గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 09, 2021 , 00:07:28

వైద్యరంగంలో గుణాత్మక మార్పు

వైద్యరంగంలో గుణాత్మక మార్పు

పేదోళ్లకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి

డయాగ్నోస్టిక్‌ సెంటర్‌తో 57 రకాల పరీక్షలు

జడ్పీ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 8 :

 ప్రభుత్వ వైద్య రంగంలో ఒక గుణాత్మకమైన మార్పును తెచ్చి, పేదోళ్లకు ఉచిత వైద్యం అందించేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, వొడితెల సతీశ్‌కుమార్‌, రఘునందన్‌రావు, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపూరం శివకుమార్‌తో పాటు ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. సభ్యలు అడిగిన వివిధ ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. ముందుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్‌ జిల్లాలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పథకాల గురించి, పంటల సాగు గురించి వివరించారు. రైతుబీమా పథకంలో ఎదురువుతున్న కొన్ని సాంకేతిక సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌, డీఏవో శ్రవణ్‌ సమాధానం చెప్పారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పామాయిల్‌ సాగుతో రైతులకు కనీసం ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి లక్ష ఆదాయం రావడంతో పాటు చాలా రకాల లాభాలున్నాయన్నారు. సిద్దిపేటలోనే పామాయిల్‌ కర్మగారం ఏర్పాటు చేయబోతున్నామన్నారు.  ఆయా మండలాల్లో ఇప్పటికే ప్రారంభించుకున్న రైతువేదికల్లో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను రూ.2 కోట్ల 50 లక్షల వ్యయంతో సిద్దిపేటలోనే ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఎక్కడి నుంచైనా 57 రకాల టెస్టులు చేసే విధంగా ఆరు రూట్లలో ఆరు వ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఈసీజీ, ఎక్స్‌రే, టూడీ ఎకో, అల్ట్రా సౌండ్‌, గాంధీ, ఉస్మానియా తరహా సీటీ స్కాన్‌ మిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మిషన్‌ భగీరథ నీటితో రాష్ట్రంలో కమ్యూనికేబుల్‌ వ్యాధులు తగ్గిపోయాయన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన నాణ్యమైన ఎరువుల తక్కువ ధరకే సరఫరా చేసేందుకు, రైతుల పండించిన పంటకు నోడల్‌ ఏజెన్సీగా డీసీఎంస్‌ పని చేస్తుందన్నారు. 

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ..

పేద ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ అన్నారు. ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లి, అధిక డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేని పేదవారు ప్రభుత్వ దవాఖానలను వినియోగించుకునేలా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వచ్చే జడ్పీ సమావేశం రోజున ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు ఎల్‌వీ ప్రసాద్‌ కంటి దవాఖానలో పరీక్షలు చేయించుకొని, అక్కడి సౌకర్యాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేద్దామన్నారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ప్రారంభించుకున్న రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. రైతులకు పామాయిల్‌ పంటతో పాటు, పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న కాలువల నిర్మాణం పూర్తి చేసేందుకు కలెక్టర్‌, మంత్రి హరీశ్‌రావులు చొరవ చూపాలన్నారు. కొన్ని గ్రామాల్లో గొర్ల హాస్టళ్లను మంజూరు చేయాలని కోరగా, మంత్రి వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో అత్యాధునిక వైద్య పరికరాలు తెప్పించి, పేదవారికి వైద్య సహాయం చేయడం నిజంగా చాలా గొప్ప విషయమన్నారు. ప్రజాప్రతినిధులందరూ ఇలాంటి సౌకర్యాలు ఉన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

పలు అంశాలపై చర్చ.. 

సమావేశంలో వివిధ అంశాలపై చర్చ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ అంశంపై చర్చించగా, డీఎంహెచ్‌వో మనోహర్‌ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంతో పాటు ప్రభుత్వ వైద్య రంగంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై వివరించారు. పలు పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టును భర్తీ చేయాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తేగా, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. జిల్లాలో కొవిడ్‌ అనంతంర పాఠశాలలు ప్రారంభమయ్యాయని, అన్ని వసతులతో పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా నేటి వరకు ఒక్క కొవిడ్‌ కేసు కూడా లేదని డీఈవో తెలిపారు.

VIDEOS

logo