ఆకట్టుకునేలా అక్కారం..

పల్లె ప్రగతితో మారిన గ్రామస్వరూపం
ఒకే ప్రాంగణంలో రైతువేదిక, ప్రకృతివనం
డంపింగ్‌యార్డులో సేంద్రియ ఎరువు తయారీ
ఊరి ప్రవేశ దారిలో రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు.. కాలికి బురద అంటకుండా అన్ని వీధుల్లో సీసీ రోడ్లు.. పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు.. సీసీ కెమెరాలు.. రైతు వేదిక, ఫంక్షన్‌హాల్, పల్లె ప్రకృతి వనం.. ఎటు చూసినా పచ్చదనం.. సిటిజన్ భవనం.. అంగన్వాడీ కేంద్రం.. ఊళ్లోకి కొత్తగా వచ్చే వారిని మైమరిపించేలా చేస్తున్నది గజ్వేల్ రూరల్ మండలం అక్కారం గ్రామం..
- గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 9
గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 9 :
రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలతో ఆ పల్లె స్వాగతం పలుతున్నది. రైతువేదిక, ఫంక్షన్‌హాల్, పక్కనే అందమైన మొక్కలతో కనిపించే పల్లెప్రకృతి వనం, దాని పక్కనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పేదల కోసం నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లు, అక్కడే సిటిజన్ భవనం, అంగన్వాడీ భవనం, ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి చిరునామాలా మారింది. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే అక్కడ కనిపించే వాతావరణంలో మురిసిపోతారు. ఒకే చోట ఇలా ఎక్కడ కనిపించని గ్రామాభివృద్ధి ఫలాలు గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో కనిపిస్తాయి.
అభివృద్ధిలో ఆదర్శం..
గజ్వేల్ మండలం అక్కారం గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లెప్రగతితో గ్రామస్వరూపం మారిపోయింది. గ్రామంలో 456 ఇండ్లుండగా, 1860 జనాభా ఉంది. అందులో మహిళలు 932, పురషులు 928 మంది ఉన్నారు. గ్రామంలో 1260 మంది పురుష, మహిళ రైతులున్నారు. గ్రామంలో జరిగే సమావేశాలు తెలియజేసేందుకు రూ.2.90 లక్షలతో 24 మైకులను ఏర్పాటు చేసి విద్యుత్ స్తంభాలకు అమర్చారు. ప్రతినెలా పంచాయతీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఎడాదిన్నర క్రితం ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతిలో గ్రామంలోని విధులను శుభ్రం చేయడం, పాత ఇండ్లను పూడ్చివేయడం, విధులకు ఇరువైపుల మొక్కలు నాటారు. మొక్కలను రక్షించుకునేందుకు ట్రాక్టర్, నీళ్ల ట్యాంకర్, వర్షకాలంలో గ్రామస్తులకు అవసరమైన మొక్కల పంపిణీ కోసం నర్సరీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇంటింటికి రెండు చెత్తబుట్టలను పంపిణీ చేసిన పంచాయతీ పాలకవర్గం ప్రతి రోజు ట్రాక్టర్, చెత్త బండి ద్వారా తడి, పొడి చెత్త సేకరణ చేపడుతున్నారు. తడి చెత్తతో డంపింగ్‌యార్డులో సేంద్రియ ఎరువు తయారీ చేసి దానిని గ్రామంలో నాటిన మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. వేసవి రాకముందే రోజు మొక్కలకు నీళ్లను ట్యాంకర్ ద్వారా పడుతున్నారు.
ఆహ్లాదకర వాతావరణం..
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం పచ్చని మొక్కలతో కనువిందు చేస్తున్నది. పార్కులో సిటిజన్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బల్లలు, గజ్బౌల్లు, వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం వ్యాయమ పరికరాలు, మొక్కలు నీళ్లు పట్టేందుకు బోరు వేశారు. పార్కు చుట్టూ ఇనుప తీగతో కంచెను ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం సమయంలో గ్రామస్తులు అందులోకి వచ్చి సేదా తీరుతున్నారు. గ్రామంలో వేలాది మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేసుకున్నారు. వైకుంఠధామం అందుబాటులోకి తీసుకరావడంతో ఎంతగానో ఉపయోగపడుతున్నది. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది గ్రామంలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు వేశారు. అక్కారం అభివృద్ధిలో మందు వరుసలో ఉండడంతో వ్యాపారపరంగా మరింతగా అభివృద్ధి చెందుతున్నది.
గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు..
రూ.22లక్షలతో రైతువేదిక భవనం
రూ.16లక్షలతో వైకుంఠధామం
2.50లక్షలతో డంపింగ్‌యార్డు
రూ.3లక్షలతో పల్లెప్రకృతివనం
రూ.30లక్షలతో ఫంక్షన్‌హాల్
రూ.10లక్షలతో లైబ్రరీ
రూ.12లక్షలతో మహిళా భవనం
రూ.8లక్షలతో సిటిజన్ భవనం
రూ.10లక్షలతో అంగన్వాడీ భవనం
25 డబుల్‌బెడ్ రూం ఇండ్లు
రూ. 2.90లక్షలతో 24మైకులు
ఎడాది కాలంలో రూ.20లక్షలతో సీసీ రోడ్డు, మురుగుకాల్వల నిర్మాణం
అందరి సహకారంతో గ్రామాభివృద్ధి
అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం. అభివృద్ధికి సర్కారు అధిక ప్రాధాన్యమిస్తుండడంతో అక్కారంలో అభివృద్ధి కనిపిస్తున్నది. ఒకే చోట ప్రభుత్వ భవనాలు కనిపించేలా భవనాలు నిర్మించుకున్నాం. రాబోయే రోజుల్లో మంత్రి హరీశ్‌రావు సహాకారంతో గ్రామాన్ని జిల్లాలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతా.
- గునిశేట్టి బాలచంద్రం, సర్పంచ్, అక్కారం
నిరంతర పర్యవేక్షణ
అధికారుల సూచనలతో నిరంతరం గ్రామాన్ని పర్యవేక్షిస్తున్న. గ్రామంలో పల్లెప్రకృతి వనం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఉపయోగకరంగా మారింది. ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్త సేకరణ చేపడుతున్నాం. మొక్కలకు సేంద్రియ ఎరువును వినియోగిస్తున్నాం.
- మిస్కిన్, గ్రామ కార్యదర్శి
తాజావార్తలు
- ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు ఏంచేశారు?
- ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు ఉంటయా?
- రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు
- లెక్కతప్పని తేలిస్తే ముక్కు నేలకురాస్తా
- నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం
- తాప్సీ ఇంటిలో ఐటీ సోదాలు
- ప్రభుత్వం.. ఉద్యోగులది పేగుబంధం
- రాజకీయాలకు శశికళ గుడ్‌బై
- సేవ చేస్తే శిక్ష రద్దు
- టీటా రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ వనం