గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

- ఆటోను ఢీకొట్టిన తూఫాన్ వాహనం
- ముగ్గురి దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- అతివేగమే ప్రమాదానికి కారణం
- మృతులంతా చాట్లపల్లివాసులు
- చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
- మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
జగదేవ్‌పూర్, ఫిబ్రవరి 4 : జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడం మూడు కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చింది. మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన భూమల్ల శ్రీశైలం, బరిగే రమేశ్, గడ్డం కనకయ్య గురువారం గ్రామం నుంచి పనుల కోసం ఆటోలో మండల కేంద్రానికి బయలు దేరారు. గ్రామం నుంచి బయలుదేరి గొల్లపల్లి వద్ద మరో ఇద్దరు మహిళలను ఎక్కించుకొని కొద్దిదూరం వెళ్లారు. తూఫాన్ వాహనం అతివేగంతో వచ్చి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చాట్లపల్లికి చెందిన రైతు శ్రీశైలం(28), ఆటో్రడ్రైవర్ రమేశ్ (30), కూలీ గడ్డం కనకయ్య(40) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
అతివేగంతో ఢీకొనడంతో చెల్ల్లాచెదురైన మృతదేహాలు
కామారెడ్డికి చెందిన తూఫాన్ వాహనం ప్యాసింజర్‌తో యాదాద్రికి వెళ్లి, కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్లే మార్గంలో గొల్లపల్లి వద్ద, డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వాహనం నుంచి రోడ్డుపై తలో చోట పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందారు. కనకయ్య మృతదేహాన్ని రోడ్డుపై పడేసి 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో కాళ్ల్లు, చేతులు విరిగి మృతిచెందాడు. ఈ ఘటనలో గొల్లపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఆదుకోవాలని బాధిత కుటుంబాల నిరసన
చాట్లపల్లి గ్రామానికి చెందిన మగ్గురు వ్యక్తులు మృతిచెందారనే విషయం తెలువగానే మృతుల కుటుంబ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ నరేశ్, ఎంపీటీసీ కావ్యదుర్గయ్య, గ్రామ యువకులు పెద్దఎత్తున ప్రమాద స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఆందోళన చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. గజ్వేల్ ఏసీపీ నారాయణ, ఎస్సైలు పరమేశ్వర్‌గౌడ్, సాయిరాం సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాలు దీనికి ఒప్పుకోలేదు. న్యాయం చేసే వరకు కదిలేదు లేదని భీష్మించుకొని కూర్చున్నారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలతో మాట్లాడారు. ప్రభుత్వం తరపున లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. తక్షణ సాయం కింద రూ.25 వేల ఆర్థిక సాయం అందించి, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా కల్పించారు. దీంతో వారు శాంతించి ఆందోళన వీడారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కొడుకా శ్రీశైలం ఆగం చేసి పోతివా
కొడుకా శ్రీశైలం పిల్లలను, నన్ను ఆగంచేసి పోతివా అంటూ అతని తల్లి, భార్య స్వప్న బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. అప్పటి వరకు తమతో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్న శ్రీశైలం, డ్రిప్ పైప్‌లు తెస్తానని చెప్పి వెళ్లి అరగంటలోనే ప్రమాదంలో మృతిచెందడం వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు శ్రీశైలానికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడు రమేశ్‌కు భార్య కవిత,ఇద్దరు కొడుకులు, కూతురు, మరో మృతుడు కనకయ్యకు భార్య రజిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.
తాజావార్తలు
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్