సోమవారం 01 మార్చి 2021
Siddipet - Feb 01, 2021 , 00:12:29

ఉల్లాసంగా..ఉత్సాహంగా...

ఉల్లాసంగా..ఉత్సాహంగా...

  • హుస్నాబాద్‌లో ఆనందోత్సాహాల మధ్య హాఫ్‌ మారథాన్‌
  • హాఫ్‌ మారథాన్‌, 10కే, 5కే రన్‌లో పాల్గొన్న 1,054 మంది 
  • వందలాదిగా తరలివచ్చిన యువత, విద్యార్థులు
  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, సీపీ జోయల్‌ డెవిస్‌ 

హుస్నాబాద్‌, జనవరి 31: హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోనే తొలిసారి హుస్నాబాద్‌లో జరిగిన హాఫ్‌ మారథాన్‌ ఉల్లాసంగా,ఉత్సాహంగా కొనసాగింది. ఆదివారం ఉదయం 5గంటల నుంచే పట్టణంలోని స్తూపం వద్దకు వందలాది మంది యువతీ యువకులు, విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తరలివచ్చారు. ఉదయం 6:15గంటలకు హాఫ్‌ మారథాన్‌(21కి.మీ.ల పరుగు), 10కే రన్‌, 5కే రన్‌ను ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, సిద్దిపేట సీపీ జోయల్‌ డెవిస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో పాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన కళాకారులు చేసిన నృత్యాలు, పాడిన పాటలు, మ్యాజిక్‌, మిమిక్రీ ఆకట్టుకున్నాయి. హాఫ్‌ మారథాన్‌లో 284మంది పాల్గొనగా, 10కే రన్‌లో 173మంది, 5కే రన్‌ పురుషుల విభాగంలో 513మంది, మహిళల విభాగంలో 84మంది పాల్గొన్నారు. మారథాన్‌ ప్రారంభమయ్యే ప్రదేశంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో తాగునీరు, వైద్య సదుపాయం వంటి సౌకర్యాలు కల్పించారు. పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మెడల్‌, ప్రశంసా పత్రం అందజేశారు. పరుగులో పాల్గొంటున్న రన్నర్లపై ఆయా గ్రామాల ప్రజలు వివిధ రకాల పూలు చల్లుతూ స్వాగతం పలికారు. హాఫ్‌ మారథాన్‌లో హుస్నాబాద్‌ ప్రాంతం నుంచే కాకుండా హైదరాబాద్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, జనగామ తదితర జిల్లాల నుంచి యువత తరలివచ్చారు. 

హాఫ్‌ మారథాన్‌ విజేతలు వీరే.. 

హుస్నాబాద్‌లో నిర్వహించిన హాఫ్‌ మారథాన్‌ విజేతగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన పోదర్ల అభిషేక్‌ నిలిచాడు. 21కి.మీ.ల పరుగును 1:36గంటల్లో పూర్తిచేశాడు. ఇతనికి రూ.25వేల నగదు, మెడల్‌, ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, సీపీ జోయల్‌ డెవిస్‌ అందజేశారు. రెండో స్థానంలో అక్కన్నపేటకు చెందిన భూక్య చంద్రశేఖర్‌, మూడో స్థానంలో అక్కన్నపేట మండలం గుడాటిపల్లికి చెందిన మిట్టపల్లి దామోదర్‌ గెలిచారు. 10కే రన్‌లో మిర్యాలగూడకు చెందిన అఖిల్‌ ప్రథమ స్థానంలో నిలువగా, ఇదే పట్టణానికి చెందిన ధనుష్‌ ద్వితీయ స్థానం, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరికి చెందిన బైరి అఖిల్‌ మూడో స్థానంలో నిలిచారు. 5కేరన్‌ పురుషుల విభాగంలో అక్కన్నపేట మండలం మల్చెర్వుతండాకు చెందిన బానోతు వినోద్‌ ప్రథమస్థానం, ఇదే గ్రామానికి చెందిన గుగులోతు నరేశ్‌ రెండో స్థానం, నంగునూరు మండలం ముండ్రాయికి చెందిన పి.శ్రీకాంత్‌ మూడో స్థానం సాధించారు. 5కే రన్‌ మహిళల విభాగంలో సిద్దిపేటకు చెందిన వడ్లకొండ చైతన్యశ్రీ ప్రథమ, కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన బానోతు సోనీ ద్వితీయ, కోహెడ మండలం ధర్మసాగర్‌కు చెందిన పెండెల హేమలత తృతీయ స్థానంలో విజయం సాధించి నగదు బహుమతులు పొందారు.  

ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ అన్నారు. ఆదివారం తెల్లవారుజామున హుస్నాబాద్‌ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డు స్తూపం ఆవరణలో హాఫ్‌ మారథాన్‌ (21కి.మీ.ల పరుగు), 10కే రన్‌, 5కే రన్‌లను ప్రారంచించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.  రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్‌ నిబంధనలపై చైతన్యం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. హాఫ్‌ మారథాన్‌కు పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తరలిరావడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.  వచ్చే ఏడాది ఫుల్‌ మారథాన్‌(42కి.మీ.ల పరుగు) నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఈ ప్రాంత యువతీ యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధం కావాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి రామేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ మహేందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితావెంకట్‌, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాసర్ల అశోక్‌బాబు, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు శ్రీధర్‌, కె.రవి, రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య, కౌన్సిలర్లు,  సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

VIDEOS

logo