శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 13, 2021 , 00:15:42

సభ్యత్వ సందడి

సభ్యత్వ సందడి

టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు షురూ... 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సన్నాహక సమావేశాలు

కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

నేడు సిద్దిపేట తెలంగాణ భవన్‌లో, రేపు  మెదక్‌లో సమావేశం

ప్రతి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు లక్ష్యం

65శాతం సాధారణ, 35శాతం క్రియాశీల సభ్యత్వాలు

గతేడాది టార్గెట్‌ అధిగమించేలా ప్రణాళిక

నెలాఖరుకు సభ్యత్వాల నమోదు పూర్తిచేసే లక్ష్యం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు సందడి నెలకొంది. నెలాఖరు వరకు పార్టీ సభ్యత నమోదు పూర్తిచేసి, మార్చిలో  గ్రామ, మండల, మున్సిపల్‌, జిల్లా  కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వాల నమోదులో భాగస్వాములు కానున్నారు. అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నేడు సిద్దిపేటలో, రేపు మెదక్‌లో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. సభ్యత్వాలు తీసుకున్న వారికి రూ.2లక్షల చొప్పున ప్రమాద బీమా సైతం చేయిస్తున్నారు. దీంతో క్యాడర్‌కు బీమా ధీమా ఏర్పడనున్నది.  

-సిద్దిపేట, ఫిబ్రవరి12 

(నమస్తే తెలంగాణ ప్రతినిధి)  

సిద్దిపేట, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో సభ్యత్వాల నమోదు సందడి నెలకొంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు షురూ అయ్యింది. నెలాఖరు వరకు పార్టీ సభ్యత్వాల నమోదు పూర్తి చేసి, వచ్చేనెల గ్రామ, మండల, మున్సిపల్‌, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్దేశించుకుంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాల నమోదుకు పార్టీ యంత్రాంగం సిద్ధ్దమైంది. రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సభ్యత్వాల నమోదును పెద్దఎత్తున చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఉద్యమాల పురిటిగడ్డ మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీని మరింతగా బలోపేతం చేసే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసింది. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ఉమ్మడి మెదక్‌ జిల్లాను నంబర్‌వన్‌ స్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇన్‌చార్జిల నియామకం...

పార్టీ సభ్యత్వాల నమోదును పరిశీలించడంతో పాటు జిల్లా నాయకులను సమన్వయం చేయడానికి టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ ఇన్‌చార్జిలను నియమించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌చార్జిగా శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జిల్లాకు రాష్ట్ర పార్టీ నాయకుడు బక్కి వెంకటయ్య, మెదక్‌ జిల్లాకు రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణశర్మ, సిద్దిపేట జిల్లాకు ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ను నియమించారు. వీరంతా ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ సభ్యత్వాల నమోదు ప్రక్రియను పరిశీలించడంతో పాటు గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తిచేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 50వేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలతోపాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మూడు మండలాలు, ఒక మున్సిపాలిటీ, జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీ, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తాయి. గతంలో కన్నా అధిక మొత్తంలో పార్టీ సభ్యత్వాలను చేయించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సంగారెడ్డి జిల్లా కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పాల్గొని దిశానిర్దేశం చేశారు. 

నేడు సిద్దిపేలో, రేపు మెదక్‌లో... 

టీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం(నేడు) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జడ్పీ చైర్‌పర్సన్‌, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. మంత్రి హరీశ్‌రావు సభ్యత్వాల నమోదు ప్రక్రియపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి గతేడాదికి మించి సభ్యత్వాలు చేయించి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేదిశగా కృషిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 65శాతం సాధారణ, 35శాతం క్రియాశీల సభ్యత్వాలు చేయనున్నారు. సాధారణ సభ్యత్వానికి రుసుం రూ.30, క్రియాశీల సభ్యత్వాలకు రుసుం రూ.100, (ఎస్టీ, ఎస్సీలకు రూ.50)గా నిర్ణయించారు. రెండేండ్ల కిందట చేసిన సభ్యత్వాల్లో సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌ నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. సిద్దిపేట నియోజకవర్గంలో అరవై ఐదు వేల సభ్యత్వాలు చేశారు. ఈసారి తమ రికార్డులను తామే అధిగమించేలా  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  సభ్యత్వాలు తీసుకున్న వారికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా సైతం చేయిస్తున్నారు. దీంతో క్యాడర్‌కు బీమా ధీమా ఏర్పడనుంది.

VIDEOS

logo