మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Feb 03, 2021 , 00:05:23

ఇంధన పొదుపు 'ప్రగతి' మలుపు!

ఇంధన పొదుపు 'ప్రగతి' మలుపు!

ఆదాయం పెంచుకునే దిశగా ఆర్టీసీ అడుగులు 

రోజుకు రూ.40 లక్షల ఆదాయమే లక్ష్యం

ఇంధన, రోడ్డు భద్రత మాసోత్సవాల వేదికగా కార్యాచరణ 

కరోనాతో కష్టాలు చవి చూసిన టీఎస్‌ ఆర్టీసీ పూర్వవైభవం వైపు అడుగులు వేస్తున్నది. ఇంధన పొదుపు, భద్రతా మాసోత్సవాలను వేదికగా చేసుకొని సంస్థను ప్రగతి పథంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నది. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌, ప్రైవేటు వాహనాల నుంచి పోటీ, కరోనాను అధిగమించి ప్రయాణికులను బస్సు ఎక్కించేలా ప్రణాళికలు రచిస్తున్నది. గజ్వేల్‌, సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాక డిపోల పరిధిలో నిత్యం రూ.32 లక్షల ఆదాయం వస్తుండగా, గతంలోలా రూ.40 లక్షలు వచ్చే ప్రణాళికలు చేస్తున్నది. ఆర్టీసీకి పాత రోజులు తెచ్చేలా కార్మికుల్లో ఉత్తేజాన్ని నింపి, సిబ్బందికి నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.      - సిద్దిపేట టౌన్‌, ఫిబ్రవరి 2 

కరోనాతో కష్టాల్లో పడ్డ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) సంస్కరణల బాట పట్టింది. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని పూర్వవైభవం తేవడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌, ప్రైవేట్‌ వాహనాల నుంచి పోటీ, కరోనాను అధిగమించి ప్రయాణికులను బస్సు ఎక్కించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నది. ఇందుకు రోడ్డు భద్రత ఇంధన మాసోత్సవాలను వేదికగా చేసుకొని కార్యాచరణను రూపొందిస్తున్నది. ఆర్టీసీని ప్రగతిపథంలో దూసుకెళ్లేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచసూత్రాల అమలు, లాభాల బాట పట్టేందుకు సంస్థ కార్యాచరణ, ఇంధన పొదుపు తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

- సిద్దిపేట టౌన్‌, ఫిబ్రవరి 2  

ఇంధన పొదుపు, భద్రతా మాసోత్సవాల వేదికగా కార్యాచరణ..

ఇంధన పొదుపు, భద్రతా మాసోత్సవాలను వేదికగా చేసుకొని ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. జనవరి 16న ప్రారంభమైన మాసోత్సవాలు ఫిబ్రవరి 15వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ఐదు డిపోలను ఉన్నతాధికారులు పలుమార్లు సందర్శించి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి ఇంధన పొదుపు, ప్రమాదాల నివారణ, ప్రైవేట్‌ వాహనాల పోటీని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విధి నిర్వహణపై సూచనలు చేశారు. తిరిగి ఆర్టీసీకి పూర్వవైభవం తెచ్చేలా కార్మికుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. 

లక్ష్యం  రూ.40 లక్షలు..

సిద్దిపేట జిల్లాతో పాటు గజ్వేల్‌, చేర్యాల, హుస్నాబాద్‌, దుబ్బాకలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ ఐదు డిపోల పరిధిలో 265 బస్సులు ఉన్నాయి. జిల్లాలో పలు డిపోల నుంచి ఇతర రాష్ర్టాలకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కరోనా కంటే ముందు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీకి నిత్యం రూ.40లక్షల ఆదాయం వచ్చేది. కరోనాతో మూడు నెలల పాటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో సిబ్బందికి జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ కార్మికులకు జీతాలు చెల్లించి ఆర్టీసీ సిబ్బందికి అండగా నిలిచారు. కొవిడ్‌-లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో బస్సు చక్రం రోడ్డెక్కింది. ప్రైవేట్‌ వాహనాల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అనుకున్న ఆదాయం రాకపోవడంతో ఆర్టీసీ పంథా మార్చింది. ప్రయాణికులకు చేరువయ్యేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. జనవరి నుంచి ప్రజారవాణా తిరిగి పుంజుకుంది. ఐదు డిపోల పరిధిలో నిత్యం రూ.32లక్షల ఆదాయం వస్తుండగా, రూ.40లక్షల ఆదాయం సమకూర్చుకునేలా ఆర్టీసీ దూసుకెళ్తున్నది.

పొదుపు మంత్రం.. 

పెరుగుతున్న డీజిల్‌, కరోనా, ప్రైవేట్‌ వాహనాల నుంచి పోటీ తట్టుకొని ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ) తన ఆదాయాన్ని పెంచుకునేందుకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నది. అందులో భాగంగా పంచసూత్రాలు అమలు పర్చుతున్నది. అధికంగా డీజిల్‌పై ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో డీజిల్‌ను పొదుపు చేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఒక లీటరు డీజిల్‌కు 6 కి.మీ వచ్చేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సమన్వయంతో ఇంధన పొదుపు సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇంధనం ఆదాచేస్తే లాభాల బాట పట్టవచ్చని సూచిస్తున్నారు. ఇంధన పొదుపు చేసే, ప్రమాద రహిత డ్రైవర్లకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు. 

ఇంధన పొదుపునకు సూత్రాలు.. 

 అత్యవసరమైతేనే సర్వీసు బ్రేక్‌ వాడాలి. 

 ఎక్స్‌లేటర్‌ను తన్నినట్లు కాకుండా తాకినట్లుగా ఇవ్వాలి. 

 బస్సువేగం ఆధారంగా సరైన సమయంలో గేర్లను మార్చాలి 

 ఇంజిన్‌ ఆన్‌లో పెట్టవద్దు. 

 క్లచ్‌ ఎక్స్‌లేటర్‌ ఒక్కసారి వినియోగించవద్దు.

 పల్లాల రోడ్లపైన వాహనాన్ని న్యూటల్‌ చేయాలి. ఇలా చేయడంతో ఇంధనం ఆదా అవుతుంది. 

 ప్రతి స్టేజీకి వంద మీటర్ల ముందుగానే ఎక్స్‌లేటర్‌పై నుంచి కాలు తీసేయాలి.  

పంచసూత్రాలు.. 

 చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలి. 

 ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి. 

 ప్రధాన కూడళ్ల వద్ద రెండు నిమిషాల పాటు బస్సు ఆపాలి. 

ప్రయాణికులు ఎక్కడ ఆపమంటే అక్కడే బస్సు ఆపాలి. 

స్టేజీ వస్తుందనగానే ప్రయాణికులను అలర్ట్‌ చేయాలి.

ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయం..  

ఆర్టీసీకి పూర్వవైభవం తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇంధన, భద్రతా మాసోత్సవాల వేదికగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నాం. రోజుకు రూ.40 లక్షల ఆదాయాన్ని తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుబాటులో ఉన్న అన్ని వనరులు వినియోగించుకుంటున్నాం. ఇంధన పొదుపుపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రమాద రహిత డ్రైవర్లను, ఆదాయం తీసుకువచ్చే కండక్టర్లను, నగదు ప్రోత్సాహంతో సత్కరిస్తున్నాం. ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. 

- రామ్మోహన్‌రెడ్డి, 

సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌

ఒత్తిడిని జయించాలి.. 

ఆర్టీసీ సిబ్బంది ఒత్తిడిని జయించాలి. సమస్యలన్నీ ఇంటి వద్దనే మరిచిపోవాలి. ఒక్కసారి డ్యూటీలోకి ఎక్కామంటే ఏకాగ్రతంతా డ్రైవింగ్‌పైనే ఉండాలి. ప్రయాణికులందరూ నా కుటుంబ సభ్యులుగానే భావిస్తా. 31 ఏండ్లుగా డ్రైవర్‌ వృత్తిలో ఏ చిన్న ప్రమాదం చేయలేదు. పొదుపు మంత్రాన్ని, పంచసూత్రాన్ని పాటిస్తూ ఇంధనాన్ని ఆదా చేశా. ప్రమాద రహిత డ్రైవర్‌గా ఆరు సార్లు అవార్డులను అందుకున్నా. 

- కేఎస్‌ రావు, ఉత్తమ డ్రైవర్‌ 


VIDEOS

logo