శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Feb 14, 2021 , 01:04:26

రసూలాబాద్‌ రంది తీరింది..!

రసూలాబాద్‌ రంది తీరింది..!

పల్లె ప్రగతితో రూపు మారింది..

కొత్త పంచాయతీతో కొంగొత్త అభివృద్ధి

డంపింగ్‌ యార్డులో ఎరువుల తయారీ

సమస్యల పరిష్కారానికి 30ఇండ్లకు ఒక కమిటీ

ఇంటింటికీ ఇంకుడు గుంతలు

పల్లె ప్రగతితో రసూలాబాద్‌ రందీ తీరింది. కొత్త పంచాయతీగా ఏర్పడి, అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రణాళికాబద్ధంగా పాలకవర్గం సాగుతుండగా, సమస్యల పరిష్కారానికి 30 ఇండ్లకు ఒక కమిటీ వేసుకుంది. సీసీ రోడ్లు.. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ.. ఇంటింటికీ ఇంకుడు గుంతలు.. డంపింగ్‌ యార్డులో ఎరువుల తయారీ.. వైకుంఠధామాలు.. నర్సరీ.. సకల సౌకర్యాలతో గ్రామం కొత్త పుంతలు తొక్కుతున్నది. పరిశుభ్ర వీధులతో పల్లె స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుకుంటున్నది.

- కొమురవెల్లి, ఫిబ్రవరి 13 

పల్లె ప్రగతితో ‘రసూలాబాద్‌' రంది తీరింది. కొత్త పంచాయతీగా ఏర్పడి, అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ప్రణాళికాబద్ధంగా పాలకవర్గం ఉద్యమంలా పనిచేస్తున్నది. గ్రామ సర్పంచ్‌ స్వామిగౌడ్‌ ఆధ్వర్యంలో అందరూ ఏకమై గ్రామంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నారు. సీసీరోడ్లు.. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ.. ఇంటింటికీ ఇంకుడు గుంతలు.. డంపింగ్‌ యార్డులో ఎరువుల తయారీ.. వైకుంఠధామాలు.. నర్సరీతో పాటు సౌకల సౌకర్యాలతో ఇప్పుడు గ్రామం అందంగా ముస్తాబైంది. ఎటు చూసినా రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. 

- కొమురవెల్లి, ఫిబ్రవరి 13 

30 రోజుల ప్రణాళికలో భాగంగా..

30 రోజుల ప్రణాళికలో భాగంగా 2019 సెప్టెంబర్‌ 6న రసూలాబాద్‌ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేసి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. ఆ మరుసటి రోజు కో- ఆప్షన్‌ సభ్యుల ఎంపికతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ, స్వచ్ఛ కమిటీ, హరితకమిటీతో పాటు పలు కమిటీలను ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఉన్న సమస్యలపై జల్లెడ పట్టారు. పలు సమస్యలను గుర్తించిన ఆ కమిటీల సభ్యులు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని సమస్యలన్నీ  పరిష్కరించుకున్నారు. అదే స్ఫూర్తిలో నేటికి పల్లెప్రగతి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

మట్టిరోడ్లకు సీసీ సొబగులు..

పల్లెప్రగతి పనుల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు 

చేసిన మట్టి రోడ్లను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవతో సీసీ రోడ్లుగా మారడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు చేపట్టారు. 

స్వచ్ఛ గ్రామంగా రసూలాబాద్‌..

పల్లెపగ్రతి పనులను నిరాంతరయంగా కొనసాగేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాలీతో కూడిన ట్రాక్టర్‌, ట్యాంకర్‌ను అందజేయడంతో పారిశుధ్య కార్మికులు ప్రతి రోజు ఉదయం అన్ని వీధుల గుండా తిరుగుతూ ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వురుగా సేకరిస్తున్నారు. అలా సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించి, ఆ చెత్తను కంపోస్ట్‌ ఎరువుగా మారుస్తున్నారు. దీంతో వీధుల్లో చెత్త ఎక్కడ లేకుండా స్వచ్ఛ గ్రామంగా రూపుదిద్దుకుంది.

గ్రామంలో జిగేల్‌ వెలుగులు..

ఉమ్మడి పాలనలో గ్రామంలో గాలి దుమారం వచ్చినా.. వర్షం కురిసినా ఇట్టే కరెంట్‌ పోయేది. దీంతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడేవారు. కానీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికాంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా పవర్‌వీక్‌ కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న విద్యుత్‌ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించారు. నాడు అందకారంలో ఉన్న గ్రామం నేడు ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో గ్రామంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లతో రసూలాబాద్‌ జిగేల్‌ మంటున్నది. 

నర్సరీతో  పాటు వైకుంఠధామ నిర్మాణం..

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పల్లెప్రగతి పనుల్లో  ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సరీతో పాటు వైకుంఠధామానికి స్థలం గుర్తించడంతో పాటు వెంటనే నిర్మాణ పనులు చేపట్టారు.  గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయడంతో పాటు అందులో అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. పట్టణాల్లో ఏ విధంగా పార్కు ఉంటుందో అదే విధంగా గ్రామంలో పల్లెపకృతి వనాన్ని అందంగా.. ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు వైకుఠధామాన్ని కూడా అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. మరణించిన వ్యక్తిని పాడెపై మోసుకుంటూ ముక్తిధామంలో కాలు పెట్టిన దగ్గర నుంచి కాడెత్తే వరకు కావాల్సిన అన్ని సౌకర్యాలతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. వైకుంఠధామం పరిసరాల్లో ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలను పెంచుతున్నారు.

గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు..

రసూలాబాద్‌ అభివృద్ధిలో భాగంగా .10లక్షలతో సీసీరోడ్లు, .12 లక్షల 60 వేలతో వెకుంఠధామం, .2లక్షల 50వేలతో డంపింగ్‌ యార్డు,  .3లక్షలతో పల్లె పకృతి వనం, .2లక్షలతో పాలశాలలో వంటగది, .2లక్షలతో పాఠశాలలో టాయిలెట్స్‌, ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అదేవిధంగా గ్రామాభివృద్ధికి ప్రతి నెల .84వేల నిధులు గ్రామపంచాయతీకి ప్రభుత్వం విడుదల చేస్తుంది. 

గ్రామ వివరాలు..

నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రసూలాబాద్‌ గ్రామ పంచాయతీలో  మొత్తం జనాభా 736 మంది.. ఇందులో 372 మంది మహిళలు, 364 మంది పురుషులు. ఓటర్లు 423 కాగా, అందులో మహిళలు 214, పురుషులు 209 ఉన్నారు. 

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు..

ప్రభుత్వం పల్లెల పరిశుభ్రతే లక్ష్యంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు గ్రామస్తుల సహకారంతో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అధికారుల సూచనలతో ఇప్పటికే గ్రామాన్ని చాలా వరకు బాగు చేసుకున్నాం. నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన మా గ్రామాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటున్నాం.     

      - సర్పంచ్‌ పచ్చిమండ్ల స్వామిగౌడ్‌

VIDEOS

logo