బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 03, 2021 , 00:05:23

పేదల ‘కాంతి’ కిరణం ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌

పేదల ‘కాంతి’ కిరణం ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌

కంటి సమస్యకు అందుబాటులో ఆధునిక వైద్యం 

మంత్రి హరీశ్‌రావు కృషితో  ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖాన సేవలు 

వేలాది మందికి తీరిన కంటి చూపు సమస్యలు 

గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ కేర్‌ సెంటర్ల ఏర్పాటు 

టెలీ మెడిసిన్‌ ద్వారా మెరుగైన వైద్యం 

సర్వేంద్రియానం నయనం ప్రదానం. కంటిచూపు లేకపోతే సమస్త ప్రపంచం అంధకారం. లోకాన్ని చూడలేని స్థితిలో కొట్టుమిట్టాడాల్సి వస్త్తోంది. దీన్ని గుర్తించిన ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ కంటి ఆరోగ్యంపై చైతన్యం కల్పించడంతో పాటు పేదలకు ఉచితంగా అధునాతన వైద్యం అందిస్తున్నది. ప్రత్యేక చికిత్సాకేంద్రాలు ఏర్పాటు చేస్తూ రోగులను కనుపాపల్లా కాపాడుతోంది. ఇందులో భాగంగా కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని నాగులబండ వద్ద ద్వితీయ స్థాయి నేత్ర వైద్య కేంద్రాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో ఈ అధునాతన కంటి వైద్యం ప్రజల చెంతకు చేరింది. భవిష్యత్‌లో టెలీ మెడిసిన్‌ ద్వారా నేత్ర వైద్య చికిత్సను జిల్లాలో కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. పేదల కంటికి కాంతి రేఖలను అందిస్తున్న ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌పై ప్రత్యేక కథనం. - కొండపాక, ఫిబ్రవరి 2

గొప్ప సంకల్పం.. 

కంటి సమస్యతో బాధపడుతున్న ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను అందించాలని గొప్ప లక్ష్యంతో ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ సిద్దిపేట పట్టణానికి చేరువలో నాగులబండ వద్ద ద్వితీయ శ్రేణి కంటి దవాఖానను అందుబాటులోకి తెచ్చింది. హేటిరో డ్రగ్స్‌ అధినేత పార్థసారథిరెడ్డి తన కూతురు నాగ సింధూరి పేరిట భవన నిర్మాణానికి రూ.7 కోట్లు ఆర్థిక సాయం అందజేశారు. మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 1.16 ఎకరాల ప్రభుత్వ భూమిని దవాఖాన కోసం కేటాయించారు. గతేడాది జనవరి 20న ఈ కంటి దవాఖాన సకల హంగులతో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకొని వైద్య సేవలు అందిస్తోంది. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్‌ వన్‌ అంతస్తులో ఉన్న ఈ దవాఖాన వేలాది మందికి కంటి చూపు సమస్యలు పరిష్కరిస్తున్నది. 

ఉచితంగా వైద్యం.. శస్త్ర చికిత్స 

ఇక్కడ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి పూర్తిగా ఉచిత వైద్యం, శస్త్ర చికిత్సలు చేస్తారు. కండ్ల అద్దాలు, మందులను ఇస్తారు. శస్త్ర చికిత్స అనంతరం వారికి నయమయ్యే వరకు ఉచితంగా వసతి, భోజనం అందిస్తారు. మధ్యతరగతి వర్గాల నుంచి కేవలం రూ.100 తీసుకొని కంటి పరీక్షలు చేస్తారు. రోగికి శస్త్ర చికిత్స అవసరమైతే కాంట్రాక్టర్‌కు రూ.3500, టెరీజీఎంకు రూ.2500, డీసీటీకి రూ.3500, గ్లకోమాకు రూ.3000, నామమాత్రం ఫీజు తీసుకుంటారు. వీటికి కార్పొరేట్‌ దవాఖానల్లో అయితే పది రెట్లకు పైగా వసూలు చేస్తారని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఓపీలోని రోగులు మాత్రం అద్దాలు, మందులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీఐపీలు కేవలం రూ.200 చెల్లించి కంటి పరీక్ష చేయించుకోవచ్చు.

అందుబాటులో అధునాతన కంటి వైద్యం

ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఓపీలో 14,629 మంది కంటి వైద్యం చేయించుకోగా ఇందులో 3 వేల మందికి పైగా (25 శాతం) ఉచిత వైద్య సేవలు అందించారు. 807 శస్త్ర చికిత్సలు చేయగా ఇందులో 190కి పైగా ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు. ముగ్గురు నిష్ణాతులైన వైద్యులతో పాటు 38 మంది సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. రూ. 2 కోట్ల విలువైన అధునాతన వైద్య పరికరాలతో హైదరాబాద్‌ స్థాయి కంటి వైద్యాన్ని ఇక్కడే అందిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పేదల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి దవాఖానలో చికిత్స చేసిన అనంతరం తిరిగి వారిని సురక్షితంగా ఇండ్ల వద్దకు చేరుస్తున్నారు. 

ప్రారంభమైన ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్లు...

సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖానకు అనుబంధంగా సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని నంగునూరు, చేర్యాల, దౌల్తాబాద్‌, ములుగు మండలంలో ఈ కేంద్రాలు ప్రారంభాన్ని పూర్తి చేసుకొని సేవలు అందిస్తున్నాయి.  మరో నెల రోజుల్లో బెజ్జంకి, కోహెడ, ముస్తాబాద్‌, దుబ్బాక, వర్గల్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌ మండలాల్లో ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్లను ప్రారంభించనున్నట్లు దవాఖాన నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రైమరీ హెల్త్‌ కేర్‌ సెంటర్లలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి అద్దాలు అందజేస్తారు. కంటి చూపు సమస్య తీవ్రంగా ఉన్న వారి ఫొటోలు, వీడియోలు తీసి సిద్దిపేటలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖానకు పంపుతారు. అక్కడి నుంచి వారు హైదరాబాద్‌లోని కంటి వైద్య నిపుణులను సంప్రదించి టెలీమెడిసిన్‌ పద్ధతిలో మెరుగైన వైద్యం అందజేస్తారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేస్తారు. మారుమూల పల్లె నుంచి మొదలుకొని పట్టణాల వరకు కంటి సమస్యతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖాన కాంతిరేఖలు పంచుతున్నది. 

పెద్ద దవాఖానతో.. బాధలు తీరాయి 

సిద్దిపేట పట్టణానికి దగ్గర్లో ఇంత పెద్ద దవాఖాన రావడం నిజంగా అదృష్టం. ప్రైవేటు దవాఖానల్లో వేలాది రూపాయలు ఖర్చు పెడితే తప్ప నయం కానీ సమస్యలు ఇక్కడ తక్కువ పైసలతో తీరిపోతున్నాయి. పేదలకు వరంలాంటిది. 

-తాటిపాముల శాంత ( భారత్‌నగర్‌, సిద్దిపేట) 

ప్రైమరీ కేర్‌ సెంటర్లతో మరిన్ని సేవలు.. 

ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖాన ద్వారా అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా పేదలకు ఉచితంగా వైద్యం, శస్త్ర చికిత్స అందించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రైమరీ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. జిల్లాలో ఇప్పటికే నాలుగు మండలాల్లో ఈ కేంద్రాల ద్వారా వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మరో నెల రోజుల్లో కొత్తగా ఏడు మండలాల్లో ప్రైమరీ కేర్‌ సెంటర్లలో సేవలు ప్రారంభిస్తాం. టెలీ మెడిసిన్‌ పద్ధతి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సహాయాన్ని అందిం చడమే లక్ష్యంగా ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇని స్టిట్యూట్‌ పనిచేస్తోంది. 

- మాధవనేని వంశీధర్‌రావు 

(ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ అడ్మినిస్ట్రేటర్‌, సిద్దిపేట) 

 పట్నం పోయే పని తప్పింది..

కండ్ల్లు మబ్బులు రావడంతో దవాఖానకు వచ్చిన. ఇక్కడ డాక్టర్లు  పరీక్షలు చేసి కంటికి ఆపరేషన్‌ చేశారు. డాక్టర్లు ధైర్యం చెప్పి అన్ని వసతులు సమకూర్చారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న. మా ఊరికి దగ్గర్లోనే ఇంత పెద్ద దవాఖాన ఉండటం.. పట్నం దాకా పోయే పని తప్పింది. 

- సిలివేరి లక్ష్మి (మాత్‌పల్లి) 

 మంచిగా చూస్తున్నరు.. 

ఈ కంటి దవాఖానలో మంచిగా పరీక్షలు చేసి కండ్లద్దాలు ఇచ్చారు. అవసరం ఉన్నోళ్లకు ఆపరేషన్లు చేస్తున్నారు. నేను కూడా ఆపరేషన్‌ చేయించుకున్న. ఇక్కడ మంచి సౌలత్‌లున్నాయి. డాక్టర్లు, నర్సులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంత మంచి దవాఖానను మా కోసం తెచ్చిన సార్లకు దండాలు. 

- కొంపల్లి వరలక్ష్మి (చేర్యాల) 

VIDEOS

logo