ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Feb 12, 2021 , 00:52:08

భక్తజనం ప్రణామం

భక్తజనం ప్రణామం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జాతరల సందడి

సింగరాయ జాతరకు లక్షన్నరకు పైగా భక్తుల హాజరు

స్వామిని దర్శించుకున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌

పూల్లూరు ఆలయానికి పోటెత్తిన భక్తులు

పులకించిన పాలమాకుల దత్తాత్రేయస్వామి క్షేత్రం

కిక్కిరిసిన కూడవెల్లి రామలింగేశ్వరాలయం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గురువారం జరిగిన మాఘ మాస జాతరలు జనసంద్రంగా మారాయి. జాతర ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిశాయి. కోహెడ మండలం కూరెల్ల ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనర్సింహస్వామి జాతరకు లక్షన్నరకు పైగా భక్తులు వచ్చారు. స్వామివారిని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా  దర్శించకున్నారు. దుబ్బాక మండలం కూడవెల్లి రామలింగేశ్వరాలయం ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. పూల్లూరు లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రెండో రోజూ భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదిలో ఒక రోజు మాత్రమే తెరిచి, జాతర నిర్వహించి మూసివేసే పాలమాకుల దత్తాత్రేయస్వామి ఆలయం జన సందడిగా మారింది. ఆయా జాతరలు ప్రకృతి అందాల మధ్య జరుగగా, భక్తజనం పరవశించిపోయింది.

- దుబ్బాక/నంగునూరు/సిద్దిపేట అర్బన్‌/కోహెడ, ఫిబ్రవరి 11:

వనదుర్గ.. వందనం

పాపన్నపేట, ఫిబ్రవరి 11 : మాఘ స్నానాలతో ఏడుపాయల పులకరించింది. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులతో పాటు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి  అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, న్యాల్‌కల్‌ మండలం రాఘవపూర్‌లోని పంచవటీ సరస్వతీ క్షేత్రం పరిధిలోని మంజీర నదిలో భక్తులు దీపాలు వదిలారు. గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కోహెడ, ఫిబ్రవరి 11: 

కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి గాంచిన ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీనర్సింహస్వామి జాతర గురువారం భక్తజనసంద్రమైంది. కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారులోని సింగరాయ లొద్దిలో ఉన్న సింగారయ గుట్టల్లో వెలసిన స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 5గంటల నుంచే భక్తులు జాతరకు రావడం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మాఘమ పుష్యమి బహుళ అమావాస్య రోజున  ఒక్కరోజు జరిగే ఈ జాతర  భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతోస్వామివారిని దర్శించుకుంటారు. జాతర స్థలంలో తూర్పు నుంచి పడమరకు ప్రవహించే మోయతుమ్మెద వాగులో స్నానాలు చేసి, గుట్టపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం సమయంలో భక్తులు తాకిడి అధికవడంతో దర్శనం కోసం బారులు తీరారు. జాతర ప్రాంతం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు చెట్లకింద వంటలు చేసుకున్నారు. సుందర ప్రకృతి దృశ్యాల మధ్య సకుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేసి సేద తీరారు. సాయంత్రమైతే స్వామివారికి తలనొప్పి వస్తుందని భక్తులు సంధ్యా సమయానికి ముందే ఇండ్ల దారి పట్టారు.

స్వామివారిని దర్శించుకున్న 

పర్యాటక శాఖ చైర్మన్‌

లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీపీ కొక్కుల కీర్తి స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిని గ్రామ సర్పంచ్‌ గాజుల రమేశ్‌, అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలతో స్వామివారి దర్శనం కల్పించారు. జాతరకు మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్‌, సామాజిక సేవకులు కర్ణకంటి మంజుళారెడ్డి, వలుస సుభాష్‌ హాజరయ్యారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, సీఐ రఘుపతిరెడ్డి, కోహెడ ఎస్సై నాంపల్లి రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ఎస్సైలు 70 మంది సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

 వైభవంగా పుల్లూరు జాతర

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 11 : మాఘ అమావాస్యను పురస్కరించుకుని సిద్దిపేట రూరల్‌ మండలం పూల్లూరు లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఆవరణలోని కోనేరులో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఐదు రోజుల జాతరలో భాగంగా నేడు రెండో రోజున స్వామివారికి అర్చన, అభిషేకంతో పాటు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, ఆవాహిత దేవతాహవనం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ దంపతులు స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.

సలెంద్రి రామలింగేశ్వర ఆలయంలో..

చిన్నకోడూరు, ఫిబ్రవరి 11 : చిన్నకోడూరు మండలం మెట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సలెంద్రి రామలింగేశ్వర ఆలయంలో గురువారం మాఘ అమావాస్య పురస్కరించుకొని భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, దేవస్థాన కమిటీ చైర్మన్‌ పానుగంటి నర్సింహాచారి, సర్పంచ్‌ విజయ వినయ్‌రెడ్డి, ఎంపీటీసీ పానుగంటి శారధారమేశ్‌, దేవాలయ అర్చకులు సంగీత్‌ కుమార్‌శర్మ పూజల్లో పాల్గొన్నారు.

జనసంద్రం.. కూడవెల్లి క్షేత్రం

జాతరకు పోటెత్తిన భక్తజనం

దుబ్బాక, ఫిబ్రవరి11 : మాఘ అమవాస్య సందర్భంగా కూడవెళ్లి రామలింగేశ్వరాలయం భక్తసంద్రంగా మారింది. పల్లె.. పట్నం తేడా లేకుండా భక్తజనం కూడవెల్లికి తరలివచ్చింది. గురువారం వేకువజాము నుంచే రామలింగేశ్వరాలయం పక్కనే ఉన్న త్రివేణి సంగమం(కుడవెల్లివాగు)లో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆనంతరం స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా నుంచే కాకుండా కామారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ధర్మ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి ఆలయం వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పోలీసు, దేవాదాయశాఖ అధికారులు దైవ దర్శనానికి మరిన్ని వరుసలు ఏ ర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు, తాగునీటి వసతులతో పాటు ఆరోగ్యకేంద్రం, పోలీసు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాగులో నీరు ఎక్కువగా ఉండడంతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి పోలీసులు నిఘా పెట్టారు. ఆలయం వద్ద మరో ఐదు రోజులు జాతర కొనసాగనుండగా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి రోజు సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు దేవాల య ఈవో విశ్వన్నాథశర్మ తెలిపారు. దుబ్బాక సీఐ హరికృష్ణగౌడ్‌ నేతృత్వంలో దుబ్బాక, భూం పల్లి ఎస్‌ఐలు స్వామి, జమాల్‌ పర్యవేక్షిస్తున్నారు.

పులకించిన పాలమాకుల

ఘనంగా దత్తాత్రేయస్వామి జాతర

నంగునూరు, ఫిబ్రవరి 11 : నంగునూరు మండలం పాలమాకులలో వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయజాతర గురువారం ఘనంగా జరిగింది. గ్రామస్తులతో పాటు చుట్ట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ధర్మకర్తలు చీకోటి దత్తయ్యగుప్తా వంశస్తులు ఉదయం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి నైవేద్యం సమర్పించి ఉత్సవాలు ప్రారంభించారు. ఏడాదిలో ఒక రోజు మాత్రమే ఆలయాన్ని తెరిచి జాతర నిర్వహించి సాయంత్రం ఆలయం మూసివేయడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర గుండంగా పిలిచే పవిత్ర గుండంలో స్నానాలు చేసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజగోపాల్‌పేట సరిహద్దులో ఉన్న గుబ్బడిగుట్ట ఎక్కి యువకులు ప్రకృతి అందాలను వీక్షించి పరవశించిపోయారు.

మండల పూజ మహోత్సవం
చేర్యాల టౌన్‌, ఫిబ్రవరి 11 : పట్టణంలోని సద్గురు సదనంలోని ఆదిశంకర దర్బార్‌లో గురువారం భక్తిశ్రద్ధలతో మండల పూజ, గురుదత్తాత్రేయ సేవా పరిషత్‌ 6వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దర్బార్‌లో పురోహితులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, మూలమూర్తికి పూర్ణాభిషేకం, పుష్పార్చన,పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ఏర్పాట్లను ఆదిశంకర దేవాలయం, సద్గురు సదనం నిర్వాహుకులు చేశారు.

VIDEOS

logo