శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 10, 2021 , 00:24:31

జాతరెల్లిపోదాం..

జాతరెల్లిపోదాం..

నేటి నుంచి మాఘ మాస జాతరలు

కూడవెల్లి రామలింగేశ్వరాలయంలో వారం రోజుల పాటు ఉత్సవాలు

పుల్లూరు బండ లక్ష్మీనరసింహ క్షేత్రంలో ఐదు రోజులు

హాజరు కానున్నమంత్రి హరీశ్‌రావు

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు, నిర్వాహకులు

విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్న ఆలయాలు

మాఘ అమావాస్య జాతరలకు జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. నేటి నుంచి కూడవెల్లి రామలింగేశ్వరాలయం, పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీనరసింహ క్షేత్రం, మిరుదొడ్డి మండలం అల్వాల కోదండ రామస్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగనున్నాయి. గలగల పారేటి కూడవెల్లివాగు ఒడ్డున సుందరమైన రామలింగేశ్వరుడి దేవాలయంతో పాటు మరిన్ని దేవాలయాలున్నాయి. ఓ పక్క పచ్చని పంటలు.. మరో పక్క వాగు ప్రవాహం.. మనసుదోచే ఆహ్లాదకర వాతావరణంలో వారం రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. పుల్లూరు బండలో ఐదు రోజుల పాటు జాతర జరుగనుండగా, మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఆయా దేవాలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానుండగా, అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

- దుబ్బాక/సిద్దిపేట అర్బన్‌/మిరుదొడ్డి, ఫిబ్రవరి 9 

కొంగుబంగారం కూడవెల్లి

దుబ్బాక, ఫిబ్రవరి 9 : 

భక్తుల కొంగుబంగారం.. దక్షణ కాశీగా పేరొందిన దుబ్బాక మండలం కూడవెల్లి రామలింగేశ్వరాలయం జాతరకు ముస్తాబైంది. గలగల పారేటి కూడవెల్లి వాగు ఒడ్డున నేటి నుంచి ఇక్కడ వారం రోజుల పాటు జాతర కొనసాగనున్నది. దీనికి భక్తుల సౌకార్యర్థం కోసం దేవాలయ పాలకవర్గం, అధికారగణం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు సిద్దిపేట జిల్లా ప్రజలే కాకుండా పక్క జిల్లాలైన కామారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌, హైదరాబాద్‌ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం కోసం ఆలయాధికారులు బస, తదితర వసతులు కల్పించారు. ఇక్కడ రామలింగేశ్వరాలయంతో పాటు రాధారుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, పార్వతీ సంగమేశ్వర, వెంకటేశ్వర స్వామి దేవాలయం, కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయం, వీరభద్రుడి దేవాలయం, గణపతి, హనుమాన్‌, బొబ్బిలి వీరన్న దేవాలయాలున్నాయి.  

జాతరకు అంతా సిద్ధం..

మాఘా అమావాస్య రోజున కూడవెళ్లి వాగులో స్నానాలు చేసే భక్తుల కోసం ఘట్టాలు ఏర్పాటు చేశారు. రామలింగేశ్వరాలయంతో పాటు పక్కనే ఉన్నా వేణగోపాలస్వామి , ఇతర దేవాలయాలను రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు, ప్రత్యేక దర్శన లైన్లను కొవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా రంగుల రాట్నం, జంతు ప్రదర్శనలు, సర్కస్‌, హోటళ్లు, తదితర దుకాణాలు వెలిశాయి.

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు..

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని ఆలయ ఈవో విశ్వన్నాథశర్మ అన్నారు. ప్రకృతి ఒడిలో వెలిసిన రామలింగేశ్వర స్వామిని పుష్య బహుళ అమవాస్య రోజున దర్శించుకుంటే కష్టాలు తొలిగి సుఖసంతోషాలు కలుగుతాయని ఆలయ అర్చకులు సంకేతశర్మ అన్నారు.

ప్రత్యేక పూజలు ఇలా..

మాఘ అమవాస్య సందర్భంగా రామలింగేశ్వరాలయంలో వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి.. బుధవారం గణపతి పూజ, పుణ్యహవాచనం, సంప్రోక్షణ శ్రీ రామలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం,ఉత్సవ మూర్తులకు స్నపనం, స్వామివారికి పుష్పలంకరణ, మహదాశీర్వచనం, సాయంకాలం స్వామివారి పల్లకి సేవోత్సవం ఉంటుం ది. గురువారం ప్రాతఃకాలన స్వామివారికి విశేష అభిషేకం, భక్తులకు సర్వదర్శనం, పల్లకి సేవజాతరలో ఊరేగింపు నిర్వహిస్తారు. శుక్రవారం మహన్యాస పూర్వ రుద్రాభిషేకం, సర్వ దర్శన కార్యక్రమం ఉంటుంది. శని,ఆది,సోమ వారాల్లో అభిషేకాలు, విశేష అర్చనలు, సర్వ దర్శనాలు జరుగుతాయి.

పుల్లూరు జాతర పిలుస్తోంది

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 9 : సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరు గ్రామంలో స్వయంభూ లక్ష్మీనరసింహ క్షేత్రం జాతరకు సిద్ధమైంది. మాఘ అమావాస్య సందర్భంగా ఐదు రోజులు పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. నేటితో ప్రారంభం కానున్న జాతర ఈ నెల 14 వరకు కొనసాగ నున్నది. మంత్రి హరీశ్‌రావు జాతరకు హాజరు కానున్నారు. 

ఆలయ విశిష్టత...

సిద్దిపేట జిల్లా కేంద్రానికి 12 కి.మీ దూరంలో సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరు గ్రామంలో ఈ ఆలయం ఉంది. సుమారు వెయ్యేండ్ల క్రితం కాకతీయుల పరిపాలనలో ఏకశిల బండపై స్వయంభూ మూర్తిగా వెలిసి లక్ష్మీ నరసింహ క్షేత్రంగా వెలిసింది. 13వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో కాకతీయుల కాలం నాటి లిపితో కూడిన శాసనములు ఉన్నాయి. ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామితో పాటు వేంకటేశ్వరస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్ఠించారు. ఇదే బండపై పార్వతీ పరమేశ్వర సహిత శివాలయంతో పాటు త్రికూటేశ్వర ఆలయం కూడా ఉంది. ఆలయానికి దక్షిణ వైపున పాలగుండం, నీళ్లగుండంగా పిలిచే రెండు కోనేర్లు ఉన్నాయి. 

జాతరకు ఏర్పాట్లు పూర్తి ..

ఐదు రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరు కానున్న భక్తుల కోసం గ్రామపంచాయితీ పాలకవర్గంతో పాటు ఆలయ నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి వసతితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా వైద్య సదుపాయం కూడా కల్పించారు. అంతే కాకుండా పార్కింగ్‌ కోసం గుట్ట కింది భాగంలో స్థలం ఏర్పాటు చేయడంతో పాటు క్యూలైన్‌లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.

అల్వాల కోదండ రామస్వామి ఆలయం ముస్తాబు

మిరుదొడ్డి, ఫిబ్రవరి 9 : మాఘ అమావాస్య సందర్భంగా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ శివారులో కూడవెళ్లి వాగులో వెలసిన కోదండ రామస్వామి ఆలయం జాతరకు సిద్ధమైంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ జాతరకు మిరుదొడ్డి మండల పరిధిలోని అందె, లింగుపల్లి, మల్లుపల్లి, చెప్యాల, లక్ష్మీనగర్‌, ఆరెపల్లి, ధర్మారం, తొగుట మండల పరిధిలోని కాన్గల్‌, లింగంపేట, జప్తి లింగారెడ్డిపల్లి, దౌల్తాబాద్‌ మండలం నుంచి దొమ్మాట, గాజులపల్లి గ్రామాల నుంచి భక్తులు వచ్చి కోదండ రాముడిని దర్శించుకొని, మొక్కులు చెల్లిస్తారు.

VIDEOS

logo