గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 02, 2021 , 00:03:11

యాదాద్రిలా కొమురవెల్లి

యాదాద్రిలా కొమురవెల్లి

వంద ఎకరాల్లో కొండపోచమ్మ ఆలయాన్ని  తీర్చిదిద్దాలి 

కాటేజీల నిర్మాణానికి స్థలం కేటాయించాలి

రోడ్లు, సుందరీకరణ పనులు చేపట్టాలి

యుద్ధ్ద ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి 

మినీ ట్యాంక్‌బండ్‌గా కొండపోచమ్మ చెరువు

మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

ఆలయాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష 

యాదాద్రి తరహాలో కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయాలను అభివృద్ధి చేయాలని, అందుకు తగినట్లుగా కాటేజీలు, ఇతర పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి సోమవారం తీగుల్‌ నర్సాపూర్‌ కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద కొండపోచమ్మ దేవాలయం, కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిపై అధికారులతో వారు సమీక్షించారు. వంద ఎకరాల్లో కొండపోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. మినీ ట్యాంకుబండ్‌గా స్థానిక చెరువును అభివృద్ధి చేయాలని ఆదేశించారు. 

-జగదేవ్‌పూర్‌, ఫిబ్రవరి 1 

జగదేవ్‌పూర్‌, ఫిబ్రవరి 1 : తిరుపతి, యాదాద్రి తరహాలో కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ దేవాలయాలను అభివృద్ధి చేయాలని, అందుకు తగినట్లుగా కాటేజీల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి సోమవారం జగదేవ్‌పూర్‌ మండలంలోని తీగుల్‌ నర్సాపూర్‌ కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద కొండపోచమ్మ దేవాలయం, కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిపై కలెక్టర్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ దేవాలయాలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తుండడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై పంచాయతీరాజ్‌, దేవాదాయ శాఖ అధికారులతో ఆరాతీశారు. మల్లన్న దేవాలయం వద్ద కాటేజీల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారని, కాటేజీల నిర్మాణానికి స్థల కేటాయించాలని రెవెన్యూ ,ఆలయ అధికారులను ఆదేశించారు. కొమురవెల్లి మల్లన్న కొండపైన వాస్తు ప్రకారం స్తపతుల సూచనల ప్రకారం లెవలింగ్‌ చేసి లే ఔట్‌ పనులను 10 రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కొండపైకి రోడ్డు నిర్మాణ పనులపై ఆరాతీశారు. రూ.1.90 కోట్లతో కొంత మేర పనులు చేపట్టామని, మరో రూ.3కోట్లు అవసరమవుతాయని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కనకరత్నం మంత్రికి తెలిపారు. స్పందించిన మంత్రి రోడ్డు, రివిట్‌మెంట్‌ నిర్మాణానికి అవసరమైన రూ.3 కోట్లను మంజూరు చేస్తామన్నారు.అనంతరం మల్లన్న దేవాలయ వెండి ధర్వాజాల పనులు , ఎల్లమ్మ గుడి, బస్టాండ్‌ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి, వీరభద్ర స్వామి ఆలయాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాతిగీరల మండపం, పోచమ్మ టెంపుల్‌ ప్రహరీ పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. 

వంద ఎకరాల్లో కొండపోచమ్మ ఆలయ అభివృద్ధి

కొండపోచమ్మ దేవాలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ రూ.10 కోట్లు మంజూరు చేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆలయ చరిత్ర, ఆలయ  ప్రాశస్త్యాన్ని అనుసరించి వేదపండితులు, స్తపతుల అభిప్రాయాలను తీసుకొని కొండపైన, కింద ఎక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాలో చర్చించి పనులు చేపట్టాలన్నారు. కొండపోచమ్మ దేవాలయాన్ని 100 ఎకరాల్లో విస్తరించాలని, అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రులు హరీశ్‌రావు, తలసాని ఆదేశించారు. 100 ఎకరాల్లో ఫేజ్‌-1 కింద 25 ఎకరాలు, ఫేజ్‌-2 కింద 25 ఎకరాలు, ఫేజ్‌-3 కింద 50ఎకరాలు తీసుకొని అభివృద్ధి చేపట్టాలన్నారు. ఆలయం వద్ద గల 100 ఎకరాల్లో భక్తుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణంతో పాటు వీఐపీలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శానిటేషన్‌, టాయిలెట్లు, పార్కింగ్‌కు పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కింగ్‌ సమస్య పరిష్కారానికి 5 ఎకరాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయాన్ని కొండపైన నిర్మిస్తే బాగుంటుందా, కింద విశాలంగా యాగశాలతో నిర్మిస్తే బాగుంటుందో స్తపతి సూచనలు, ఆలయ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 15న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసానియాదవ్‌తో కలసి ఆలయ అభివృద్ధిపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 

మినీ ట్యాంకుబండ్‌గా కొండపోచమ్మ చెరువు 

కొండపోచమ్మ ముందున్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని, ఆలయం వద్ద ఉన్న రోడ్లను డివైడర్‌ బటర్‌ ఫ్లై లైట్లతో అందంగా ముస్తాబు చేయాలని అధికారులకు మంత్రులు హరీశ్‌రావు, తలసాని ఆదేశించారు. చెరువు చుట్టు వెలుగులు విరజిమ్మేలా లైట్లు ఏర్పాటు చేసి, షోకేజ్‌ చెట్లు నాటించాలని సూచించారు. అంతకు ముందు కొండపోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీక్షలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, కలెక్టర్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, ఆర్డీవోలు అనంత్‌రెడ్డి, విజయానందరెడ్డి, జయచంద్రారెడ్డి, ‘గడా’ ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఈవో మోహన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, సర్పంచ్‌ రజిత రమేశ్‌, ఎంపీపీ బాలేశంగౌడ్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, స్థానిక ఎంపీటీసీ కావ్య దర్గయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ అధ్యక్షుడు రంగారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కొండపోచమ్మ ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo