సోమవారం 01 మార్చి 2021
Siddipet - Feb 18, 2021 , 02:41:29

ముగిసిన క్రికెట్‌ పండుగ

ముగిసిన క్రికెట్‌ పండుగ

  • కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నీ ముగింపు
  • క్రికెట్‌ ఆడి ఉత్సాహ పర్చిన మంత్రిహరీశ్‌రావు, అజారుద్దీన్‌
  • జట్లకు బహుతుల ప్రదానం

సిద్దిపేట కలెక్టరేట్‌, ఫిబ్రవరి 17  : సీఎం కేసీఆర్‌ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించారు. క్రికెట్‌ పరిభాషలో చెప్పాలంటే 14 ఏండ్ల పాటు ప్రత్యర్థులు బౌన్సర్లు వేసినా, ఎన్ని విధాలా ఔట్‌ చేయాలని చూసినా నిలబడి ఆమరణ నిరాహార దీక్ష అనే విన్నింగ్‌ షాట్‌తో తెలంగాణను సాధించారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్‌ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన క్రికెట్‌ కప్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌లతో కలిసి  తిలకించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, అజారుద్దీన్‌లు బ్యాటింగ్‌ బౌలింగ్‌ చేసి ప్రేక్షకులను అలరించారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు.  ఫైనల్‌ మ్యాచ్‌ అద్భుతంగా జరిగింది. 20 వేల మంది ప్రేక్షకులు హాజరు కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. మీరంతా నిజజీవితంలో ఆల్‌రౌండర్లుగా ఎదిగి తల్లిదండ్రులకు, సిద్దిపేటకు పేరు తీసుకువచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.  రాష్ట్ర, జాతీయ స్థాయిలో సిద్దిపేట క్రీడాకారులు ఆడేలా వారిని తయారు చేస్తామన్నారు. సిద్దిపేటలో హెచ్‌సీఏ తరపున లీగ్‌ మ్యాచ్‌లు ఆడేలా ప్రయత్నిస్తామని అజారుద్దీన్‌ తెలిపారు.  ఫైనల్‌ మ్యాచ్‌ లో గెలుపొందిన ఎంసీసీ జట్టుకు  లక్ష రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందించారు. రన్నర్‌గా నిలిచిన ఇండియన్‌ లెవన్‌ జట్టుకు రన్నరప్‌ బహుమతి రూ.50 వేలతో పాటు ట్రోఫీని అందజేశారు. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ ఆటగాళ్లకు మెమోంటోలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో పాటు హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు జగన్‌మోహన్‌, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, కౌన్సిలర్లు, ఆర్గనైజర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, మల్లికార్జున్‌తో పాటు అక్బర్‌నవాబ్‌, జమ్ము, రామ్‌, మాజిద్‌, విజయ్‌  పాల్గొన్నారు. 

VIDEOS

logo