్త పరీక్షల కోసం రోగుల నుంచి నమూనాలను సేకరిస్తారు. బ్లడ్‌బ్యాంక్‌ కూడా అందుబాటులో ఉన్నది. అత్యవసర సమయాల్లో  రోగులకు శుద్ధ రక్తాన్ని కూడా సరఫరా చేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరిస్తారు.

వైద్య పరీక్షలు..

అత్యాధునిక డయోగ్నస్టిక్‌ సెంటర్‌ సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. అన్నిరకాల వ్యాధులకు ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. పాథాలాజీ, మైక్రోబయోలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లడ్‌ షుగర్‌, యూరిన్‌, వైడల్‌, వీడీఆర్‌ఎల్‌, కల్చర్‌, బ్లడ్‌ గ్రూప్‌, ఆల్ట్రా సౌండ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 

వాటర్‌ ఎనాలసిస్‌ సేవలు..

నీటి నమూనాలను సేకరించి అందులో కెమికల్‌, బ్యాక్టీరియాలపై పరీక్షలు నిర్వహిస్తారు. నాలాల నీటిని, పరిశ్రమలు విడుదల చేసే కలుషిత నీటిలో విషకారకాల గాఢత ఏ మేరకు ఉన్నాయనే దానిపై పరీక్షలు చేస్తారు. 

హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ టెస్ట్‌..

హెచ్‌ఐవీ అనుమానిత రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాక్సినేషన్‌ సెంటర్‌ కూడా అందుబాటులో ఉన్నది. వ్యాధి నిరోధక టీకాలపై పరిశోధనలు, ఇమ్యూనైజేషన్‌ టీకాలు, యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లూ ఇస్తారు.  

స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌..

కల్తీని అరికట్టేందుకు ఆహారపదార్థాల నమూనాలను సేకరించి ఐపీఎంలో పరీక్షిస్తారు. ఫుడ్‌ లైసెన్స్‌ కూడా జారీ చేస్తారు. ఫుడ్‌ సెక్యూరిటీ, నాణ్యమైన ఆహార పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా బయోలాజికల్‌ స్టాండరైజేషన్‌, ఔషధాల క్వాలిటీ టెస్టులు చేస్తారు. బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, వాటర్‌ ఎనాలసిస్‌ విభాగాల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. ప్రజలు ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారనే అంశాన్ని గుర్తించి, ముందు జాగ్రత్త చర్యలు చేపడుతారు.

సేవలను సద్వినియోగం చేసుకోండి..

ఐపీఎంలో లభిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ అనేక రకాల వైద్య పరీక్షలను నాణ్యతతో అతి తక్కువ ధరలకే చేస్తారు. బ్లడ్‌ బ్యాంకు ద్వారా అవసరమైన రక్తం లభిస్తుంది. యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇస్తాం. ఇక కల్తీ ఆహారపదార్థాలు అమ్మినా, తయారు చేసినా చర్యలు తప్పవు. ఇలాంటివి ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకురావచ్చు. అవసరమైతే సెల్‌ నంబర్‌కు 9100107309కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
- డాక్టర్‌ కె.శంకర్‌, 
ఐపీఎం డైరెక్టర్‌,హైదరాబాద్‌

VIDEOS

logo