శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Feb 06, 2021 , 00:13:41

యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

 సీపీ జోయల్‌ డెవిస్‌ 

సిద్దిపేట టౌన్‌, ఫిబ్రవరి 5 :  అత్యవసర సమయంలో డయల్‌ 100ను మరువద్దని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. నేషనల్‌ యూత్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పోలీసు అంతర్గత ఫిర్యాదుల విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా జిల్లాలో 10 రోజుల పాటు 50 గ్రామాల్లో డయల్‌ యువర్‌ 100 అవగాహన కార్యక్రమం ముగింపు సభ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులు, గురువుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. మహిళల భద్రత, అత్యవసర సమయాల్లో పోకిరీలకు అడ్డుకట్ట, అనుమానాస్పదంగా తిరిగే వారు తారసపడినట్లయితే.. డయల్‌ యువర్‌ 100కు ఫోన్‌ చేసి సాయం పొందాలన్నారు. అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్‌ చేయాలని సూచించారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సై ఉద్యోగాల నియామకానికి భారీ ఎత్తున నోటిఫికేషన్‌ వేయనుందన్నారు. యువతీ యువకులందరూ ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని సూచించారు. త్వరలో  మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సహకారంతో ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు సీపీ జోయల్‌ డెవిస్‌ సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ హుస్సేన్‌, అయోధ్యరెడ్డి, ఎన్‌వైసీఐ స్టేట్‌ ప్రెసిడెంట్‌ నరేశ్‌, జిల్లా ప్రెసిడెంట్‌ చక్రవర్తి, అధ్యాపకులు పాల్గొన్నారు. 

ఆరోగ్య బీమా రక్షణ కవచం 

ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ అవసరమని కుటుంబానికి రక్షణ కవచంగా నిలుస్తోందని రేవిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రీజినల్‌ మేనేజర్‌ సురేశ్‌  అన్నారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో జిల్లాలోని హోంగార్డులు, అధికారులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై శుక్రవారం అవగాహన కల్పించారు.  అనంతరం అడిషనల్‌ డీసీపీ బాపురావు మాట్లాడుతూ హోంగార్డులు విధిగా ఆరోగ్యబీమా చేయించుకోవాలని సూచించారు. పోలీసు కమిషనర్‌ హోంగార్డుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పోలీసు వెబ్‌సైట్‌ సొసైటీ ద్వారా సిబ్బందికి సబ్సిడీపై రేషన్‌ సరుకులు అందజేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క హోంగార్డుకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌ చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ రియాజ్‌ ఉల్‌హక్‌, ఆర్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, ధరణి, శ్రీధర్‌రెడ్డి, షాకీర్‌, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo