బుధవారం 03 మార్చి 2021
Siddipet - Feb 19, 2021 , 00:17:27

చెంచెల్‌చెర్వుపల్లి..చూడచక్కదనం

 చెంచెల్‌చెర్వుపల్లి..చూడచక్కదనం

  • పల్లెప్రగతిలో మారిన రూపురేఖలు 
  • చమక్కుమంటున్న గ్రామం
  • గ్రామానికి ఉత్తమ గ్రామపంచాయతీ పురస్కారం  
  • తీరిన తాగునీటి సమస్య
  • గ్రామంలో 15 వేల మొక్కల పెంపకం
  • రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
  • అందుబాటులో డంపింగ్‌యార్డు, ప్రకృతి వనం
  • చివరి దశలో వైకుంఠధామ నిర్మాణం

పల్లె ప్రగతి ఊరిని మార్చివేసింది.. నీటి ఎద్దడిని దూరం చేసింది.. పచ్చదనాన్ని పెంచింది.. పారిశుధ్యాన్ని మెరుగుపర్చింది.. శిథిల భవనాలు తొలగించి.. గుంతలు పూడ్చేయించింది. ఒకప్పుడు సమస్యలు నెలకొన్న చెంచెల్‌చెర్వుపల్లి గ్రామంలో ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తున్నది. పల్లెప్రగతిలో ముందు నిల్చినందుకు ఉత్తమ జీపీ పురస్కారం వరించింది.

కోహెడ, ఫిబ్రవరి 18 : మండలంలోని చెంచెల్‌చెర్వుపల్లె పచ్చదనం, పరిశుభ్రతకు నిలయంగా మారింది. పల్లెప్రగతి కార్యక్రమంలో అనేక అభివృద్ధి పనులు జరుగడంతో గ్రామరూపురేఖలు మారాయి. ప్రభుత్వం గ్రామ పంచాయతీకి అందించిన ట్రాక్టర్‌తో నిత్యం పారిశుధ్య పనులు చేపడుతున్నారు. రూ.25లక్షలతో గ్రామంలో సీసీరోడ్లు నిర్మించడంతో గ్రామానికి సొబగులు అద్దాయి. 

తీరిన తాగునీటి సమస్య...

గతంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ గ్రామస్తుల నీటి అవసరాలను తీర్చడానికి సరిపోలేదు. పంచాయతీ పాలకవర్గ విజ్ఞత్తితో మిషన్‌ భగీరథ కింద రూ.16లక్షలతో 60వేల లీటర్ల సామర్థ్యంతో నీటిట్యాంకును నిర్మించారు. అయినా ఇబ్బందులు తీరలేదు. మరోసారి ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ దృష్టికి సమస్య తీసుకురాగా, మరో ట్యాంక్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వీటి పనులు ప్రారంభించారు. ఈ వేసవిలో పల్లెప్రగతి నిధుల మూలంగా నీటి కొరత తీరనున్నది. 

40 రోజుల పాటు శ్రమదానం...

పల్లెప్రగతి కార్యక్రమం అమలుతో కోహెడ మండలంలోని చెంచెల్‌చెర్వుపల్లిలో పారిశుధ్యం మెరుగుపడింది. ప్రగతి వెల్లివిరుస్తున్నది. సర్పంచ్‌గా భీంరెడ్డి సత్యవతి, ఎంపీటీసీ తూటి సుజాత, జీపీ పాలకవర్గం, గ్రామస్తుల ఆధ్వర్యంలో 40రోజుల పాటు గ్రామంలోని వీధివీధినా శ్రమదానం చేపట్టారు. చెత్తా చెదారాన్ని తొలిగించారు. పారిశుధ్య సిబ్బందితో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. 

సర్పంచ్‌ ఔదార్యం...

వేసవిలో నీటి ఎద్దడి రావడం, గ్రామంలోని నీటిట్యాంకు ఒకటే ఉండడం, వ్యవసాయ బావిలో నీరు లేకపోవడంతో నీటిఎద్దడి ఎదురైంది. దీంతో గ్రామస్తులకు ఇబ్బందుల కలగడంతో భర్త రాజిరెడ్డితో కలిసి వ్యవసాయ బావి వద్ద పంటలు వేయకుండా సొంత ట్యాక్టర్‌తో వ్యవసాయ బావి నుంచి నీరు తెచ్చి 150 ట్రిప్పులను గ్రామస్తులకు సర్పంచ్‌ అందించారు. నీటి సమస్యను ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ దృష్టకి రావడంతో మిషన్‌ భగీరథ కింద మరో నీటి ట్యాంకు నిర్మాణానికి ఆయన నిధులు మంజూరు చేశారు. అయినా నీటి కొరత ఎదురవుతుండడంతో మరో ట్యాంకర్‌ను మంజూరు చేయించారు. ప్రగతి నిధులతో గ్రామంలో సీసీరోడ్లు నిర్మించారు. 15వేలకు పైగా మొక్కలు నాటారు. డంపింగ్‌ యార్డు, నర్సరీ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ కొత్తది నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మింపజేశారు.  

విరివిగా మొక్కల పెంపకం.. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం.. మెరుగుపడిన పారిశుధ్యం.. శిథిల భవనాలు తొలిగింపు.. గుంతల పూడ్చివేత.. నిత్యం ఇంటింటా చెత్త సేకరణతో చెంచెల్‌చెర్వుపల్లి రూపురేఖలు మారాయి. ఒకప్పుడు సమస్యలు నెలకొన్న ఈ గ్రామంలో, ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తున్నది. సీసీరోడ్ల నిర్మాణంతో గ్రామం సొబగులంద్దుకుంది. ట్యాంకు నిర్మాణంతో తాగునీటి వెతలు తప్పాయి. శ్రమదానం, పల్లెప్రగతిలో ముందు నిల్చింనందుకు గ్రామానికి ఉత్తమ జీపీ పురస్కారం వరించింది.  

ఉత్తమ జీపీ పురస్కారం...

పల్లెప్రగతి ద్వారా జరిగిన అభివృద్ధి పనులను మండల, జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మండల స్థాయిలో చెంచల్‌చెర్వు పల్లిని ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక చేశారు. గత జనవరి 26న గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్‌ భీంరెడ్డి సత్యవతి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు అందుకున్నారు. 

గ్రామంలో మార్పు వచ్చింది..

పల్లెప్రగతికి ముందు గ్రామాలు అభివృద్ధి లేక బోసిపోయినట్టు ఉండేవి. ఇప్పుడు గ్రామాలు కళకళలాడుతున్నాయి. అధికారులు పరుగులు పెట్టించి గ్రామపంచాయతీ పాలకవర్గం, సిబ్బందితో పనులు చకచకా చేయించారు. మా గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడింది. పరిశుభ్రంగా గ్రామం మారింది. అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఇది వరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. నెలనెలా పల్లెప్రగతి ద్వారా నిధులు వస్తుండడంతో పనులు చేయిస్తున్నాం. వీధిలైట్లు ఏర్పాటు చేశాం. గతంలో మాదిరిగా నీటి సమస్య ఇప్పుడు గ్రామంలో లేదు.

డంపిండ్‌యార్డు నిర్మాణం..

రూ.2.40లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మించారు. గ్రామంలో వైకుంఠధామ నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. స్థల వివాదంతో పల్లె ప్రకృతివనం పనులు నిలిచాయి. హరితహారం కార్యక్రమంలో గ్రామంలో 15వేల మొక్కలు నాటి సంరక్షించడంతో గ్రామంలో పచ్చదనం నెలకొంది. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతుండడంతో పల్లెలో పారిశుధ్యం మెరుగుపడింది. అంతకు ముందు అనేక సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. కాగా, పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడంతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. దీంతో గ్రామస్తులకు సౌకర్యంగా మారింది. 

VIDEOS

logo