ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Feb 19, 2021 , 00:19:49

‘కార్పొరేట్‌' మండపం

‘కార్పొరేట్‌' మండపం

  • ఎర్రవల్లి కల్యాణ మండపం రాష్ర్టానికి స్ఫూర్తి
  • ఏడాదికి వంద పెండ్లిళ్లు
  • పేదోళ్లకు అందుబాటులో వసతులు 

 మండలంలోని ఎర్రవల్లి గ్రామం అనేక అంశాల్లో రాష్ర్టానికి ఆదర్శంగా మారింది. సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకోవడంతో  గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ఎర్రవల్లిలో జరిగిన అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తిగా నిలుస్తున్నది. 2016లో ఎర్రవల్లిలో కోట్లాది రూపాయలతో కార్పొరేట్‌ స్థాయిలో సామూహిక కల్యాణ మండపం నిర్మించారు. పేదోళ్లను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన  కల్యాణ మండపం రాష్ర్టానికే  ఆదర్శంగా నిలుస్తున్నది. 

మర్కూక్‌ మండలంలోని సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో 2016లో  ప్రభుత్వ నిధులతో కార్పొరేట్‌ స్థాయిలో కల్యాణ మండపాన్ని అందంగా నిర్మించారు. స్వయంగా సీఎం కేసీఆర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన చేతుల మీదుగానే దీనిని ప్రారంభించారు. కల్యాణ మండపం ఏర్పాటుతో గ్రామంలో పేదల పెళ్లీళ్లకు తిప్పలు తీరాయి. ఎలాంటి అద్దె లేకుండా కేవలం నామమాత్రపు నిర్వహణ ఖర్చులు చెల్లించి ఈ మండపంలో వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ప్రైవేట్‌ కల్యాణ మండపాలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో మోడల్‌గా నిర్మించిన కల్యాణ మండపం నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచింది. ఇదే మాదిరిగా రాష్ట్రంలో అనేక చోట్ల కల్యాణ మండపాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  

ఏడాదికి వంద వివాహాలు 

ఎర్రవల్లి కల్యాణ మండపంలో ఏటా వందల పెళ్లీలు జరుగుతున్నాయి. పేదల నుంచి పెద్దల వరకు అందరూ ఇందులో వివాహాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో కల్యాణ మండపాన్ని బుక్‌ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఏడాదికి సుమారుగా వందకు పైగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. వచ్చిన నిర్వహణ ఖర్చులు కల్యాణ మండపం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. మండల ప్రజలే కాకుండా యాదాద్రి, నల్గొండ, వరంగల్‌, జనగాం, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన పెళ్లిళ్లు ఎర్రవల్లి కల్యాణ మండపంలో నిర్వహించేందుకు వస్తున్నారు. 

పేదోళ్లకు ఎంతో నయం 

ఎర్రవల్లి కల్యాణ మండపం ఏర్పాటుతో మాలాంటి పేదోళ్లకు చాలా మేలు జరుగుతున్నది. ఒకప్పుడు కల్యాణ మండపంలో పెళ్లి చేయాలంటే ఖర్చుకు భయపడేవాళ్లం. ఎర్రవల్లి కల్యాణ మండపంలో కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించి శుభకార్యాలు చేసుకుంటున్నాం. ఇంత తక్కువ ఖర్చు ఎక్కడా ఉండదు. సీఎం కేసీఆర్‌ సారు కల్యాణ మండపం కట్టించి మంచి పనిచేశారు. మొన్న నాబిడ్డ పెళ్లి ఎర్రవల్లి కల్యాణ మండపంలోనే చేసిన. 

-మంద నర్సింహులు, పాతూరు 


VIDEOS

logo