శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 19, 2021 , 00:17:30

విజ్ఞాన భాండాగారం.. శిష్టతల సమాహారం

విజ్ఞాన భాండాగారం.. శిష్టతల సమాహారం

  • రాష్ట్రంలో మొదటి డిజిటలైజేషన్‌ లైబ్రరీ  
  • రూ.3 కోట్లతో ఆధునిక భవనం 
  • 23 వేల పుస్తకాలు.. 5 వేల మంది పాఠకులు 
  • మంత్రి కృషితో త్వరలో అందుబాటులోకి..

విజ్ఞాన భాండాగారాలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. స్వరాష్ట్రంలో గ్రంథా లయాలు సకల హంగులతో కొత్తగా నిర్మితమవుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక     కృషితో సిద్దిపేటలోని టీటీసీ భవన్‌ సమీపంలో బైపాస్‌ రోడ్‌లో 3కోట్లతో నిర్మించిన గ్రంథాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్రంలో మొదటి డిజిటలైజేషన్‌, రెండో ఆధునిక భవనం కలిగిన గ్రంథాలయమిది. ఈ భవనాన్ని జీ+1 పద్ధతిలో నిర్మించగా, 13 విశాల గదులున్నాయి. లైబ్రరీలో      23 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 20 కంప్యూటర్లతో పాటు ఉచిత ఇంటర్నెట్‌    సౌకర్యాలు కల్పించారు. సీనియర్‌ సిటిజన్‌, రీడింగ్‌ హాల్‌, పుస్తక, పేపర్‌ పాఠకుల కోసం ప్రత్యేక  హాల్‌, చిన్నారులు, మహిళలు, ఉర్దూ మీడియం వారి కోసం ప్రత్యేక విభాగాలు.. ఇలా వేటికవే ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ లైబ్రరీ త్వరలో అందుబాటులోకి రానుండగా, పాఠకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట టౌన్‌, ఫిబ్రవరి 18 : ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన గ్రంథాలయాలు స్వరాష్ట్రంలో ఆధునిక హంగులతో భవనాలు నిర్మితమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ గడ్డ విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్న సిద్దిపేటకు విజ్ఞాన భాండాగారం వచ్చి చేరింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో జిల్లా గ్రంథాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్రంలో మొదటి డిజిటలైజేషన్‌, రెండో ఆధునిక భవనం కావడం విశేషం. సిద్దిపేట జిల్లా గ్రంథాలయానికి ఏండ్ల చరిత్ర కలిగి ఉంది. మొదటి నుంచి పటేల్‌పుర సంతోషిమాత ఆలయం పక్కన కొనసాగుతున్నది. జిల్లా కేంద్రం ఏర్పాటయ్యాక కూడా అక్కడే ఉండడం రోజురోజుకూ పాఠకుల సంఖ్య పెరగడంతో ఇరుకుగా మారింది. దీంతో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని టీటీసీ భవన్‌ సమీపంలో బైపాస్‌ రోడ్‌లో ఆధునిక గ్రంథాలయ భవనానికి స్థలం కేటాయించి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద నిధులను మంజూరు చేశారు. దీంతో ఆధునిక లైబ్రరీకి బీజం పడింది.

జీ+1 అంతస్తులో భవనం..

గ్రంథాలయాన్ని జీ+1 అంతస్తులో నిర్మించారు. విశాలంగా 13 గదులు ఉన్నాయి. అత్యాధునికంగా నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో విశాలమైన హాల్‌లో కంచి నుంచి తెచ్చిన సరస్వతీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పక్కనే సీనియర్‌ సిటిజన్‌, రీడింగ్‌ హాల్‌, పుస్తక, పేపర్‌ పాఠకుల కోసం ప్రత్యేక హాల్‌, చిన్నారులు, మహిళలు, ఉర్దూ మీడియం వారి కోసం ప్రత్యేక విభాగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రత్యేక సెక్షన్‌, ఒరియంటేషన్‌ హాల్‌, ప్రొజెక్టర్‌, రీడింగ్‌ హాల్‌.. ఇలా వేటికవే ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

23 వేల పుస్తకాలు.. 5 వేల మంది శాశ్వత సభ్యులు.. 

సిద్దిపేట లైబ్రరీలో 23 వేల పుస్తకాలు పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి. 5 వేల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. నిత్యం సుమారు 250 మంది పాఠకులు వస్తుంటారు. ఇది పాత గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య మాత్రమే. నూతన గ్రంథాలయం అందుబాటులోకి రావడంతో పాఠకుల సంఖ్య మరింత పెరుగనున్నది. దానికి అనుగుణంగా గ్రంథాలయ సంస్థ పుస్తకాలను అదనంగా సమకూర్చనున్నది. జిల్లా గ్రంథాలయం అందుబాటులోకి రావడంతో కవులు, విద్యావేత్తలు, సాహిత్య అభిమానులు, పాఠకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రంలో మొదటి డిజిటలైజేషన్‌..

సిద్దిపేటలో  గ్రంథాలయాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. రాష్ట్రంలో మొదటి డిజిటలైజేషన్‌ కేంద్రంగా, రెండో అత్యాధునిక భవనం ఇక్కడే నిర్మించడం విశేషం. భవనంలో డిజిటల్‌ గది ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఇందులో 20 కంప్యూటర్లతో పాటు ఉచిత ఇంటర్నెట్‌ ఏర్పాటు చేశారు. అనేక కావ్యాలు, కండకావ్యాలు డిజిటలైజేషన్‌ చేసి అందుబాటులో ఉంచారు. 


ఆధునిక హంగులతో తీర్చిదిద్దాం..

జిల్లా గ్రంథాలయాన్ని   ఆధునిక హంగులతో తీర్చిదిద్దాం. మంత్రి హరీశ్‌రావు సంపూర్ణ సహకారం, సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఆధునిక భవనాన్ని నిర్మించాం. సుమారు రూ.3 కోట్లను వెచ్చించాం. 13 గదులను వేటికవే ప్రత్యేకంగా ఆధునికంగా మలిచాం. పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రత్యేకంగా నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో తరగతులను ఏర్పాటు చేస్తాం. సుమారు 80 ఏండ్లకు సరిపడే వసతులను జిల్లా గ్రంథాలయంలో సమకూర్చాం. 

- లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, 

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ 

గ్రంథాలయాలకు పూర్వవైభవం 

గ్రంథాలయాలకు ప్రభుత్వం పూర్వ వైభవం తెస్తున్నది. సిద్దిపేట విద్యా వికాస కేంద్రంగా వికసిస్తున్నది. పాఠకుల అభిరుచికి అనుగుణంగా ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మించాం. సకల సదుపాయాలు కల్పించాం. 23 వేల పుస్తకాలు, 5 వేల శాశ్వత సభ్యులు ఉన్నారు. అన్ని వర్గాల కోసం పుస్తకాలు అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలో మొదటి  డిజిటలైజేషన్‌ గ్రంథాలయం సిద్దిపేటలోనే ఉండడం గర్వకారణం. ఇంత మంచి భవనం నిర్మించిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు. 

- వసుంధర, ఉమ్మడి జిల్లా

 గ్రంథాలయ సంస్థ కార్యదర్శి 

VIDEOS

logo